జగన్‌పై రాయితో దాడి చేస్తే హత్యాయత్నమా?

ముఖ్యమంత్రి జగన్‌పైకి విజయవాడలో ఎవరో ఆగంతకుడు రాయి విసరడం... విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా దృష్టిలో హత్యాయత్నం.

Updated : 16 Apr 2024 09:16 IST

అదే చంద్రబాబుపై జరిగితే పూలతో వచ్చి తగిలిందంటారా?
అప్పుడూ, ఇప్పుడూ సీపీగా ఉన్నది కాంతిరాణానే
చంద్రబాబుపై దాడి దర్యాప్తులో మాత్రం బాధ్యతారాహిత్యం

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌పైకి విజయవాడలో ఎవరో ఆగంతకుడు రాయి విసరడం... విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా దృష్టిలో హత్యాయత్నం. ఆ ఘటన తీవ్రత, పరిస్థితుల్నిబట్టే ఐపీసీ సెక్షన్‌ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశామని సోమవారం ఆయన విలేకర్లతో చెప్పారు. ముఖ్యమంత్రికి పూలదండ వేసినప్పుడు గాయమైందని అంటున్నారు కదా అని విలేకర్లు ప్రశ్నిస్తే.. కాదు, రాయి విసరడం వల్లే దాడి జరిగిందని చెప్పుకొచ్చారు. రాయి ఎవరు విసిరారో, ఎలా విసిరారో తెలియకుండానే, దాడి చేసిన దుండగుల్ని పట్టుకోకుండానే, సీఎంకి తగిలిందని చెబుతున్న రాయి దొరక్కుండానే, దర్యాప్తు కొలిక్కి రాకముందే.. అది రాయి దాడేనని ఆయన తేల్చేశారు.

2022 నవంబరు 4న మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నందిగామలో రాళ్ల దాడి జరిగింది. ప్రమాదాన్ని పసిగట్టి చంద్రబాబుకు అడ్డుగా నిలబడిన ముఖ్య భద్రతాధికారి మధుసూదనరావు గెడ్డానికి ఓ రాయి బలంగా తగలడంతో రక్తగాయమైంది. చంద్రబాబుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అప్పుడూ ఇదే కాంతిరాణా సీపీగా ఉన్నారు. చంద్రబాబుపైకి పూలు వేసినప్పుడు.. వాటితో పాటు రాయి వచ్చి ఉండొచ్చని ఆయన ఆ ఘటనను తేలిక చేసి మాట్లాడారు. ఆ ఘటనపై హత్యాయత్నం  కేసు నమోదు చేయాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేసినా పట్టించుకోలేదు. వెంటనే కేసు కూడా నమోదు చేయలేదు. తెదేపా నేతలు ఒత్తిడి పెంచడంతో అతి కష్టం మీద సెక్షన్‌ 324 (ప్రమాదకర ఆయుధంతో దాడి) కింద కేసు కట్టారు. ఇంత వరకు నిందితులెవరో గుర్తించలేదు. అసలా కేసు దర్యాప్తు జరుగుతుందో లేదో కూడా తెలీదు.

ఒకే సీపీ.. ఒకే తరహా ఘటనలు.. స్పందన మాత్రం వేరు

అప్పుడూ, ఇప్పుడూ సీపీ ఒక్కరే. జరిగింది ఒకే తరహా ఘటనలు. ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి. మరొకరు జెడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి. కానీ అప్పుడూ, ఇప్పుడూ సీపీ స్పందించిన తీరే ఆయన ఏకపక్ష వైఖరికి అద్దం పట్టింది. ఎంత అధికార పార్టీతో అంటకాగితే మాత్రం.. బాధ్యతాయుతమైన పోలీసు కమిషనర్‌ పోస్టులో ఉన్న అధికారి స్పందించేది ఇలాగేనా? తన వైఫల్యాల్ని, పక్షపాతధోరణిని ప్రశ్నించిన మీడియా, విపక్షాలపై కాంతిరాణా ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేశారే.. తమపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని గింజుకున్నారే..! పోలీసు నాయకత్వాన్ని ఆత్మరక్షణలో నెట్టేయడానికి అవమానకరమైన ఆరోపణలతో కథనాలు రాస్తున్నారని తెగ బాధపడిపోయారే..! పోలీసు అధికారులు ఏ పార్టీకీ కొమ్ముకాయకుండా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తే ఎవరైనా వారిని ఎందుకు తప్పుపడతారు? మీరు ఏ మాత్రం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదనడానికి... సీఎం జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబుపై దాడి జరిగిన సందర్భాల్లో మీరు స్పందించిన తీరే అద్దంపడుతోంది కదా! 

ఇది మీ ఘోర వైఫల్యం కాదా?

విజయవాడ నడిబొడ్డున, పోలీసు కమిషనర్‌ నివాసానికి ఐదు కి.మీ.ల దూరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉండే ముఖ్యమంత్రిపై ఎవరో ఆగంతకుడు రాయితో దాడి చేయడం, జెడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉండే ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబుపై రాయితో దాడిచేసిన దుండగుల్ని ఏడాదిన్నరైనా ఇప్పటికీ పట్టుకోలేకపోవడం సీపీగా కాంతిరాణా ఘోర వైఫల్యమే. చిన్నదైనా, పెద్దదైనా ముఖ్యమంత్రిపై దాడి ఘటనే జరగకూడదు. ప్రతి ఒక్కరూ దాన్ని ఖండించాల్సిందే. తీవ్రంగా పరిగణించాల్సిందే. ముఖ్యమంత్రిపై దాడి ఘటనకు ఘోర భద్రతా వైఫల్యమే కారణం. కానీ దానికి బాధ్యత తీసుకోవడానికి కాంతి రాణా సిద్ధంగా లేరు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన సీఎస్‌, డీజీపీ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వంటివారు మౌనంగా ఉన్నారు. కాంతిరాణా ప్రభుత్వ పెద్దలకు అస్మదీయుడు కాబట్టి ఆయనపై చర్య తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవచ్చు. సీఎంపై దాడికి సంబంధించి రెండు రోజుల తర్వాతైనా సీపీ మీడియా ముందుకొచ్చారు. ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. జగన్‌కి రాయి తగులుతున్న దృశ్యాల సీసీటీవీ ఫుటేజ్‌ను మరింత మెరుగ్గా చూపేందుకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపించినట్టు చెప్పారు. రాయి విసిరిన వారి ఆచూకీ చెప్పినవారికి రూ.2 లక్షల రివార్డూ ప్రకటించారు.


మరి అప్పుడెందుకు స్పందించలేదు?

మరి తెదేపా అధినేత చంద్రబాబుపై దాడి జరిగి ఇన్నాళ్లయినా ఇదే చొరవా, స్పందనా కాంతి రాణా ఎందుకు చూపించలేదు? అప్పట్లోనూ సిట్‌ ఏర్పాటు చేసి, రివార్డు ప్రకటిస్తే నిందితులు దొరికేవారేమో? చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మరో పదిహేనేళ్లు ప్రధాన ప్రతిపక్షనేతగా పనిచేసిన సీనియర్‌ నాయకుడు. గతంలో మావోయిస్టులు క్లెమోర్‌మైన్స్‌తో దాడి చేస్తే చంద్రబాబుతో పాటు సహచర నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆయనకు జెడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించింది. దక్షిణ భారతదేశంలోనే ఎన్‌ఎస్‌జీ దళాల భద్రత కలిగిన ఏకైక నాయకుడు ఆయనే. అలాంటి నేతపై దాడి జరిగితే సీపీ ఎంత వేగంగా స్పందించాలి? అప్పట్లో సీఎస్‌వో అడ్డుగా వచ్చారు కాబట్టి చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. అదే రాయి నేరుగా ఆయనకు తగిలితే ఏమయ్యేది? సీఎం జగన్‌పైకి విసిరిన రాయి సున్నితమైన ప్రదేశాల్లో తగిలితే ఎంతో ప్రమాదం జరిగేదో అంటూ సీపీ ఆందోళన కనబరిచారు. మరి చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు ఎందుకంతగా స్పందించలేదు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని