ఆధారాల కోసం ఆపసోపాలు!

ముఖ్యమంత్రి జగన్‌పై రాయి దాడి ఘటనకు సంబంధించి 48 గంటలు గడిచినా పోలీసులు ఎటువంటి ఆధారాలు సంపాదించలేకపోయారు. ఈ ఘటనపై సీపీ కాంతిరాణా 8 బృందాలతో ప్రత్యేక దర్యాప్తు చేయిస్తున్నారు.

Published : 16 Apr 2024 05:17 IST

జగన్‌పై రాయి దాడి కేసులో సీసీ కెమెరాలు, వీడియోల్లో కనిపించని నిందితుడి జాడ
అనుమానితుల ఇంటరాగేషన్‌లోనూ బయటపడని క్లూ

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌పై రాయి దాడి ఘటనకు సంబంధించి 48 గంటలు గడిచినా పోలీసులు ఎటువంటి ఆధారాలు సంపాదించలేకపోయారు. ఈ ఘటనపై సీపీ కాంతిరాణా 8 బృందాలతో ప్రత్యేక దర్యాప్తు చేయిస్తున్నారు. గంజాయి బ్యాచ్‌, సస్పెక్ట్‌, రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు, తదితర 100 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఆ మార్గంలోని సీసీ కెమెరాల్లో దృశ్యాలను పరిశీలించినా, రోడ్‌షోకు వచ్చినవారు చిత్రీకరించిన వీడియోలను కూడా తరచిచూసినా ఫలితం శూన్యం. సీఎంపై రాయి పడిన సమయంలో జగన్‌ కాన్వాయ్‌ డాబా కొట్ల రోడ్డులోని వివేకానంద పాఠశాల వద్దకు చేరింది. ఆ పాఠశాల వైపు నుంచే అరచేతిలో పట్టేంత రాయి వచ్చిందని.. తొలుత సీఎంకు, తర్వాత మాజీ మంత్రి వెలంపల్లికి తగిలిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో రాయి ఎవరు వేశారనేది తెలియడం లేదు.

షెడ్యూల్‌లో లేకపోయినా బస్సెక్కి జగన్‌ అభివాదం

విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ రోడ్‌షోలో నాలుగు చోట్ల మాత్రమే సీఎం ఓపెన్‌ టాప్‌పై నిలబడి అభివాదం చేస్తారని, మిగతా అన్ని చోట్ల బస్సులో నుంచే చేయి ఊపుతారని వైకాపా షెడ్యూల్‌ తయారు చేసినట్లు సమాచారం. కానీ జగన్‌ నగరంలో షో జరిగిన దాదాపు 22 కి.మీ. మేర ఓపెన్‌ టాప్‌పైనే నిలబడ్డారు. అన్నీ రద్దీ ప్రాంతాలు కావడం, బస్సుపైన నిలబడితే చేతికందే ఎత్తులోనే కరెంటు తీగలు ఉండడంతో విద్యుత్తు సరఫరా ఆపేశారు. ఆ చీకట్లోనే రాయి దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని