సంక్షిప్త వార్తలు(5)

వృద్ధులైన పింఛన్‌దారులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలని ఆంధ్ర పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్‌ పేర్కొన్నారు.

Updated : 16 Apr 2024 05:05 IST

పెన్షనర్లను మోసం చేయడమే జగన్‌ లక్ష్యం
ఆంధ్ర పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్‌

నెల్లూరు, న్యూస్‌టుడే: వృద్ధులైన పింఛన్‌దారులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలని ఆంధ్ర పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్‌ పేర్కొన్నారు. నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ను రీస్టోర్‌ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్‌ రాస్తామని జగన్‌ మనల్ని నమ్మించే ప్రయత్నం చేయనున్నారు. ఎలాగూ వారు అనుమతి ఇవ్వరు. చూశారా నేను ఇద్దామని అనుకుంటే చంద్రబాబు అడ్డుపడ్డారని చెప్పి సానుభూతి పొందాలని చూస్తున్నారు. 1వ తేదీన రావాల్సిన పింఛన్లు రావడం లేదు. సంవత్సరాలు గడుస్తున్నా డీఏ, ఎరియర్స్‌ ఊసు లేదు’ అని సుబ్బరాయన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


వేతనాల కోసం ఏపీవీవీపీ, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఎదురుచూపులు

ఈనాడు, అమరావతి: వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ), జాతీయ ఆరోగ్య మిషన్‌ల (ఎన్‌హెచ్‌ఎం) కింద పనిచేసే ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు ఇప్పటివరకు చెల్లించలేదు. ఏప్రిల్‌ ప్రారంభమై.. 2 వారాలు గడిచినా వేతనాలు చెల్లించలేదని వారు ఆందోళన చెందుతున్నారు. ఏపీవీవీపీ కార్యాలయాలు, ఆసుపత్రుల్లో సుమారు 14వేల మంది పనిచేస్తున్నారు. వీరికి 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలన్న నిర్ణయం తీసుకుని చాలా కాలమైనప్పటికీ...అందుకు తగ్గట్లు తదుపరి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవడంతో వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద పొరుగు, ఒప్పంద విధానంలో పనిచేసే సుమారు 22 వేల మందికి కూడా మార్చి నెల వేతనాలు ఇంతవరకు ఇవ్వలేదు. ప్రతినెలా కనీసం రూ.70 కోట్ల వరకు వేతనాలుగా చెల్లించాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే కార్యక్రమాల కింద వీరు పనిచేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు సక్రమంగా వస్తున్నా...రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ.. ప్రభుత్వ వాటి ఇంతవరకు జమకాలేదు. ఈ కారణంగానే ప్రస్తుతం వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఉద్యోగులు చెబుతున్నారు.


‘ఐకాయ్‌’తో వాణిజ్య పన్నులశాఖ ఒప్పందం

ఈనాడు-అమరావతి: జీఎస్టీ విధానంపై ఉద్యోగులకు శిక్షణ, సాంకేతిక నైపుణ్యం మెరుగుదల నిమిత్తం ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐకాయ్‌)తో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ రెండేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమం మంగళగిరిలోని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ మాట్లాడుతూ.. ఆడిటర్లు, పన్నుల శాఖ అధికారులు ఉత్తర, దక్షిణ ధ్రువాలనే అభిప్రాయాన్ని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. డివిజన్‌, రాష్ట్రస్థాయిలో ట్రేడ్‌ అడ్వయిజరీ కమిటీలు ఏర్పాటు చేశామని.. విధానపరమైన నిర్ణయాలు, సాంకేతికత ఆధారంగా పన్ను ఎగవేసే వారిని గుర్తిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తుల ప్రమేయాన్ని నియంత్రిస్తూ డేటా అనలిటిక్‌ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. తాజా ఒప్పందం ద్వారా అపోహలు తగ్గుతాయని, పన్ను చెల్లింపు వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు పరస్పరం సహకరించుకోవాలని పేర్కొన్నారు. ఐకాయ్‌ కార్యదర్శి జయకుమార్‌ భాత్ర, ఐకాయ్‌ జీఎస్టీ, పరోక్ష పన్నుల కమిటీ ఛైర్మన్‌ సుశీల్‌కుమార్‌ గోయల్‌, వైస్‌ఛైర్మన్‌ రాజేంద్రకుమార్‌ మాట్లాడుతూ.. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ కార్యక్రమంలో తాము ముఖ్య భాగస్వామిగా ఉన్నట్లు తెలిపారు. గోవా, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాలతోనూ ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్‌ అధికారులు రమేశ్‌, కృష్ణమోహన్‌రెడ్డి, రవిశంకర్‌ పాల్గొన్నారు.


22న కృష్ణా బోర్డు సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సమావేశం ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపురే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సమాచారం పంపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బోర్డుకు సంబంధించిన బడ్జెట్‌పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశంలో బోర్డు ఛైర్మన్‌ శివ్‌నందన్‌ కుమార్‌, తెలంగాణ నీటిపారుదల కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి పాల్గొననున్నారు.


రాష్ట్రంలో పట్టుబడిన సొత్తు రూ.125.96 కోట్లు

ఈనాడు, అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రూ.125.96 కోట్లు పట్టుబడినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడించారు. ఇందులో రూ.32.15 కోట్ల నగదు, రూ.19.72 కోట్ల విలువైన మద్యం, రూ.4.06 కోట్ల విలువైన డ్రగ్స్‌, రూ.57.14 కోట్ల విలువైన ప్రెషస్‌ మెటల్స్‌, రూ.12.89 కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు