ఇప్పటికీ దస్తగిరిని బెదిరిస్తున్నారు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన తనకు వైఎస్‌ అవినాష్‌రెడ్డి అనుచరుల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని దస్తగిరి తెలంగాణ హైకోర్టుకు సోమవారం నివేదించారు.

Updated : 16 Apr 2024 06:07 IST

నిందితులు ఎవరినైనా ప్రభావితం చేయగల బలవంతులు
వ్యవస్థ వారి చేతిలోనే..
బయట ఉంటే పారదర్శక విచారణ జరగదు
అవినాష్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలి
తెలంగాణ హైకోర్టులో దస్తగిరి, సీబీఐ, సునీతల వాదన

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన తనకు వైఎస్‌ అవినాష్‌రెడ్డి అనుచరుల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని దస్తగిరి తెలంగాణ హైకోర్టుకు సోమవారం నివేదించారు. జగనన్న పైనే పోటీ చేస్తావా అంటూ బెదిరిస్తున్నారన్నారు. పోలీసులు, జైలు అధికారులతో సహా వ్యవస్థ మొత్తం వారి చేతుల్లోనే ఉందని, తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. అవినాష్‌రెడ్డికి అనుకూలంగా చెప్పాలని బెదిరిస్తున్నారన్నారు. ఈ కేసులో నిందితుడైన వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలును రద్దు చేయాలని కోరుతూ దస్తగిరి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ సోమవారం ఇరుపక్షాల వాదనలను విని తీర్పును వాయిదా వేశారు. అంతకుముందు సీబీఐ తరఫు న్యాయవాది అనిల్‌ తల్వార్‌ వాదనలు వినిపిస్తూ దస్తగిరిని పోలీసులు రకరకాలుగా బెదిరించారన్నారు. శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి ఏకంగా జైలుకు వచ్చి రూ.20 కోట్లు ఆఫర్‌ చేశారని, అంగీకరించకపోవడంతో ‘జైలు కాబట్టి బతికిపోయావ్‌ లేదంటే నరికేసేవాడినంటూ’ బెదిరించారన్నారు.

పారదర్శక విచారణ జరగాలి: సునీత 

ఈ కేసులో నిష్పాక్షికంగా విచారణ కొనసాగాలంటే అవినాష్‌రెడ్డి బెయిలును రద్దు చేయాల్సిందేనని సునీత తరఫు సీనియర్‌ న్యాయవాది బి.నళిన్‌కుమార్‌ కోరారు. ఈ కేసులో దస్తగిరి, ఆయన భార్య చేసిన ఫిర్యాదులే దీనికి నిదర్శనమన్నారు. కస్టడీలో ఉన్న దస్తగిరిని మార్గమధ్యంలో కొట్టి బెదిరించారన్నారు. వైకాపా కౌన్సిలర్‌ రాజశేఖరరెడ్డితోపాటు భాను తదితరులు ఆయన భార్యను బెదిరించారని, ఆయన తండ్రిపై దాడులు చేశారని తెలిపారు. జైలులో 14 రోజులపాటు లాకప్‌లోనే ఉంచి వేధించారని, ఆత్మహత్య చేసుకుంటానని అనడంతో బయటకు తీసుకువచ్చినట్లు దస్తగిరి ఫిర్యాదు చేశారన్నారు. జైలులో చైతన్యరెడ్డి రూ.20 కోట్లు ఆఫర్‌ చేశారనే విషయాన్ని ఆయన భార్యకు చెప్పగా, దానిపై ఆమె సీబీఐకి ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో జైలు అధికారులు దస్తగిరిని బెదిరించి, మతిస్థిమితం లేక భార్య అలా చెప్పిందంటూ ప్రకటన ఇవ్వాలని ఒత్తిడి తీసుకువచ్చారన్నారు.

అవినాష్‌రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ వివేకా హత్యకు ఆయుధాన్ని తీసుకువచ్చి, హత్య ఘటనలో పాల్గొన్న వ్యక్తికి బాధితులైన సునీత, సీబీఐ వత్తాసు పలకడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చైతన్యరెడ్డి జైలులో కలిసి రూ. 20 కోట్లు ఇస్తారన్నారని, జైలు సీసీ కెమెరాలుంటాయని, చుట్టూ డాక్టర్లు, అధికారులు ఉండగా ఇదెలా సాధ్యమని అన్నారు. దస్తగిరి తండ్రి రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారని, ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారన్న ఫిర్యాదులో అవినాష్‌రెడ్డి పేరు లేదని తెలిపారు. కోర్టును తప్పుదోవ పట్టించినందున జరిమానా విధించాల్సి ఉందన్నారు.

నిందితులు తిమింగలాల వంటివారు

ఈ వాదనతో దస్తగిరి తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ విభేదిస్తూ పిటిషనర్‌కు వ్యతిరేకంగా తీవ్రమైన సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయన్నారు. పదేపదే తప్పుడు కేసులు బనాయిస్తూనే ఉన్నారన్నారు. కుటుంబానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారని, ఆదివారం కూడా బెదిరింపులు వచ్చాయని తెలిపారు. పోలీసు అధికారులు, జైలు అధికారులు సహా వ్యవస్థ అవినాష్‌రెడ్డికి అనుకూలంగా ఉందన్నారు. జైలులో సీసీ కెమెరాలు ఉద్దేశపూర్వకంగానే పనిచేయకుండా చేశారని ఆరోపించారు. అవినాష్‌రెడ్డి బెయిలును రద్దుచేయాలంటూ మార్చి 11న ఇక్కడ పిటిషన్‌ దాఖలు చేశానని, అయితే చైతన్యరెడ్డి మార్చి 2న జైలు అధికారుల నుంచి సమాచార హక్కు చట్టం కింద వివరాలు తీసుకున్నారని వెల్లడించారు. లేదంటే పాత తేదీతో తీసుకున్నారేమో తెలియదని చెప్పారు. దస్తగిరి తండ్రి.. దాడికి గురై గాయపడి చికిత్సకు వెళితే, డాక్టరు వాహనం మీది నుంచి పడినట్లు చెబుతున్నారన్నారు. జగన్‌ అధికారాన్ని, అండ చూసుకుని అవినాష్‌రెడ్డి పోలీసులతో కలిసి సాక్షులను బెదిరిస్తున్నారన్నారు. నిందితులు తిమింగలాల వంటివారని, వారు ఎవరినైనా ప్రభావితం చేయగలరని, సాక్షులను బెదిరించినట్లు స్పష్టమైన ఆధారాలున్నందున బెయిలును రద్దు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు