పంచాయతీలకు రూ.988 కోట్లు వెంటనే జమ చేయాలి

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.988 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

Updated : 16 Apr 2024 05:59 IST

ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సీఈవోకు సర్పంచుల ప్రతినిధుల బృందం వినతి

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.988 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. నిధులను మళ్లించడానికి అలవాటుపడిన రాష్ట్ర ప్రభుత్వం వీటిని కూడా దారి మళ్లించిందన్న అనుమానం వ్యక్తమవుతోందని ఆయన అన్నారు. నిధులను విడుదల చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌ కుమార్‌ మీనాను కోరినట్లు వైవీబీ తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, ఏపీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచుల బృందం సోమవారం సచివాలయంలో సీఈవోను కలిసి నిధుల విడుదల కోసం వినతిపత్రం ఇచ్చింది. అనంతరం రాజేంద్రప్రసాద్‌ విలేకరులతో మాట్లాడారు.

‘2023-24 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం రాష్ట్రానికి రూ.988 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసి మూడు వారాలైనా ఇప్పటికీ పంచాయతీల బ్యాంకు ఖాతాలకు ఆ డబ్బు జమ చేయకపోవడానికి కారణం ఏమిటి? ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా ..రాష్ట్ర ప్రభుత్వం వీటిని కూడా మళ్లించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 14, 15 ఆర్థిక సంఘం నిధులు రూ.12,918 కోట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అనుమతి తీసుకోకుండా దారి మళ్లించింది. 3.50 కోట్ల గ్రామీణ ప్రజలకు వేసవిలో తాగునీరు అందించాలంటే పంచాయతీల దగ్గర నిధులు లేవు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రూ.988 కోట్లు వెంటనే పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి’ అని రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గోగినేని వసుధ, రాష్ట్ర సర్పంచుల సంఘం అధికార ప్రతినిధి గల్లా తిమోతి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల సర్పంచుల సంఘం నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని