శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు శిక్ష

దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది.

Updated : 17 Apr 2024 06:47 IST

వైకాపా ఎమ్మెల్సీ సహా 9 మందికి 18 నెలల జైలు
1996 నాటి కేసులో విశాఖ కోర్టు తీర్పు
నేరం చేసినట్లు నిరూపణ అయ్యిందని వెల్లడి
నిందితులందరికీ రూ.3.78 లక్షల జరిమానా విధింపు
ఇద్దరు బాధితులకు రూ.1.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశం
అప్పీలుకు వీలుగా శిక్ష అమలు నిలిపివేత

ఈనాడు, అమరావతి: దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. ఆయనతో పాటు మరో 8 మందీ దోషులేనని స్పష్టం చేసింది. దళితులకు శిరోముండనం, వారిపై దాడిచేశారని నేర నిరూపణ అయినట్లు తెలిపింది. ఐపీసీ, ఎస్సీ, ఎస్టీ చట్టాల ప్రకారం మొత్తం 9మంది నిందితులకు 18 నెలల సాధారణ జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.42 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మరో రెండు నెలల జైలుశిక్ష అనుభవించాలని స్పష్టంచేసింది. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని పేర్కొంది. దోషులందరూ కలిసి చెల్లించే రూ.3.78 లక్షల జరిమానా సొమ్ము నుంచి అప్పీల్‌ గడువు ముగిశాక.. బాధితులైన దళిత యువకులు (ఇద్దరు) ఒక్కొక్కరికి రూ.1.50 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. విశాఖ 11వ అదనపు జిల్లా న్యాయస్థానం/ఎస్సీ ఎస్టీ అత్యాచారాల (నిరోధక) కోర్టు న్యాయాధికారి లాలం శ్రీధర్‌ మంగళవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు.

 1996 డిసెంబరు 29న దళితులకు శిరోముండనం చేశారన్న ఆరోపణలతో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామ ఠాణాలో అప్పటి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మరికొందరిపై 1997 జనవరి 4న కేసు నమోదైంది. మొత్తం 10 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదుచేసి అభియోగపత్రం దాఖలుచేశారు. ఆరో నిందితుడు మరణించగా, మిగిలిన నిందితులపై విశాఖ కోర్టు విచారణ జరిపి తీర్పును వాయిదా వేసింది. మంగళవారం నిర్ణయాన్ని వెల్లడిస్తూ నిందితులకు జైలుశిక్ష, జరిమానా విధించింది.

శిక్ష అమలు తాత్కాలికంగా నిలుపుదల

తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని, ఈ నేపథ్యంలో శిక్ష అమలును 30 రోజులు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరుతూ నిందితులు మంగళవారం విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జరిమానా సొమ్ము మొత్తాన్ని చెల్లించామని తెలిపారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయాధికారి.. శిక్ష అమలును తాత్కాలికంగా నిలుపుదల చేశారు.

పదిమంది నిందితులలో ఒకరు మృతిచెందగా.. మిగిలిన తొమ్మిది మందిని దోషులుగా తేలుస్తూ జైలుశిక్ష, జరిమానా విధించింది. ఐపీసీ సెక్షన్‌ 342, 506(2), 323, ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 3(1)(3), 3(1)(10) కింద జైలుశిక్ష విధించింది.

ఏ సెక్షన్లకు ఎంత శిక్ష

  •  ఐపీసీ 342(అక్రమ నిర్బంధం) కింద ఆరునెలల సాధారణ జైలుశిక్ష
  •  ఐసీసీ సెక్షన్‌ 506(2) (చంపేస్తామని నేరపూరిత బెదిరింపు) కింద ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2వేల జరిమానా.
  •  బాధితులు కోటి చినరాజు, దడాల వెంకటరమణలను గాయపరిచినందుకు.. నిందితులు తోట బాబులు (ఏ2) తోట రాము (ఏ3)కి ఐపీసీ సెక్షన్‌ 323 (గాయపరచడం) కింద ఒక్కొక్కరికి 12 నెలల సాధారణ జైలుశిక్ష.
  •  బాధితులను గాయపరచాలన్న ఉమ్మడి ఉద్దేశంతో వ్యవహరించినందుకు ఐపీసీ సెక్షన్‌ 34 ప్రకారం.. నిందితులు తోట త్రిమూర్తులు(ఏ1), తోట పుండరీకాక్షుడు(ఏ4), తోట పుండరీకాక్షుడు అలియాస్‌ బాబీ(ఏ5), ఇతర నిందితులు దేవల కిశోర్‌, తోట శ్రీను, మంచం ప్రకాశ్‌, ఆచంట రామ సత్యనారాయణలకు ఒక్కొక్కరికి 12 నెలల సాధారణ జైలుశిక్ష.
  •  ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 3(1)(3) ప్రకారం నిందితులందరికీ 18 నెలల సాధారణ జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.20వేల చొప్పున జరిమానా.
  •  ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 3(1)(10) ప్రకారం నిందితులందరికీ 18 నెలల సాధారణ జైలుశిక్ష, రూ.20వేల చొప్పున జరిమానా.

28 ఏళ్లు... 256 వాయిదాలు

1996 డిసెంబరు 29 రాత్రి జరిగిన ఈ ఘటనలో 28 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. 2019 వరకు 143 వాయిదాలు జరగ్గా, 2019 జనవరి 8 నుంచి ఇప్పటివరకు మరో 113 వాయిదాలు పూర్తయ్యాయి. కేసు విచారణ అంశాలను క్రోడీకరించి వంద పేజీలకు పైగా తీర్పు సిద్ధం చేసి న్యాయమూర్తి లాలం శ్రీధర్‌ మంగళవారం వెల్లడించారు. ఈ కేసులో 29 మంది సాక్షులను న్యాయస్థానం విచారించగా, అందులో 11 మంది మృతిచెందారు. వాయిదాల్లో అత్యధిక శాతానికి ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులు హాజరుకాలేదన్న అభియోగం ఉంది. రాజకీయ పలుకుబడితో కోర్టుకు తక్కువగా హాజరయ్యారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.

హైకోర్టులో అప్పీలు చేస్తా: తోట త్రిమూర్తులు

ఈనాడు, విశాఖపట్నం: ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పుపై తాను హైకోర్టులో అప్పీలు చేస్తానని తోట త్రిమూర్తులు చెప్పారు. మంగళవారం ఆయన కోర్టు నుంచి బయటకొస్తూ విలేకర్లతో మాట్లాడారు. తాను నిజాయతీగా కోర్టుకు సహకరిస్తూ వచ్చానన్నారు. ‘న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే.. సంబంధం లేని కేసులో నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొనేందుకు హైకోర్టులో అప్పీలు చేసుకుంటున్నా. అది నా హక్కు’ అని చెప్పారు.

వారికి ఈ తీర్పు మింగుడు పడదు

‘ఈ కేసును అడ్డం పెట్టుకొని నాకు రాజకీయ జీవితం లేకుండా చేయాలని చూసినవారికి ఈ తీర్పు మింగుడుపడదు. వారు ఆశించిన ఫలితం రాలేదని చాలా బాధపడతారు’ అని త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. ‘నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచా. ఈ ఎన్నికల్లోనూ దళిత సోదరులే నన్ను గెలిపిస్తారు’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని