ఓటర్లను ‘బుట్ట’లో వేసుకోవాలనే ‘చెత్త’ ఆలోచన!

ఇన్నాళ్లూ లేనిది ఆ ప్రజాప్రతినిధికి తన నియోజకవర్గంలో స్వచ్ఛత గుర్తుకొచ్చింది. హుటాహుటిన అధికారులపై ఒత్తిడి తెచ్చి చెత్త డబ్బాలు తెప్పించుకున్నారు. ఎన్నికల సమయంలో వీటిని పంచేందుకు సిద్ధమయ్యారు.

Published : 16 Apr 2024 05:33 IST

కోడ్‌ అమల్లో ఉండగా 20 వేల చెత్తబుట్టల సరఫరా
వైకాపా రంగుల్లో ఉన్న డబ్బాలు.. విపక్షాల ఆగ్రహం

తిరుపతి (గ్రామీణ), న్యూస్‌టుడే: ఇన్నాళ్లూ లేనిది ఆ ప్రజాప్రతినిధికి తన నియోజకవర్గంలో స్వచ్ఛత గుర్తుకొచ్చింది. హుటాహుటిన అధికారులపై ఒత్తిడి తెచ్చి చెత్త డబ్బాలు తెప్పించుకున్నారు. ఎన్నికల సమయంలో వీటిని పంచేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ‘అబ్బే అదేమీ లేదు.. ఎప్పుడో ఇచ్చిన ఆర్డర్‌ ఇప్పుడు వచ్చిందంటూ’ అధికారులతో చెప్పిస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికల ప్రకటన రానున్న తరుణంలో వైకాపా రంగులను పోలి ఉన్న డబ్బాలు తిరుపతి గ్రామీణ మండలానికి రావడం చర్చనీయాంశమైంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒత్తిడి తెచ్చి ఓటర్లకు పంపిణీ చేసేందుకు వీటిని తెచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుపతి గ్రామీణ మండలం ముత్యాలరెడ్డిపల్లిలోని ఎంపీడీవో కార్యాలయానికి సోమవారం గుంటూరుకు చెందిన జ్ఞానేశ్వర ఇంజినీరింగ్‌ సంస్థ పేరుతో 20 వేల చెత్తబుట్టలు వచ్చాయి. వీటి విలువ రూ. 13.16 లక్షలుగా ఇన్‌వాయిస్‌లో ఉంది. వాటిని ఎంపీడీవో కార్యాలయంలో ఉంచారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ఎటువంటి ఉచితాలు ప్రజలకు అందించకూడదని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్వచ్ఛభారత్‌ మిషన్‌ నుంచి తడి, పొడి చెత్త సేకరణ బుట్టలు రావడం.. వైకాపా రంగులను పోలి ఉండడం వివాదాస్పదంగా మారింది. పార్టీ రంగును పోలిన డబ్బాలను ప్రచారం కోసమే తెప్పించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కార్పొరేషన్‌కు తెలియదా?

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక వస్తు, సామగ్రి పంపిణీ తాయిలాల కిందకే వస్తుంది. 2023 ఏప్రిల్‌ 10న ఇండెంట్‌ పెట్టినట్లుగా ఎంపీడీవో చెబుతున్నా ఏడాది తర్వాత.. అదీ కోడ్‌ అమలులోకి వచ్చాక సరకు దిగుమతి కావడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడితోనే వీటిని తరలించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫిర్యాదు చేస్తాం.. ఎన్నికల సమయంలో ప్రజలకు తాయిలాలుగా వీటిని అందించి లబ్ధిపొందడానికి వీటిని తెప్పించారని జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, తెదేపా నాయకుడు సాంబశివయ్య ఆరోపించారు. ప్రజలకు పంచితే ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని