ఎన్నికల కోడ్‌ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమట!

విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ నెల 23న ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించాలంటూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదేశాలనిచ్చారు.

Updated : 16 Apr 2024 10:06 IST

23న నిర్వహించాలంటూ టీచర్లకు ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ నెల 23న ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించాలంటూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదేశాలనిచ్చారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఈ సమావేశాల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల వార్షిక నివేదికలను ఆ రోజు తల్లిదండ్రులకు అందజేయాలని, ఏడాది పొడవునా విద్యార్థుల భాగస్వామ్యంపై చర్చించాలని ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదేశించారు. తల్లిదండ్రులు వందశాతం హాజరయ్యేందుకు చర్యలు తీసుకోవాలని, హాజరు ఆవశ్యకతను ఇప్పటినుంచే చెప్పాలని సూచించారు. ఓటర్లయిన విద్యార్థుల తల్లిదండ్రులతో ఎన్నికల సమయంలో సమావేశాలు ఎలా నిర్వహిస్తారన్నది చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పథకాల గురించి ఉపాధ్యాయులతో చెప్పించేందుకే దీన్ని నిర్వహిస్తున్నారని స్పష్టమవుతుంది. వారిని ప్రభావితం చేసేందుకే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ తెరవెనుక ప్రయత్నిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో నేరుగా తాను ఆన్‌లైన్‌లో పాల్గొంటానని ప్రకటించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఎలా చేస్తారన్న ప్రశ్నలతో ఇప్పుడు తన సందేశాన్ని వినిపించాలంటూ కొత్త ప్రచారం చేపట్టారు. జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. అప్పటికి పోలింగ్‌ పూర్తవుతుంది. అప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించుకోవచ్చు కదా? అన్న ప్రశ్నలొస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని