గోదారి సాక్షిగా జగన్నాటకం!

‘పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారం రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఆక్వాకల్చర్‌ పరిజ్ఞానాన్ని పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో మొదటి ఆక్వా విశ్వవిద్యాలయానికి నాంది పలుకుతున్నాం.

Published : 16 Apr 2024 04:56 IST

సీఎం హమీలన్నీ నీటిమూటలే
ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించలేదు
ఆక్వా యూనివర్సిటీ భవనాలకు దిక్కు లేదు
వైద్య కళాశాల నిర్మాణం ఎక్కడిదక్కడే
నేడు పశ్చిమగోదావరిలో జగన్‌ బస్సు యాత్ర

‘పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారం రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఆక్వాకల్చర్‌ పరిజ్ఞానాన్ని పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో మొదటి ఆక్వా విశ్వవిద్యాలయానికి నాంది పలుకుతున్నాం. ఆరు వేల మంది మత్స్యకారులకు మేలు చేసేలా నరసాపురం పరిధిలోని బియ్యపుతిప్పలో ఫిషింగ్‌ హార్బర్‌ పనులకు శంకుస్థాపన చేశాం. పాలకొల్లులో రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజీ పనులు మొదలయ్యాయి’

ముఖ్యమంత్రి జగన్‌ 2022 నవంబర్‌ 21న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పర్యటనలో చెప్పిన మాటలు

ఈనాడు, ఏలూరు: ప్రజలను ఊహల పల్లకిలో ఎల్లకాలం ఊరేగించడం కష్టం. అప్పట్లో ముఖ్యమంత్రి జగన్‌ మాటలు అందమైన కలల ప్రపంచాన్ని సృష్టించేవి. ఆయన బాసలు జీవితాలను తీర్చిదిద్దే ఊసుల్లా ఉండేవి. ఆయన నోట్లోంచి మాట వచ్చిన వెంటనే పని జరిగిపోతున్నట్లుగానే ఒక ఊహా ప్రపంచాన్ని కళ్ల ముందు ఆవిష్కరించేవారు. ఇప్పటికీ అలాంటి మాటలు వినిపిస్తూనే ఉన్నారు. వాటిని వినీవినీ జనం విసిగిపోయారు. అడుగు ముందుకు పడని పనులు వెక్కిరిస్తుంటే.. ఆయన చెప్పిన మాటలన్నీ గాలికబుర్లుగా మిగిలిపోతుంటే జనం మాటల్లో నిరసన పెల్లుబుకుతోంది. తమ జిల్లాకు జగన్‌ ఏం చేయలేదన్న ఆగ్రహం కనిపిస్తోంది. సిద్ధం పేరుతో బస్సుయాత్ర చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ప్రజల ముంగిటకు ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం రానున్న నేపథ్యంలో ఆయన మళ్లీ కొత్తగా ఏం ‘కబుర్లు’ చెబుతారో అంటూ నొసళ్లు వెక్కిరిస్తున్నాయి. నోళ్లు నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్‌ జిల్లా పర్యటనకు ఎన్నోసార్లు వచ్చారు. పాదయాత్రలోనూ ఎన్నో హామీలిచ్చారు. అవేమీ నెరవేరలేదు. 2022లో హడావుడిగా శంకుస్థాపన చేసి, నరసాపురం వేదికగా ఆయన వల్లించిన మాటలు గుర్తు తెచ్చుకుంటున్న ప్రజానీకం.. జగన్‌ మాట తప్పేశారు, మడమ తిప్పేశారని బహిరంగంగా నిందిస్తున్నారు. ఫిషింగ్‌ హార్బర్‌, ఆక్వా యూనివర్సిటీ, పాలకొల్లు వైద్య కళాశాల నిర్మాణాలు పూర్తికాలేదు. ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్తు ఇస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరనేలేదు. గోదావరి డెల్టా కాలువలయితే నిర్లక్ష్యానికి ఆనవాళ్లుగా నిలిచిపోయాయి.

పునాది పడని ఫిషింగ్‌ హార్బర్‌

నరసాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద 150 ఎకరాల్లో రూ.429.43 కోట్ల అంచనా వ్యయంతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి జగన్‌ శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ అతీగతీ లేదు. భారీ ప్లాట్‌ఫామ్స్‌, వేలం కోసం హాళ్లు, డ్రైయింగ్‌ యార్డ్‌, బోట్‌ పార్కింగ్‌ ఏరియా, మత్స్యకారులకు విశ్రాంతి గదులు, శీతలగదులు తదితర సదుపాయాలు కల్పిస్తామని సీఎం జగన్‌ అట్టహాసంగా ప్రకటించారు. అత్యంత సామర్థ్యమున్న మోటరు బోట్లలో సముద్రంలో ఎక్కువ దూరం వెళ్లి వేటాడేందుకు వీలుంటుందని చెప్పారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో దాదాపు ఆరు వేల మందికి లబ్ధి జరుగుతుందని భారీ ఎత్తున ప్రచారం చేశారు. నిధులు విడుదల చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో నిర్మాణానికి ఒక్క ఇటుక పడలేదు. ఈ హార్బర్‌కు వెళ్లే దారంతా ముళ్లపొదలతో నిండిపోయి ఉందంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

తుపాను భవనంలోనే ఆక్వా విశ్వవిద్యాలయం

మెరైన్‌ ఉత్పత్తి, ఎగుమతుల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నందున.. అందుకు కేంద్రస్థానమైన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం నాడు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇప్పటికీ లక్ష్మణేశ్వరంలోని తుపాను భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ యూనివర్సిటీ భవనాల కోసం నరసాపురం మండలం లిఖితపూడి, సరిపల్లి గ్రామాల మధ్య 40 ఎకరాల స్థలం కూడా కేటాయించారు. రూ.332 కోట్లతో భవనాలు నిర్మించాల్సి ఉండగా మొదటి దశలో విశ్వవిద్యాలయం, పరిపాలన భవనం, విద్యార్థుల వసతిగృహాల నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. కానీ నిధులు విడుదల చేయకపోవడంతో ఇప్పటి వరకు ఆ భవనాల నిర్మాణమే ప్రారంభం కాలేదు.

ఆక్వా రైతుకు గుండె కోత

2018లో అప్పటి ప్రభుత్వం ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్తును రాయితీపై రూ.2కే అందించింది. ప్రతిపక్ష నేతగా భీమవరం పరిధిలో జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు రొయ్యల సాగుకు యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆక్వా జోన్‌ పరిధిలో అదీ పదెకరాల్లోపు సాగు చేస్తున్న వారికే రాయితీ అంటూ కొర్రీ పెట్టారు. దీంతో 33 వేల మంది రైతులు విద్యుత్తు రాయితీకి దూరమయ్యారు. పెట్టుబడి తడిసిమోపెడవటంతో సాగు నష్టాలు మిగులుస్తోందని వేలాది మంది రైతులు సాగుకు దూరమయ్యారు. 2021లో 1.52 లక్షల ఎకరాల్లో ఉన్న సాగు విస్తీర్ణం ప్రస్తుతం 1.18 లక్షల ఎకరాలకు పడిపోవడమే దీనికి నిదర్శనం.

డెల్టా కాలువలను పట్టించుకోని జగన్‌

ఉమ్మడి పశ్చిమగోదావరిలో వ్యవసాయమే ప్రధాన వనరు. కాలువల వ్యవస్థే దానికి గుండెకాయ. ఎప్పుడో కాటన్‌ హయాంలో రూపుదిద్దుకున్న ఈ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆధునీకరించుకోవడం అత్యవసరం. జగన్‌ ప్రభుత్వంలో ఈ అయిదేళ్లలో కాలువలు కనీస స్థాయిలోనూ మరమ్మతులకు   నోచలేదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1,700 కి.మీ. పొడవున ప్రధాన, ఉపకాలువల కింద 5.29 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. విపత్తుల వల్ల ఏటా 2.78 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి కోల్పోయి రూ.599 కోట్ల వరకు పంట నష్టం జరుగుతోంది. సిరులు పండే గోదావరి జిల్లాలో రైతులు పంట విరామం ప్రకటించే స్థాయికి వ్యవసాయాన్ని జగన్‌ దిగజార్చారు.


వైద్య కళాశాలకు గ్రహణం

సీఎం 2021లో నరసాపురంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ వైద్యకళాశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో చూస్తే అతీగతీ లేదు. పాలకొల్లులో వైద్యకళాశాల నిర్మాణానికి 2021లో పరిపాలన అనుమతులు వచ్చాయి. పాలకొల్లు పరిధిలోని దగ్గులూరులో 61 ఎకరాల భూమిని సేకరించారు. నిధుల సమస్యతో పునాదుల్లో మట్టి పోసేందుకే రెండేళ్లు పట్టింది. ప్రస్తుతం పునాదులకు బోర్లు పోసి, కాంక్రీట్‌ నింపుతున్నారు. నిర్మాణానికి రూ.475 కోట్లు అంచనా వ్యయం కాగా ఇప్పటికి ఖర్చు పెట్టింది కేవలం రూ.30 కోట్లేనంటే దీన్ని ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేశారో వేరే చెప్పనక్కర్లేదు. ఈ స్థలం పూర్తిగా పల్లపు ప్రాంతం. వర్షం పడితే పూర్తిగా ముంపులో ఉంటుంది. నీరు తగ్గే వరకు నెలల తరబడి నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడుతోంది. వైద్యకళాశాలలో ప్రవేశాలు, తరగతులు జరగాలంటే కళాశాలకు 300 పడకల ఆసుపత్రిని అనుసంధానం చేయాలి. జిల్లాలో అంత సామర్థ్యమున్న ఆసుపత్రుల్లేవు. వైద్యకళాశాల నిర్మాణం పూర్తి చేసి, 300 పడకల ఆసుపత్రిని అనుసంధానం చేసి, ప్రవేశాలు, తరగతులు జరగడానికి మామూలుగానే ఏళ్లు పడుతుంది. జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అది ఇంకా పెరిగిపోతోందని విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని