గాదె కింద పందికొక్కు.. కోతవేసె పప్పూ ఉప్పు!

అలా.. అలా.. అలా.. ఇలా.. ఇలా.. ఇలా.. అంటూ డ్రిల్‌ మాస్టారిలా చేతులు ఊపుతూ.. సభలకు వచ్చినవారితోనూ అలానే ఊపిస్తారు జగన్‌. ఆయన అనుకున్నదే.. జనం మాటగా చెప్పిస్తారు.

Updated : 16 Apr 2024 15:29 IST

రేషన్‌ దుకాణాల్లో పేదలకు పాట్లు.. పెద్దలకేమో రూ.వందల కోట్లు
కిలో కందిపప్పు ఇవ్వడమూ చేతకాని సీఎం.. ఇంకేం చేస్తారు
ఈనాడు, అమరావతి

అలా.. అలా.. అలా.. ఇలా.. ఇలా.. ఇలా.. అంటూ డ్రిల్‌ మాస్టారిలా చేతులు ఊపుతూ.. సభలకు వచ్చినవారితోనూ అలానే ఊపిస్తారు జగన్‌. ఆయన అనుకున్నదే.. జనం మాటగా చెప్పిస్తారు. ప్రతిపక్షాలపై బురదజల్లడంలో అది ఆయన శైలి. రేషన్‌ సరఫరా బాలేదంటూ.. ప్రతిపక్షనేతగా సభల్లో అలానే చేతులు ఊపించారు. తన పాలనలో రేషన్‌ వ్యవస్థ కుదేలైనా.. ఎక్కడా ఆ ఊసే ఎత్తడంలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చేదాంట్లోనే.. ఎన్నో కోతలు పెట్టారీ.. కోతల రాయుడు!


అప్పుడు చేతులలా తిప్పమన్నారు..

చంద్రబాబు పాలనలో రేషన్‌ దుకాణాల్లో బియ్యం తప్ప మరేమీ దొరకడం లేదు. ఇలా ఇలా చేతులు తిప్పుతూ (అరచేతులు వెనక్కి, ముందుకు తిప్పుతూ) దొరకడం లేదని చెప్పండి..’

ప్రతిపక్షనేతగా జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలివి.


ఇప్పుడు అడిగే దమ్ముందా?

‘మా పాలనలో రేషన్‌ మెరుగ్గా ఉందో లేదో.. ఇలా ఇలా చేతులు తిప్పుతూ చెప్పండ’ని జనాల్ని ఇప్పుడు అడగ్గలరా జగన్‌? అడగలేరు! ఎందుకంటే.. ఇప్పుడు రేషన్‌ ద్వారా పంపిణీ అవుతున్నది బియ్యం మాత్రమే. జగన్‌ రాగానే కందిపప్పుని రెండు కిలోల నుంచి కిలోకు తగ్గించారు. అది కూడా సరిగ్గా ఇవ్వడంలేదు. రాగులు, జొన్నలు, గోధుమల పంపిణీని మొదట్లోనే ఆపేశారు. మళ్లీ ఈమధ్యనే ప్రారంభించి అంతలోనే నిలిపేశారు. అందుకే ఆయన నోట రేషన్‌ మాట రావడమే లేదు!


దేళ్ల వైకాపా ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. తెదేపా హయాంలో మనిషికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి రెండు కిలోల కంది పప్పుతోపాటు రెండు కిలోల (ఆ మేరకు బియ్యం తగ్గించి) రాగులు, జొన్నలు, కిలో గోధుమపిండి, ఉప్పు  తదితరాలు ఇచ్చేవారు. అయినా... బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదని చెప్పమంటూ ప్రతి సభలోనూ అప్పటి ప్రతిపక్షనేత జగన్‌ ప్రజల్ని రెచ్చగొట్టారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు అదే జగన్‌కు రేషన్‌పై మాట్లాడాలంటే గొంతు పెగలడం లేదు. తమ ప్రభుత్వం ఏం ఇస్తుందో చెప్పే ధైర్యమూ చాలట్లేదు. వైకాపా పాలనలో రేషన్‌ పంపిణీ అంటే ప్రజలకు మిగిలింది బియ్యమే! అవి కూడా కేంద్రం ఇస్తోంది కాబట్టి.. దానికి కొంత జోడించి పంపిణీ చేస్తున్నారు. సన్నబియ్యం పంపిణీ చేస్తామన్న హామీకి జగన్‌ ఎప్పుడో నీళ్లొదిలేశారు. కందిపప్పు, పంచదార రేట్లు పెంచేసి.. అవీ సరిగా ఇవ్వకుండా సతాయిస్తున్నారు. పేద కుటుంబాలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు నిత్యావసరాలు కొనుగోలు  చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రజా పంపిణీ వ్యవస్థను నీరుగార్చారు. కమీషన్ల రూపంలో వైకాపా పెద్దలు మాత్రం వందల కోట్లు వెనకేసుకున్నారు. మరోవైపు పౌరసరఫరాల సంస్థనేమో రూ.35వేల కోట్లకు పైగా అప్పుల్లోకి నెట్టేశారు.

అడ్డూ అదుపూ లేని దోపిడీ

రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులో కొందరు వైకాపా ప్రజాప్రతినిధులు నెలకు రూ.కోట్లలో వసూలు చేస్తున్నారు. విదేశాలకు రేషన్‌ బియ్యం ఎగుమతి చేసే పెద్దలకే  పౌరసరఫరాల సంస్థలో కీలక పదవులు కట్టబెట్టారు. కొందరు అమాత్యులకు రాజభవనాలే కట్టించి ఇచ్చారు. పౌరసరఫరాల సంస్థలో అడ్డూ అదుపూ లేని దోపిడీ జరుగుతున్నా.. వైకాపా సర్కారు వారికే వంత పలుకుతోంది. కందిపప్పు మార్కెట్లో రూ.80 ఉన్నప్పుడు రూ.118 లెక్కన కొనుగోలు చేసినా, ఇష్టారాజ్యంగా టెండర్లు, బ్యాంకు గ్యారంటీలు తీసుకున్నా.. విచారణ, చర్యలు లేవు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో పామోలిన్‌ సరఫరా టెండరు ఆమోదించి.. రేట్లు తగ్గాక అధిక ధరలకు కొన్నారు. లీటరు రూ.95 ఉంటే రూ.137 చొప్పున సరఫరా చేయించడం ద్వారా రూ.80 కోట్లకు పైగా దోచుకున్నట్లు అంచనా. నాసిరకం గోధుమ పిండి పంపిణీ చేస్తూ.. రవాణా, అధిక ధరల పేరుతో.. పెద్దఎత్తున దోపిడీ చేశారు. ఇప్పుడదీ ఇవ్వడం లేదు. రాయలసీమ నుంచి సేకరించిన రాగుల్ని ఉత్తరాంధ్రలోని మిల్లులకు  తరలించినట్లు చూపి భారీ రవాణా ఛార్జీలను నొక్కేశారు.

నిత్యావసరాలకు కోత పెట్టి.. ధరలు పెంచి

2019 వరకు రాష్ట్రంలో కార్డుకు 2 కిలోల చొప్పున కందిపప్పు, కిలో గోధుమపిండి, ఉప్పు, రాగులు, జొన్నలు పంపిణీ చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాగులు, జొన్నలు ఎత్తేశారు. ఈమధ్యే రాయలసీమ జిల్లాల్లో పంపిణీ ప్రారంభించినట్లే ఆరంభించి అంతలోనే మంగళం పాడారు. ఉత్తరాంధ్రలో గోధుమ పిండి పంపిణీ ప్రారంభించి.. దానికీ విరామం ఇచ్చారు.

రేషన్‌ పంపిణీపై ఎన్ని మడతలో?

వైకాపా అధికారంలోకి రాగానే.. సన్నబియ్యం తీసేసింది, నాణ్యమైన బియ్యాన్ని అయిదు, పది కిలోల సంచుల్లో నింపి ఇస్తామంటూ.. యంత్రాలు, సంచుల తయారీకి రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేశారు. తర్వాత వాటిని మూలనపడేశారు. ఎండీయూ(మొబైల్‌ డెలివరీ యూనిట్‌) విధానంలో గడప వద్దకే రేషన్‌ పేరుతో రూ.540 కోట్ల వ్యయంతో 9,260 వాహనాలను కొనుగోలు చేసినా.. నిర్వహణకు ఏడాదికి రూ.250 కోట్ల చొప్పున రూ.1,000 కోట్లు వ్యయం చేసినా ఎప్పుడొస్తుందో తెలియని వాహనం కోసం వీధి మొదట్లోకి వెళ్లి కార్డుదారులు నిరీక్షించాల్సి వస్తోంది. చాలాచోట్ల వాహనాలు మూలకు చేరాయి. దీంతో డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు.

50 లక్షలకు పైగా రేషన్‌ కార్డులపై కత్తి?

రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్‌ కార్డులుండగా.. సుమారు కోటి కార్డులకు జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద నెలనెలా కేంద్ర ప్రభుత్వమే దాదాపు 1.5 లక్షల టన్నుల బియ్యం కేటాయిస్తుంది. మిగిలిన కార్డులకు రాష్ట్రం 77వేల టన్నులు భరిస్తోంది. అయితే ఈ ఖర్చును భరించడం తమవల్ల కాదని.. రాష్ట్ర వాటా బియ్యాన్నీ కేంద్రమే కేటాయించాలని జగన్‌ ప్రభుత్వం కోరుతోంది. రాబోయే రోజుల్లో ఆ కార్డుల్ని పక్కన పెట్టేస్తే.. మార్కెట్లో బియ్యం కొనుక్కోవాల్సిందే. కొవిడ్‌ సమయంలోనూ కేంద్రం ఇచ్చిన బియ్యాన్నీ 5 నెలలపాటు కార్డుదారులకు అందించలేదు.

బియ్యానికి బదులుగా నగదా!

వైకాపా ప్రభుత్వం 2022 ఏప్రిల్‌లో రేషన్‌ బియ్యానికి బదులుగా నగదు ప్రతిపాదన తెచ్చింది. కిలోకు రూ.5 నుంచి రూ.8 ఇవ్వాలనే ఆలోచన చేశారు. ఇంటింటి సర్వే చేయిస్తే 90% మంది వ్యతిరేకించారు. ఆహారభద్రతకే పెనువిపత్తుగా మారుతుందని ప్రతిపక్షాలు ఆందోళన వెలిబుచ్చాయి. దీంతో ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టారు.

కానుకలు ఎగ్గొట్టిన పాపం జగన్‌దే!

తెదేపా హయాంలో 2015 నుంచి సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలతోపాటు చంద్రన్న రంజాన్‌ తోఫా ఇచ్చారు. సంక్రాంతి కానుక, క్రిస్మస్‌ కానుకగా కందిపప్పు అరకిలో, శనగపప్పు అరకిలో, బెల్లం అరకిలో, గోధుమపిండి కిలో, పామోలిన్‌ అరలీటరు, నెయ్యి అరలీటరు చొప్పున ఇచ్చారు. రంజాన్‌తోఫా కింద గోధుమపిండి 5 కిలోలు, పంచదార రెండు కిలోలు, సేమియా కిలో, నెయ్యి 100 గ్రాములు అందేవి. వీటితో ఏడాదికి 1.30 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందేవి. మొత్తంగా రూ.1,800 కోట్ల వరకు ఖర్చు చేశారు. పండగ సమయంలో పేదలు సంతోషంగా ఉండేందుకు తెచ్చిన ఈ విధానాన్నీ వైకాపా వచ్చాక రద్దు చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని