‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతా మాయం

న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అసభ్య దూషణల కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. తన రూపం, పేరు మార్చేసుకుని ‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఇన్నాళ్లూ కొనసాగిస్తున్న ఫేస్‌బుక్‌ ఖాతాను తొలగించేశారు.

Updated : 17 Apr 2024 06:47 IST

తొలగించిన మణి అన్నపురెడ్డి
‘సీబీఐ వెతుకుతున్న నిందితుడు.. సీఎం జగన్‌ పక్కనే’ కథనంతో ఉలికిపాటు
విదేశాలకు పారిపోకుండా.. విమానాశ్రయాలను అప్రమత్తం చేయండి
హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు ఫిర్యాదు చేసిన న్యాయవాది లక్ష్మీనారాయణ

ఈనాడు, అమరావతి: న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అసభ్య దూషణల కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. తన రూపం, పేరు మార్చేసుకుని ‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఇన్నాళ్లూ కొనసాగిస్తున్న ఫేస్‌బుక్‌ ఖాతాను తొలగించేశారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత కూడా ఈ ఎకౌంట్‌ కొనసాగింది. ‘సీబీఐ వెతుకుతున్న నిందితుడు.. సీఎం జగన్‌ పక్కనే’ శీర్షికతో ‘ఈనాడు’ ప్రధాన సంచికలో మంగళవారం ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో తన ఉనికి చిక్కకుండా ఉండేందుకు మంగళవారం ఉదయానికల్లా ‘శివ అన్నపురెడ్డి’ పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతాను ఆయనే తొలగించేశారు. న్యాయమూర్తులపై దూషణల కేసులో సీబీఐ వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్న మణి అన్నపురెడ్డి ఇటీవల అమెరికా నుంచి స్వదేశానికి తిరిగొచ్చి, శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతున్నారు. వైకాపా యూఎస్‌ఏ కన్వీనర్‌గా ఉన్న ఆయన దర్యాప్తు సంస్థకు చిక్కకుండా, తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు రూపం మార్చేసుకున్నారు. వైకాపా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటూ సీఎం జగన్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిలతో చేతుల్లో చేయి వేసుకుని మరీ ఫొటోలు దిగారు. వాటిని ఎప్పటికప్పుడు ‘శివ అన్నపురెడ్డి’ పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌లో పోస్టు చేస్తున్నారు. వైకాపాకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఈ అంశాలన్నింటిపై ఆధారాలు, ఫొటోలతో ‘ఈనాడు’ కథనం ప్రచురించటంతో ఉలిక్కిపడి, ఆ ఎకౌంట్‌నే తొలగించేశారు.

హైకోర్టుకు న్యాయవాది ఫిర్యాదు

శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతున్న మణి అన్నపురెడ్డి విదేశాలకు పారిపోకుండా దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసేలా సీబీఐకి ఆదేశాలివ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు న్యాయవాది వి.వి.లక్ష్మీనారాయణ మంగళవారం ఫిర్యాదు చేశారు. తక్షణమే చట్టప్రకారం ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయమూర్తులపై దూషణల కేసు పూర్వాపరాలు, వాటిలో మణి అన్నపురెడ్డి పాత్ర, ప్రస్తుతం ఆయన స్వదేశానికి వచ్చి వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న తీరు తదితర అంశాలను ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫిర్యాదుకు ‘ఈనాడు’ కథనాన్ని జతపరిచారు. ఫిర్యాదు ప్రతిని సీబీఐ ఎస్పీకి కూడా పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని