మావాడైతే చాలు.. మమ్మల్ని అడిగేదెవరు?

విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) నిబంధనలు తుంగలోకి తొక్కి, సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా అర్హత లేని వి.శ్రీకాంత్‌రెడ్డిని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ)గా జగన్‌ సర్కార్‌ నియమించింది.

Updated : 17 Apr 2024 04:43 IST

అర్హత లేకపోయినా శ్రీవేంకటేశ్వర వర్సిటీ ఉపకులపతిగా శ్రీకాంత్‌రెడ్డి నియామకం
ప్రొఫెసర్‌గా పదేళ్ల సర్వీసు ఉండాలనే నిబంధనను తుంగలోకి తొక్కిన ఉన్నత విద్యామండలి
వీసీ పింఛన్‌ ఆగిపోవడంతో అసలు విషయం వెలుగులోకి

ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) నిబంధనలు తుంగలోకి తొక్కి, సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా అర్హత లేని వి.శ్రీకాంత్‌రెడ్డిని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ)గా జగన్‌ సర్కార్‌ నియమించింది. వైకాపాలో కీలకమైన ‘పెద్దాయన’ సిఫార్సు చేయడంతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి వాస్తవాలు దాచి, సెర్చ్‌ కమిటీ జాబితాలో శ్రీకాంత్‌రెడ్డి పేరు చేర్చేలా చక్రం తిప్పినట్లు సమాచారం. శ్రీకాంత్‌రెడ్డికి వీసీ అర్హత లేదనే విషయం ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌కు ముందుగానే తెలిసినా ఈ విషయాన్ని సెర్చ్‌ కమిటీ దృష్టికి తీసుకురాకుండా రహస్యంగా ఉంచినట్లు ఆరోపణలున్నాయి. వీసీగా నియమితులయ్యే వారికి ప్రొఫెసర్‌గా పదేళ్ల అనుభవం ఉండాలి. శ్రీకాంత్‌రెడ్డికి అయిదేళ్ల అనుభవం మాత్రమే ఉంది. ప్రొఫెసర్‌గా పదవీ విరమణ పొందిన ఆయనకు ప్రస్తుతం పింఛన్‌ ఆగిపోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. విచిత్రమేమిటంటే ద్రవిడ విశ్వవిద్యాలయంలో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి మేనల్లుడిని.. బోధనేతర పోస్టులో నుంచి బోధన పోస్టులోకి మార్చేందుకు వేసిన కమిటీలో శ్రీకాంత్‌రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. బోధనేతర పోస్టులను బోధన పోస్టులుగా మార్చేందుకు ఈయన సిఫార్సు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇలా వైకాపాతో అంటకాగినందుకే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వీసీ పదవీలో నియమించింది.

ఇదీ అసలు కథ..

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగంలో ఒకటే ప్రొఫెసర్‌ పోస్టు ఉంది. అయినా 2006 జులై 7న అప్పటి వీసీ జయరామ్‌రెడ్డి.. డి.జమున, శ్రీకాంత్‌రెడ్డిలకు ఒకేసారి ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించారు. ఒకటే పోస్టు ఉండటంతో అధికారికంగా డి.జమునను ప్రొఫెసర్‌గా నియమించి, శ్రీకాంత్‌రెడ్డిని అనధికారికంగా ప్రొఫెసర్‌గా కొనసాగించారు. ఈయనకు వర్సిటీ నిధుల నుంచి ప్రొఫెసర్‌గా జీతాలు చెల్లించేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతి ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని శ్రీకాంత్‌రెడ్డి నియామక సమయంలో వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. 

2006లో అధికారికంగా ప్రొఫెసర్‌గా నియమితులైన జమున 2017లో పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టులోకి శ్రీకాంత్‌రెడ్డి వచ్చారు. ఈయన 2022లో పదవీ విరమణ చేశారు. 2006 జులై 7 నుంచి 2017 వరకు శ్రీకాంత్‌రెడ్డి నియామకం లీగల్‌ కాదు. దీంతో ఆయన సర్వీసు పరిగణనలోకి రాదు. లీగల్‌ కాని సర్వీసును పరిగణనలోకి తీసుకోకూడదని గతంలో సుప్రీంకోర్టు సైతం తీర్పునిచ్చింది. 2017 నుంచి 2022 వరకు మాత్రమే ఆయన మంజూరు పోస్టులో ప్రొఫెసర్‌గా ఉన్నారు. అయిదేళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసిన వ్యక్తి ఉపకులపతి పోస్టుకు అనర్హులు. ఈ విషయాన్ని ఉపకులపతి అభ్యర్థుల ఎంపికకు ఏర్పాటు చేసిన సెర్చ్‌ కమిటీకి ఉన్నత విద్యామండలి చెప్పలేదు. వైకాపాలోని ‘పెద్దాయన’ సిఫార్సు ఉండటంతో అంతా గుట్టుగా చేసేసి, చివరికి గవర్నర్‌నూ తప్పుదోవ పట్టించారు.

ఇలా వెలుగులోకి..

శ్రీవేంకటేశ్వర వర్సిటీ నుంచి పదవీ విరమణ పొందిన శ్రీకాంత్‌రెడ్డి పింఛన్‌ కోసం.. వర్సిటీ దస్త్రాన్ని రాష్ట్ర ఆడిట్‌ విభాగానికి పంపించింది. ఆయన సర్వీసును పరిశీలించిన ఆడిట్‌ విభాగం పింఛన్‌ మంజూరుకు అభ్యంతరం తెలిపింది. 2006 నుంచి 2017 వరకు ఆయన సర్వీసు లీగల్‌ కానందున పింఛన్‌కు అనర్హుడని పేర్కొంది. పింఛన్‌కే సర్వీసు పరిగణనలోకి రాదని ఆడిట్‌ విభాగం తేల్చిచెప్పినా.. జగన్‌ సర్కార్‌ పట్టించుకోకుండా ఆయన్ని వీసీగా నియమించింది. ప్రస్తుతం వీసీగా ఉన్న శ్రీకాంత్‌రెడ్డి ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేశారు. తన సర్వీసును క్రమబద్ధీకరించుకునేందుకు రిజిస్ట్రార్‌ ద్వారా ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపారు. వర్సిటీలోని ఇతర విభాగాల్లో ఉండే ఓ పోస్టును మార్పు చేసి, 2006 నుంచి 2017 వరకు సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ అందులో పేర్కొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని