బందిపోటు పాలన

‘నేను సీఎంను కాబట్టి ఏ చట్టమైనా చేస్తా.. కేసులు పెట్టేస్తాం.. జైలులో వేసేస్తాం.. భూముల్ని లాక్కుంటాం.. గనులు, పరిశ్రమల్ని మా వాళ్లకు బదిలీ చేస్తామంటే కుదరదు.. అది బందిపోట్లు చేసే పని. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పాలించాలి.

Updated : 16 Apr 2024 09:41 IST

సీఎంను కాబట్టి ఏదైనా చేసేస్తాననే ధోరణి సరికాదు
ఏ చట్టమైనా చేస్తా.. భూములు లాక్కుంటామంటే కుదరదు
గనుల్ని, పరిశ్రమల్ని బంధువులకు అప్పగిస్తాననడమేంటి?
మరో పారిశ్రామిక విప్లవం రాబోతోంది..
దాన్ని అందిపుచ్చుకుని 500 ఏళ్లకు పునాది వేయాలి
అలాంటి పాలకులు రావాలి
ఆర్థిక నిపుణులు, మాజీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ పి.వి.రమేష్‌
ఈనాడు - అమరావతి

‘నేను సీఎంను కాబట్టి ఏ చట్టమైనా చేస్తా.. కేసులు పెట్టేస్తాం.. జైలులో వేసేస్తాం.. భూముల్ని లాక్కుంటాం.. గనులు, పరిశ్రమల్ని మా వాళ్లకు బదిలీ చేస్తామంటే కుదరదు.. అది బందిపోట్లు చేసే పని. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పాలించాలి. ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు గుర్తెరగాలి. ప్రస్తుతం అక్కడక్కడ ఇలాంటి బందిపోటు పాలకులను చూస్తున్నాం’ అని ఆర్థిక నిపుణులు, మాజీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ పి.వి.రమేష్‌ అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో సోమవారం సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై చర్చాగోష్ఠి నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాలను వెల్లడించారు.

సంక్షేమం అభివృద్ధి రెండూ అవసరమే..

ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎమ్మెల్యేను కాబట్టి ఇసుక.. మంత్రిని కాబట్టి గనుల్ని దోచేస్తాం.. నేను పట్టణాభివృద్ధి మంత్రిని కాబట్టి విశాఖ చుట్టూ ఉన్న భూముల్ని ఆక్రమిస్తా.. వాటిని బంధువులు, డ్రైవర్లు, అటెండర్ల పేరుతో  మార్చుకుంటానంటే అది ప్రజాస్వామ్యం అవ్వదు. బందిపోట్ల పాలన అవుతుంది. సంక్షేమం, అభివృద్ధి వేర్వేరు కాదు.. ఒక్కటే. రెండూ అవసరమే. డబ్బు పంచడం సులభం. అందుకు బటన్‌ నొక్కితే సరిపోతుంది. దానికి ఇంటర్నెట్‌ ఉంటే చాలు. అదొక్కటే పాలన కాదు. ప్రజలకు అవసరమైన సమగ్ర సేవలు అందించడమే ప్రభుత్వ పాలన.

ఏ గణాంకాలు చూసినా రాష్ట్రం ముందుకెళ్తున్నట్లు అనిపించడం లేదు. రివర్స్‌ ఇంజిన్‌తో వేగంగా రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నామేమోనన్న అనుమానం కలుగుతోంది. దానికి బాధ్యత రాజకీయ నాయకులు, ప్రభుత్వాన్ని పరిపాలించేవాళ్లదే. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులది కూడా. ఎన్నికలు అయిదేళ్లకు ఒకసారి వచ్చే పండగ కాదు. 500 ఏళ్లకు అవసరమైన పునాది ఇప్పుడు పడుతుంది. ఇవి చాలా కీలకమైన ఎన్నికలు. త్వరలో నాలుగో పారిశ్రామిక విప్లవం రాబోతోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సు, రోబోటిక్స్‌లతో ప్రపంచమే మారిపోబోతోంది. వాటిని అందిపుచ్చుకోగల నాయకత్వం రాష్ట్రానికి కావాలి. ఆ నైపుణ్యాలు యువతకు నేర్పించగలగాలి. నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు అందాలి. బోగస్‌ హామీల్ని నమ్మకుండా ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడే నాయకత్వాన్ని ఎన్నుకోవాలి.

నేనూ ఇబ్బంది పడుతున్నా..

ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాష్ట్రంలో నిబంధనల ప్రకారం పని చేయాలి. మా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మా ఆస్తుల మ్యుటేషన్‌కు అక్కడి ఎమ్మార్వో, ఇతర అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఒక ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన నేను ఇబ్బంది పడుతుంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? రాజ్యాంగం ప్రకారం పని చేయకుండా డబ్బు కోసమో, రాజకీయ నాయకులు చెప్పినట్లో చేస్తే సమాజం కూలిపోతుంది.

16వ స్థానంలో ఉన్నాం: ప్రొఫెసర్‌ కొండవీటి చిన్నయసూరి

తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలో 16వ స్థానంలో ఉంది. స్థిరమైన రాజధాని లేదు. అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ఒక నమూనా లేదు. ఒక మార్గం లేకుండా ప్రయాణించడం సాధ్యం కాదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. విశాఖ రాజధాని అన్నారు. అక్కడేమైనా అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. అక్కడి వారితో మాట్లాడితే కేవలం భూకబ్జాలు తప్ప ఏమీ జరగలేదని చెబుతున్నారు. కొండ దిగువ భూముల్ని ఆక్రమించుకుని తమ వారి పేరున పట్టాలు ఇప్పించుకోవడం, ప్రయివేటు భూములుగా మార్చుకోవడం ఇదే విశాఖలో జరుగుతోంది.


అధికార పార్టీ కార్యకర్తల్లా సలహాదారులు

వల్లంరెడ్డి లక్ష్మణ్‌రెడ్డి, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి

ఏపీ ప్రభుత్వంలో జీతాలు తీసుకుంటున్న సలహాదారులు 46 మంది అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వారు రాజకీయాలు మాట్లాడకుండా నిలువరించాలి. మే నెలకు సామాజిక భద్రత పింఛన్లను ఇంటింటికీ అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికతో పని చేయాలి. వాలంటీర్లతో అధికార పార్టీ రాజీనామాలు చేయించి, వారిని పోలింగు కేంద్రాల్లో ఏజెంట్లుగా నియమించాలని ప్రయత్నిస్తోంది. ఇది సరికాదు. దీనిపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలి.

హైకోర్టు న్యాయవాది రవితేజ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రైం రేటు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన విజయవాడ నగర మాజీ మేయర్‌ జంధ్యాల శంకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వనరులున్నా.. అభివృద్ధి లేకుండా పోయిందని పేర్కొన్నారు. అమరావతి వంటి అద్భుత నగర ప్రణాళికను మూడు రాజధానుల పేరుతో నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో అప్పులు దారుణం

రాష్ట్ర ప్రభుత్వం చేసినన్ని అప్పులు దేశంలో మరెక్కడా చేయలేదు. ఆయా రుణాలను కేవలం ప్రభుత్వ పథకాలకే వినియోగించడం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి, ఆర్థిక సంఘం సూత్రాలకు విరుద్ధం. కార్పొరేషన్ల నుంచి పెద్దస్థాయిలో అప్పులు చేస్తున్నారు. ఇన్ని ఉల్లంఘనలు అపాయం. రాష్ట్ర జీఎస్‌డీపీ ఎంత ఉందో దాదాపు అప్పులు, ఇతర భారాల మొత్తం కలిపి అంతే ఉంది. ఉన్న ఆదాయమంతా అప్పులు తీర్చడానికే సరిపెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. వడ్డీలు కట్టడానికే నిధులు సరిపోతాయి. వేరే రిజర్వు నిధులేమీ ప్రభుత్వం వద్ద లేవు. చాలా అపాయకరమైన పరిస్థితి కనిపిస్తోంది. పైౖవాళ్లు చెప్పారు కదా అని ఐఏఎస్‌లు విపరీతంగా అప్పులు తెస్తే అధోగతి పాలవుతాం. రాష్ట్రంలో మూలధన వ్యయం తగ్గిపోయింది. వనరులు ఎక్కడ పెట్టాలి? ఎలా పెంచాలన్నది ముఖ్యం. నగరాలు, పట్టణాలకు అధికారాలను వికేంద్రీకరించాలి. విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో సైతం పూర్తిస్థాయిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేదు. నాణ్యమైన తాగునీరు ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని మూసేసి ఒక వ్యక్తి మాత్రమే పరిపాలించుకోవచ్చు అన్నట్లు ఉంది. నాయకులెన్ని వాగ్దానాలైనా చేయవచ్చు. వాటిని ఎలా నెరవేరుస్తారో చెప్పాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని