సీఎం జగన్‌ కాన్వాయ్‌లో.. పోలీసు వాహనం ఢీకొని మహిళకు తీవ్రగాయాలు

కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో సోమవారం నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభకు వచ్చిన మహిళను.. సీఎం జగన్‌ కాన్వాయ్‌లోని పోలీసు వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె కుడిపాదం నుజ్జునుజ్జయింది.

Updated : 16 Apr 2024 06:40 IST

కుడిపాదం ఛిద్రం.. అయినా స్పందించని పోలీసులు
సిద్ధం సభ కోసం 120 కి.మీ దూరం నుంచి బస్సులో రాక

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో సోమవారం నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభకు వచ్చిన మహిళను.. సీఎం జగన్‌ కాన్వాయ్‌లోని పోలీసు వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె కుడిపాదం నుజ్జునుజ్జయింది. సిద్ధం సభ కోసం 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నుంచి వైకాపా నాయకులు ప్రజలను తరలించారు. ఈ క్రమంలో నెమలి గ్రామం నుంచి కూరాకుల లక్ష్మీనరసమ్మ(50) కూడా తన బంధువులతో కలిసి వచ్చారు. ఖర్చుల కోసం నిర్వాహకులు కొంత నగదు ఇచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. సభా ప్రాంగణానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో బస్సు నిలిపివేయడంతో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం.. సుదూరంగా బస్సులో ప్రయాణించి రావడంతో ఆమె అప్పటికే అలసిపోయారు. నందివాడ మండలం జనార్దనపురంలోని కెనరా బ్యాంకు వద్దకు రాగానే జగన్‌ కాన్వాయ్‌లోని పోలీసు వాహనం లక్ష్మీనరసమ్మను ఢీకొని, ఆమె కుడిపాదం మీద నుంచి వెళ్లింది. ఇంత జరిగినా పోలీసులు ఆగకుండా ముందుకు వెళ్లిపోయారు. బంధువులు ఆమెను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తరువాత విజయవాడ సమీపంలోని మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. అంత బాధలోనూ తనకు మెరుగైన వైద్యం అందేలా జగన్‌ చొరవ చూపిస్తారని లక్ష్మీనరసమ్మ విశ్వాసంతో ఉన్నారు. కానీ సభలో కనీసం ఆమె ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఈ సంఘటనపై వైకాపా నాయకులు, పోలీసులు స్పందించలేదు. ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు.


ఏలూరులో మరో ప్రమాదం.. యువకుడికి తీవ్రగాయాలు

న్యూస్‌టుడే, భీమడోలు: సీఎం జగన్‌ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సుయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామ సమీపంలో బస్సుయాత్రలోని వాహనశ్రేణి ఆకస్మికంగా నెమ్మదించింది. ఈ క్రమంలో కాన్వాయ్‌లోని కారును.. వెనక నుంచి వచ్చిన ద్విచక్రవాహనదారుడు గుండు నరేశ్‌ ఢీకొట్టారు. ప్రమాద తీవ్రతకు కారు వెనకాల అద్దం ముక్కలై.. ఆ యువకుడు అందులోకి చొచ్చుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన అతన్ని అంబులెన్సులో ఏలూరులోని ఆశ్రం వైద్యశాలకు తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని