సీబీఐ వెతుకుతున్న నిందితుడు.. సీఎం జగన్‌ పక్కనే

సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను అసభ్యకరంగా దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభల్లో దర్జాగా పాల్గొంటున్నారు.

Updated : 16 Apr 2024 09:33 IST

న్యాయమూర్తులపై అసభ్య దూషణల కేసులో రెండో నిందితుడు మణి అన్నపురెడ్డి
నెల్లూరు జిల్లాలో వైకాపాకు మద్దతుగా చురుగ్గా ఎన్నికల ప్రచారం
కావలి ‘మేమంతా సిద్ధం’ సభలో వేదికపై హల్‌చల్‌
సీఎం జగన్‌, విజయసాయిరెడ్డితో కలిసి ఫొటోలు కూడా...
మణి అమెరికాలో ఉన్నారని అప్పట్లో కోర్టుకు చెప్పిన సీబీఐ
అరెస్టుకు ఇంటర్‌పోల్‌ సహకారం తీసుకుంటున్నామని వెల్లడి
ఇప్పుడిక్కడ బహిరంగంగా తిరుగుతున్నా పట్టించుకోరు ఎందుకో?

ఈనాడు, అమరావతి: సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను అసభ్యకరంగా దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభల్లో దర్జాగా పాల్గొంటున్నారు. ఇటీవల వరకూ అమెరికాలో ఉన్న ఆయన ప్రస్తుతం స్వదేశానికి తిరిగొచ్చి నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డి తరఫున ఉద్ధృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మణి అన్నపురెడ్డి కోసం సీబీఐ వెతుకుతుంటే ఆయన ఏకంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిలతో కలిసి కులాసాగా ఫొటోలు దిగుతున్నారు. న్యాయమూర్తులను అత్యంత హేయమైన భాషలో దూషిస్తూ, వారికి దురుద్దేశాలు ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకుగాను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాల మేరకు 2020 నవంబరులో మణి అన్నపురెడ్డితో పాటు మొత్తం 17 మంది నిందితులపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరిలో కొంతమందిని అరెస్టు చేసింది. మణి అమెరికాలో ఉన్నట్లు గుర్తించి, ఆయన అరెస్టు కోసం సంబంధిత న్యాయస్థానం నుంచి వారంట్‌ సైతం తీసుకుంది. ఆయన్ను అరెస్టు చేసేందుకు ఎంఎల్‌ఏటీ (మ్యూచువల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌ ట్రీటీ), ఇంటర్‌పోల్‌ సహకారం కూడా తీసుకుంటున్నామని సీబీఐ అధికారులు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు చెప్పారు. ఆయనపై బ్లూ నోటీసు జారీ చేశామన్నారు. అలాంటి నిందితుడు అమెరికా నుంచి దర్జాగా స్వదేశానికి వచ్చేసి.. బహిరంగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంటే సీబీఐకి ఎందుకు కనిపించదు? ఎందుకు అరెస్టు చేయట్లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఫేస్‌బుక్‌ ఖాతా పేరు, లుక్కు మార్చేసుకుని

సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషిస్తూ పోస్టులు పెట్టిన మణి అన్నపురెడ్డి.. సీబీఐ కేసుతో ఆ ఖాతాలన్నింటినీ తొలగించేశారు. ప్రస్తుతం శివ అన్నపురెడ్డి పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతా కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినట్లు అందులో పోస్టు చేశారు. ఈ 6న నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్న ‘మేమంతా సిద్ధం’ సభకు హాజరైన మణి అన్నపురెడ్డి అలియాస్‌ శివ అన్నపురెడ్డి.. డయాస్‌ పాస్‌ పెట్టుకుని ఏకంగా ర్యాంప్‌పై తిరిగారు. అక్కడ తీసుకున్న ఫొటోలను ‘మేమంతా సిద్ధం’ అంటూ ఫేస్‌బుక్‌లో పెట్టారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతిలో చెయ్యేసి, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డితో కలిసి ఆయన తీసుకున్న ఫొటోనూ అదే రోజు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ‘అన్న చెప్పిన లెక్కపై నాకు పూర్తి నమ్మకముంది’ అని దానికి వ్యాఖ్య కూడా జత చేశారు. వైకాపా యూఎస్‌ఏ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తన ఫేస్‌బుక్‌ బయోలో రాసుకున్నారు. ఫేస్‌బుక్‌లో మణి అన్నపురెడ్డి గతంలో బట్టతల, చిన్న మీసం, ఫ్రెంచ్‌కట్‌ గడ్డంతో కనిపించేవారు. తాజాగా గుండు, పెద్ద మీసాలతో కనిపిస్తున్నారు. పేరు, రూపం రెండూ మార్చేస్తే ఉనికి చిక్కకుండా ఉంటుందనే ఎత్తుగడతోనే ఇలా చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సీబీఐ వెతుకుతున్న నిందితుణ్ని పక్కనే తిప్పుకొంటున్నారు...

న్యాయమూర్తులను దూషించిన కేసులో సీబీఐ వెతుకుతున్న నిందితుడు తమ పక్కన తిరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్‌, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నట్లు? ఆయన్ను దర్యాప్తు సంస్థకు పట్టించాల్సిన బాధ్యత వాళ్లపై లేదా? ఇది నిందితుల్ని కాపాడటం కాకపోతే మరేంటి? న్యాయమూర్తులను దుర్భాషలాడిన వారిని వెనకేసుకురావటం కాకపోతే ఇంకేంటి? చిన్న కేసులోనైనా సరే నిందితులు తప్పించుకు తిరుగుతుంటే... వారి వివరాలు తెలిసినప్పుడు పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు తెలియజేయటం పౌరుల బాధ్యత. అలాంటిది ఉన్నత పదవుల్లో ఉన్న అధికార పార్టీ నేతలు.. సీబీఐ వెతుకుతున్న నిందితుడ్ని వెనక తిప్పుకుంటున్నారు. ఆయనకు యూఎస్‌ఏ వైకాపా కన్వీనర్‌గా పార్టీ పదవి ఇచ్చారు. న్యాయవ్యవస్థ పట్ల వాళ్లకున్న ‘గౌరవానికి’ ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి!

పోలీసులూ... మీకైనా కనిపించదా?

మణి అన్నపురెడ్డి అలియాస్‌ శివ అన్నపురెడ్డి కోసం సీబీఐ వెతుకుతోందనేది బహిరంగ రహస్యం. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి సభల్లో, వైకాపా ఎన్నికల ప్రచారంలో దర్జాగా పాల్గొంటుంటే.. రాష్ట్ర పోలీసులకు కనిపించకపోవటం ఏంటి? నెల్లూరు జిల్లాలో ఆయన గత కొన్ని రోజులుగా విజయసాయిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నా గుర్తించకపోవటమేంటి? ఆయనపై అరెస్టు వారంటున్నా ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? ‘న్యాయమూర్తులపై దూషణల కేసులో మీరు వెతుకుతున్న నిందితుడు మా జిల్లాలో తిరుగుతున్నారు’ అని సీబీఐకి సమాచారమివ్వాల్సిన బాధ్యతైనా పోలీసులపై ఉంటుంది కదా! ఎందుకు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు? 


ఆ మణి.. ఈ శివ ఒక్కరే

ఫోరెన్సిక్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణుల అభిప్రాయమిదే

మణి అన్నపురెడ్డి పేరుతో ఉన్న ఫొటోలు, శివ అన్నపురెడ్డి పేరిట ఉన్న ఫొటోల్ని బెంగళూరు, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ నిపుణులకు పంపించి వాటిలో ఉన్నది ఒకరేనా? వేర్వేరు వ్యక్తులా? అని అభిప్రాయం కోరగా.. ఒకే వ్యక్తి అని నిర్ధారించారు. ‘మణి అన్నపురెడ్డి, శివ అన్నపురెడ్డి పేర్లతో ఉన్న ఫొటోలను పోల్చి చూస్తే ఆ రెండింటిలో ఉన్న వ్యక్తి ముఖకవళికలు (ఫేషియల్‌ ఫీచర్స్‌) ఒకేలా ఉన్నాయి. అయితే ఆ ఫొటోలు వేర్వేరు సంవత్సరాల్లో తీసుకున్నవి’ అని చెప్పారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణులకు ఈ ఫొటోలు పంపించగా సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించారు. మణి అన్నపురెడ్డి, శివ అన్నపురెడ్డి పేరిట ఉన్న ఫొటోల్లోని వ్యక్తి ఒకరేనని తేల్చి చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని