సాక్షి ఛైర్‌పర్సన్‌ను, సాయిరెడ్డిని విచారించరా..?

వైఎస్‌ వివేకానందరెడ్డి శరీరంపై తీవ్ర రక్త గాయాలను చూస్తే గుండెపోటు అని ఎవరికైనా అనిపిస్తుందా..? అని ఆయన కుమార్తె సునీత ప్రశ్నించారు.

Updated : 16 Apr 2024 07:09 IST

వివేకా హత్య రోజు అవినాష్‌ ఎవరికి ఫోన్‌ చేశారో తేలాలి
భాజపాతో జగన్‌కున్న అవినాభావ సంబంధం అందరికీ తెలుసు
సీబీఐ దర్యాప్తుపై ఒత్తిడి ఉండొచ్చని సునీత అనుమానం

ఈనాడు, హైదరాబాద్‌: వైఎస్‌ వివేకానందరెడ్డి శరీరంపై తీవ్ర రక్త గాయాలను చూస్తే గుండెపోటు అని ఎవరికైనా అనిపిస్తుందా..? అని ఆయన కుమార్తె సునీత ప్రశ్నించారు. సాక్షి మీడియాలో ఎందుకు గుండెపోటు మరణంగా ప్రసారమైందనే కోణంలో ఆ సంస్థ ఛైర్‌పర్సన్‌ను, అలా ఎందుకు చెప్పారని విజయసాయిరెడ్డిని విచారించరా? అని అడిగారు. ‘వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఫోన్‌కాల్స్‌ ఎవరికి వెళ్లాయి..? హత్య చేస్తుండగా ప్రత్యక్ష ప్రసారం చేశారా? ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. హత్య జరిగిన గదిలోంచి సాక్షి మీడియాకే తొలుత సమాచారం వెళ్లింది’ అని ఆరోపించారు. సాక్షి కడప విలేకరి బాలకృష్ణకు 6.24 గంటలకు ఫోన్‌కాల్‌ వెళ్లిందన్నారు. సాక్షి యజమానికి ప్రత్యక్ష సమాచారం తెలిసినా ఎందుకు సరిచేసుకోలేదో తేలాలన్నారు. స్థానిక సీఐని బెదిరించి మరీ రక్తపు మరకల్ని శుభ్రం చేయించడం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సీబీఐ ఇంకా దర్యాప్తు పూర్తిచేయలేదని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరి ఒత్తిడి వల్లనో దర్యాప్తు ఆపేశారనే అనుమానం ఉందన్నారు. భాజపాతో జగన్‌కు ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. హత్యకు సంబంధించిన కీలక సమాచారాన్ని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వెల్లడించారు.

నిందితులతో అవినాష్‌కు పరిచయం లేదంటే నమ్మాలా?

‘2019 మార్చి 14న అర్ధరాత్రి దాటాక జరిగిన వివేకా హత్యకేసులో ఎర్ర గంగిరెడ్డి, గజ్జెల ఉమాశంకర్‌రెడ్డి, యాదాటి సునీల్‌యాదవ్‌, షేక్‌ దస్తగిరి నిందితులుగా సీబీఐ అభియోగపత్రంలో పేర్కొంది. కానీ 2023 ఏప్రిల్‌ 27న అవినాష్‌రెడ్డి ఒక వీడియోలో మాట్లాడుతూ వివేకా హత్యకేసు నిందితులను తాను గుర్తుపట్టలేనని.. వారి గురించి మీడియాలో ప్రసారమైన తర్వాతే చూసి గుర్తించానని చెప్పారు. అదంతా అబద్ధం..’ అని సునీత పేర్కొన్నారు. గతంలో నిందితులతో అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి కలిసి ఉన్న చిత్రాలను ప్రదర్శించారు.

 • 2019 ఫిబ్రవరి 15న ఉదయం 8.11-9.04 గంటల మధ్య అవినాష్‌ ఫోన్‌ నుంచి ఉమాశంకర్‌రెడ్డికి 8 కాల్స్‌ వెళ్లాయంటూ.. ఉమాశంకర్‌రెడ్డి ఫోన్‌ నుంచే తీసిన స్క్రీన్‌షాట్‌ను విడుదల చేశారు. తెలియని వ్యక్తికి ఇన్నిసార్లు ఫోన్‌ చేయడం సాధ్యమా..? అని ప్రశ్నించారు.
 • మార్చి 14న 20.21 గంటల నుంచి 16న 9.40 వరకు అవినాష్‌ తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి ఫోన్‌ స్విచాఫ్‌లో ఉందని.. ఆరోజు రాత్రే వివేకా హత్య జరిగిందన్నారు.
 • వీటన్నింటినీ బట్టి నిందితులతో అవినాష్‌కు అంతకుముందే సంబంధం ఉన్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. స్థానిక పోలీసులు సీబీఐకి ఇచ్చిన నివేదిక నుంచే తాను ఈ సమాచారాన్ని సేకరించానని సునీత వెల్లడించారు.

హత్య రోజు అవినాష్‌ ఇంట్లోనే సునీల్‌యాదవ్‌ లొకేషన్‌

వివేకా హత్య జరిగిన రోజు మార్చి 14న రాత్రి సునీల్‌యాదవ్‌ లొకేషన్‌ అవినాష్‌ ఇంటి వద్ద చూపిస్తోందని సునీత పేర్కొన్నారు. గూగుల్‌ టేకౌట్‌ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు.

 • అర్ధరాత్రి 00.08 గంటలకు అవినాష్‌ ఇంటి బయట సునీల్‌యాదవ్‌ లొకేషన్‌ ఉందని వెల్లడించారు. అలాగే 6.12-6.17, 8.25-8.29, 9.21-10.28, 11.07-11.09 గంటల మధ్య అవినాష్‌ ఇంట్లో ఉందన్నారు. 11.10-11.17 గంటల మధ్య ఉమాశంకర్‌రెడ్డి ఇంటి దగ్గర ఉందని పేర్కొన్నారు.
 • 12.46-12.56 మధ్య అవినాష్‌ ఇంటి దగ్గర.. 12.58-13.02 మధ్య సొంత ఇంటిలో.. 13.04-13.43 మధ్య అవినాష్‌ ఇంటిదగ్గర.. 16.10 గంటలకు, 17.02-17.06, 8.14-18.33 గంటల మధ్య అవినాష్‌ ఇంట్లో ఉందని వెల్లడించారు.
 • 21.39-21.56 గంటల మధ్య అవినాష్‌రెడ్డి ఇంట్లో.. 15వ తేదీన (హత్య జరిగిన రోజు) 00.07 గంటలకు పులివెందుల రాజారెడ్డి సర్కిల్‌లో.. 1.56 గంటలకు అవినాష్‌రెడ్డి ఇంట్లో.. 5.00-5.22, 5.46-5.33 గంటల మధ్య రాజారెడ్డి సర్కిల్‌లో.. 6.00, 7.02, 7.17 గంటలకు మద్యం తాగిన ప్రదేశంలో లొకేషన్‌ ఉందని వెల్లడించారు.
 • 7.24, 7.36, 7.53, 9.00, 9.02, 9.53-10.00 గంటల సమయంలో అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు తేలిందన్నారు.
 • హత్యకు ముందురోజు సాయంత్రం 18.22, 18.23 గంటలకు గంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌ మధ్య రెండుసార్లు ఫోన్‌కాల్స్‌ ఉన్నాయని.. ఆ సమయంలో అవినాష్‌రెడ్డి ఇంట్లోనే సునీల్‌యాదవ్‌ ఉన్నాడని వెల్లడించారు.
 • ‘ఉదయం 7.10-7.45 మధ్యలో రక్తపు మరకల్ని శుభ్రం చేసినట్లుంది. 8 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని శవాగారానికి తరలించి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి (ఫిర్యాదుదారు) మాట్లాడుకుంటూనే ఉన్నారు..’ అన్నారు.

సాక్షి రిపోర్టర్‌ నుంచే వీడియో లభ్యం

 • ‘మృతదేహాన్ని గదిలోంచి బయటకు తెచ్చినప్పుడు భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి లోపలే ఉన్నారు. శివశంకర్‌రెడ్డి అక్కడే ఉన్నారు. ఆ వీడియోను అప్పట్లో సాక్షి రిపోర్టరే నాకు ఇచ్చారు..’ అని సునీత వెల్లడించారు. రక్తపు మరకల్ని, మృతదేహాన్ని శుభ్రపరిచేటప్పుడు మాత్రం లోపలి నుంచి గడియ పెట్టుకోవడంతో ఫొటోలు, వీడియోలు లేవన్నారు.
 • 10.06 గంటలకు మీడియాలో మాట్లాడిన విజయసాయిరెడ్డి గుండెపోటు మరణంగానే పేర్కొన్నారన్నారు. 10.31 గంటలకు సాక్షి మీడియాలో హఠాన్మరణంపై పోలీసులకు ఫిర్యాదు అందిందని ప్రసారం చేసిందన్నారు. 11.01 గంటలకు వివేకా మరణంపై అనుమానాలు ఉండటంతో విచారణ చేయాలని అవినాష్‌రెడ్డి మాట్లాడారు..’ అని సునీత పేర్కొన్నారు.

అవినాష్‌రెడ్డి, ఆయన బంధువులతో 2018 నవంబరు 7న సునీల్‌యాదవ్‌, కిరణ్‌యాదవ్‌ దిగిన ఫొటోలు.. 2019 ఫిబ్రవరి 23న అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కరరెడ్డితో కిరణ్‌యాదవ్‌ దిగిన ఫొటోలు.. ఉమాశంకర్‌రెడ్డితో భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి దిగిన ఫొటోలను ప్రదర్శించారు. అవినాష్‌రెడ్డి ఓ గదిలో వీరితో మంతనాలు జరిపే ఫొటోనూ సునీత విడుదల చేశారు.


ఫిబ్రవరి 22న దస్తగిరి ఫోన్‌ నుంచి సునీల్‌యాదవ్‌కు వెళ్లిన వాట్సప్‌ సందేశాన్ని సునీత వినిపించారు. అవినాష్‌ ఇంటి నుంచి తాను వెళ్లిపోతున్నానని దస్తగిరి పేర్కొన్నట్లు అందులో ఉంది.


‘అవినాష్‌ ఫోన్‌లో తెల్లవారుజామున చాలా కాల్స్‌ ఉన్నాయి. 2.37.06, 4.11.03, 4.11.04, 4.11.10, 4.21.12, 4.59.13, 5.02.14, 5.02.17, 5.03.32,  5.03.38, 5.12.24, 5.12.31, 5.13.00, 5.17.30 గంటలకు ఎవరికి ప్రయత్నించారో తెలియదు. దీనికి సమాధానాలు కావాలి. అవినాష్‌రెడ్డి ఎందుకు తన ఫోన్‌ను స్వాధీనం చేయలేదో చెప్పాలి’ అని సునీత అన్నారు.

అవినాష్‌రెడ్డి కాల్‌డేటా వివరాలు


‘వివేకా ఇంటి సమీపంలో హత్య రోజు తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఓ వ్యక్తి పరిగెడుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. నిందితులతో సీబీఐ అధికారులు మరోసారి పరిగెత్తించి పరిశీలించారు. ఉమాశంకర్‌రెడ్డి పరిగెత్తినట్లు తేలింది. ఇది పులివెందులలో వివేకా ఇంటినుంచి అవినాష్‌రెడ్డి ఇంటివైపు పరిగెత్తినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది..’ అని సునీత పేర్కొన్నారు.


‘హత్యాస్థలంలో ఉదయం 6.40 గంటల ప్రాంతంలో రక్తపు మరకల్ని శుభ్రం చేయకముందు ఎవరో వీడియో తీసి పోలీసులకు పంపించారు. ఇన్నాళ్లూ రహస్యంగా ఉన్న ఆ వీడియో ఇటీవలే బయటికొచ్చింది. హత్యాస్థలంలో ఫొటోలే అప్పుడు బయటికొచ్చాయి. ఆ ఫొటోలను, వీడియోలను చూస్తే ఎవరికైనా హత్య అనిపిస్తోందా..? గుండెపోటు అనిపిస్తోందా..?..’ అని సునీత ప్రశ్నించారు.


‘సాక్షి టీవీలో 7.44 గంటలకు గుండెపోటుతో కన్నుమూసిన మాజీమంత్రి వివేకానంద అని ప్రసారమైంది. హత్యస్థలికి వీరంతా 6.30 గంటలకు వెళితే.. గంటంపావు తర్వాత వాళ్ల మీడియాలోనే గుండెపోటు అన్నారు. అదెలా సాధ్యం? సాక్షిలోనే 9.13 గంటలకు ప్రసారమైన మరో వీడియోలోనూ హత్య అని వెల్లడించలేదేం’ అని సునీత ప్రశ్నించారు.


ఐపీడీఆర్‌ డేటాపై కీలక సమాచారం

సెల్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌ వినియోగానికి సంబంధించి గంగిరెడ్డి ఫోన్‌లోని ఐపీడీఆర్‌ డేటా గురించి కీలక సమాచారాన్ని వెల్లడించారు. ‘మార్చి 15న 1.37.08 గంటలకు అతడి ఫోన్‌ వాట్సప్‌లో యాక్టివిటీ ఉంటే.. 1.37.09 గంటలకు (1 సెకన్‌ తర్వాత) అవినాష్‌రెడ్డి ఫోన్‌ వాట్సప్‌లోనూ యాక్టివిటీ ఉంది. అలాగే 2.14.55 గంటలకు గంగిరెడ్డి ఫోన్‌లో.. 2.14.59 (4 సెకన్ల తర్వాత) అవినాష్‌రెడ్డి ఫోన్‌లో యాక్టివిటీ ఉంది. 2.19.33 గంటలకు అవినాష్‌ ఫోన్‌లో.. 2.19.46 గంటలకు గంగిరెడ్డి ఫోన్‌ (13 సెకన్ల తర్వాత)లో యాక్టివిటీ ఉంది. 2.37.01 గంటలకు గంగిరెడ్డి ఫోన్‌లో.. 2.37.06 (5 సెకన్ల తర్వాత) అవినాష్‌ ఫోన్‌లో యాక్టివిటీ ఉంది..’ ఇదంతా చూస్తే వివేకా హత్య సమయంలోనే బహుశా ఈ యాక్టివిటీ జరిగి ఉండొచ్చనేది తన వ్యక్తిగత అభిప్రాయమని సునీత చెప్పారు.

‘అవినాష్‌ ఫోన్‌ నుంచి 1.55.08 గంటలకు ఒక ఫోన్‌కాల్‌ వెళ్లింది. సునీల్‌యాదవ్‌ 1.58కు అవినాష్‌ ఇంట్లో ఉన్నాడు. అవినాష్‌ కాల్‌ సునీల్‌యాదవ్‌కు వెళ్లిందా..? సునీల్‌యాదవ్‌ అప్పుడు అవినాష్‌ ఇంటికి చేరుకొని ఏమైనా సూచనలు తీసుకొని తిరిగి హత్యాస్థలికి వెళ్లారా..?..’ అనే అనుమానాలున్నాయని పేర్కొన్నారు.


ఈర్ష్యతోనే వివేకాను చంపి ఉండొచ్చు

ఇన్ని ఆధారాలు ఉన్నా న్యాయం కోసం ఇంకా ఎన్నేళ్లు ఆగాలి?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో హత్య వీడియోలను ప్రదర్శించడంలో ఆంతర్యమేంటని అడిగిన ప్రశ్నకు సునీత స్పందించారు. గతేడాది నవంబరులో నిందితులతోపాటు తనకూ సీబీఐ రెండు హార్డ్‌డిస్క్‌ల్లో 4టీబీ వీడియోలను, సమాచారాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఇంత సమాచారం ఉన్నా ఇంకా ఎన్నేళ్లు న్యాయం కోసం ఆగాలని ప్రశ్నించారు. వాస్తవం బయటకు రావాలన్నదే తన ఉద్దేశమన్నారు. ప్రజాతీర్పును తాను కోరుతున్నందునే ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్నానని స్పష్టం చేశారు. న్యాయం కోసం తాను వైకాపా, తెదేపాల్లో ఎవరినైనా కలుస్తానన్నారు. జగన్‌ను కలిసేందుకు ఎంత ప్రయత్నించినా అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదన్నారు. సీఎంగా జగన్‌ బాధ్యత ఇదేనా అని ప్రశ్నించారు. వివేకా రాసిన లేఖను తన భర్త రాజశేఖర్‌రెడ్డి దాచిన అంశం తప్పయితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనన్నారు. వివేకానంద రాజకీయాల్లో షర్మిలను ప్రమోట్‌ చేస్తున్నారనే ఉద్దేశంతో.. తాను ఎంత కష్టపడినా వివేకాలా కాలేననే ఈర్ష్యతోనే అవినాష్‌రెడ్డి ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

తనవద్ద డబ్బు ఉన్నా లేకున్నా దానం చేసే గుణమున్న వివేకానందలో ఆర్థిక క్రమశిక్షణ కోసమే తాము ప్రయత్నించామన్నారు. ఏదో విషయంలో తండ్రితో అంతర్గత కలహాలున్నంత మాత్రాన ప్రేమ తగ్గిపోదని చెప్పారు. 2002లో అమెరికాలో తన కుమారుడు తొమ్మిది నెలలపాటు నరకయాతన అనుభవించి చనిపోయినప్పుడు తమ బాధ చూసి అమ్మనాన్నలు రమ్మంటేనే తాము హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిపారు. రాజకీయాల కోసం మాత్రం కాదని స్పష్టం చేశారు. ఒకవేళ రాజకీయ ఆకాంక్షలున్నా తప్పేంటని ప్రశ్నించారు. వివేకా రెండో వివాహం గురించి తనకు తెలియదన్నారు. షర్మిలను, తనను విమర్శిస్తున్న విమలమ్మ.. సొంత అన్న వివేకాపై చూపే ప్రేమ ఇదేనా? అని ప్రశ్నించారు. తాము సిద్ధార్థ లూత్రాను న్యాయవాదిగా ఎంచుకున్న తర్వాతే చంద్రబాబు ఎంచుకున్నారు తప్ప చంద్రబాబు తమకు సూచించారనేది సరికాదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌పై దాడి ఘటన గురించి స్పందిస్తూ ముఖ్యమంత్రికే భద్రత లేకుంటే ఎలా..? అన్నారు. వివేకా హత్య లాంటి కేసుల్లో శిక్ష పడితేనే నేరాలు పునరావృతం కావన్నారు. వివేకానందరెడ్డి గురించి తాను ఇంత పోరాడుతున్నానని.. డాక్టర్‌ సుధాకర్‌, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ గురించి ఎవరు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఇలాంటివి జరుగుతూనే పోతాయా..? ఆగాల్సిన అవసరం లేదా..?..’  అని ప్రశ్నించారు. క్రితంసారి కడప ప్రజలు తెలిసో తెలియకో అవినాష్‌ను గెలిపించారు తప్ప ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు ఓటేయరనే నమ్మకం తనకుందన్నారు. తండ్రిని హత్య చేసిన వారిని వైఎస్‌ఆర్‌ క్షమించినట్లు మీరూ క్షమిస్తారా..? అంటే అప్పటి పరిస్థితుల గురించి తనకు తెలియదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని