వేకువనే పోలీసు పంజా

పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది. సీఎం జగన్‌పై రాయి విసిరిన కేసులో బాలలను వారు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

Updated : 17 Apr 2024 07:53 IST

జగన్‌పై రాయి విసిరిన కేసులో బలవంతంగా అదుపులోకి బాలలు
తెల్లవారుజామునే కాలనీపై దాడి
దాష్టీకంపై భగ్గుమన్న వడ్డెర కాలనీ వాసులు
అమాయకులను తీసుకెళ్లారని ఆవేదన
విడుదల చేయాలని ధర్నా, రాస్తారోకో
రాత్రి వరకు తెలియని ఆచూకీ

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-విజయవాడ నేరవార్తలు: పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది. సీఎం జగన్‌పై రాయి విసిరిన కేసులో బాలలను వారు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని వడ్డెర కాలనీపై మంగళవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి తల్లిదండ్రులు చూస్తుండగానే పట్టుకెళ్లారు. విచారించి ఇప్పుడే పంపుతామంటూ మంగళవారం రాత్రి వరకూ వారి ఆచూకీ చెప్పలేదు. బాలల తల్లిదండ్రులు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. వారి రోదనలు మిన్నంటుతున్నాయి. అభంశుభం తెలియని పిల్లలను తీసుకెళ్లి వేధిస్తున్నారని వాపోతున్నారు. సీఎం జగన్‌ వస్తున్నప్పుడు వైకాపా జెండా పట్టుకుంటే రూ.200 ఇస్తామన్న మాయమాటలే తమను ఇంతలా మనోవ్యథకు గురిచేశాయని రోదిస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం తెల్లవారుజామున ఎనిమిది మంది మైనర్లను అదుపులోకి తీసుకుంది. వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. సంఘటన స్థలానికి వడ్డెర కాలనీ కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉంది. తమ పిల్లలను రెండు గంటల్లో వదిలిపెడతామని చెప్పి తీసుకెళ్లారని కాలనీవాసులు వివరిస్తున్నారు. వారంతా అమాయకులని, దాడితో సంబంధం లేదని, తక్షణమే విడిచిపెట్టాలని మంగళవారం సాయంత్రం డాబాకొట్ల రోడ్డును దిగ్బంధించి రాస్తారోకో చేశారు. కేసుకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

పుట్టిన రోజు వేడుక చేసుకున్నాడనే అనుమానంతో..

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సతీష్‌ ఒక్కరే మేజర్‌. సీఎంపై సతీష్‌ రాయి విసిరినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జగన్‌పై దాడి జరిగిన రోజు పొద్దుపోయాక సతీష్‌ తన మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలు చేసుకున్నాడు. వారు బైక్‌లపై చక్కర్లు కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. వారిపై అనుమానంతో మంగళవారం వేకువజామున కాలనీకి వచ్చి నిద్రపోతున్న వారిని బలవంతాన తీసుకెళ్లారు. పిల్లలు సొల్యూషన్‌ పీలుస్తున్నారని, విచారించి రెండు గంటల్లో వదిలిపెడతామని తల్లిదండ్రులకు చెప్పారు. అనంతరం తల్లిదండ్రులు ఆందోళనతో సింగ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌కు, అక్కడినుంచి సీసీఎస్‌ స్టేషన్‌కు తరువాత కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లారు. ఎక్కడాలేరని పోలీసులు చెప్పడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కాలనీవాసులు, పిల్లలు మట్టి, బేల్దారి పనులు చేస్తారు.

డబ్బు ఆశచూపి రోడ్డుషోకు తీసుకెళ్లారు..

రూ.200 ఆశ చూపి తమను జగన్‌ బస్సు యాత్రకు తీసుకువెళ్లారని, ఆ డబ్బులూ ఇవ్వలేదని స్థానికులు వివరించారు. సంఘటన జరిగిన సమయంలో అసలు నగరంలో లేని ఇద్దరినీ పోలీసులు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తమపై వేధింపులు ఆపాలని లేని పక్షంలో జగన్‌ పేరు చెప్పి తామంతా పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని కన్నీటి పర్యంతమయ్యారు. తమ పిల్లలకు ఏమీ తెలియదని, సంఘటన జరిగిన రోజు పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారని వివరించారు. జగన్‌ మామయ్య అని అభిమానించినందుకు మమ్మల్ని సీఎం నట్టేట ముంచారని పోలీసుల అదుపులో ఉన్న ఓ బాలుడి పిన్ని మండిపడ్డారు.


మా పిల్లవాడిని పోలీసులు తీసుకెళ్లారు
- ఓ బాలుడి తల్లి భవాని

ఎక్కడో జరిగినదానికి మా పిల్లవాడిని పోలీసులు తీసుకెళ్లారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. పోలీసుస్టేషన్‌కు వెళితే మా వద్దకు రావద్దన్నారు. అక్కడికి వెళ్లండి.. ఇక్కడికి వెళ్లండని తిప్పుతున్నారు. ఎక్కడికి వెళ్లినా మా పిల్లాడి జాడ లేదు. మనిషికి రూ.200 ఇస్తామంటే మా కాలనీ ఆర్చి వద్ద వైకాపా జెండా పట్టుకుని నిలబడ్డాం. మా వాడికి ఏమీ తెలియదు.కొంతమంది పిల్లలను తీసుకెళ్లారు. ఇప్పటివరకు చూపించలేదు.


డబ్బులు ఇస్తామని రోడ్డెక్కించారు
- పిల్లల బంధువు

రోడ్డుషో రోజు మగపిల్లవాడికి రూ.300, ఆడవాళ్లకు రూ.200 తలుపు కొట్టి ఇస్తామని తీసుకెళ్లారు. ఆ డబ్బులూ ఇవ్వలేదు. ఇప్పుడేమో మా పిల్లలు తప్పు చేశారనడం న్యాయమా చెప్పండి? మేం పేదలం. హత్యలు చేసేటోళ్లం కాదు. సొల్యూషన్‌ పీలుస్తున్నారు.. నోరు చెక్‌ చేసి పంపిస్తామని పిల్లలను తీసుకెళ్లారు. ముందు సతీష్‌ను, తర్వాత నలుగురు పిల్లలను తీసుకువెళ్లారు. జెండా ఇచ్చి మా మీదే హత్య కేసు పెడతారా? జగన్‌ అంటే మాకేమైనా పగా?


రూ.200 కోసం రోడ్డుషోకు వెళ్తే నేరం మోపుతారా?

మీ అబ్బాయి సొల్యూషన్‌ పీలుస్తున్నాడు.. విచారించి వెంటనే పంపిస్తామని వాడు నిద్రపోతున్నప్పుడు పోలీసులు తీసుకెళ్లారు. ఆధార్‌ కార్డు తీసుకుని పోలీసుస్టేషన్‌కు రమ్మన్నారు. మా వాడికి ఏమీ తెలియదు. మా ఆర్చి వద్దకు జగన్‌ వచ్చినప్పుడు వైకాపా జెండా పట్టుకుని నిలబడితే మహిళలకు రూ.200, పురుషులకు రూ.300 ఇస్తామన్నారు. దీంతో మేము వెళ్లి రోడ్డుపై నిలబడ్డాం. వారిచ్చే డబ్బులకు ఆశపడి వెళ్లకుండా మా ఇంట్లో ఉంటే ఈ అవస్థలు తప్పేవి. వెళ్లినందుకు మా పిల్లాడిపై నేరం మోపుతారా?

 సతీష్‌ తల్లి వెంకటరమణ


గులకరాయి డ్రామాతో బీసీ బిడ్డను బలి చేస్తున్నారు

సీఎం జగన్‌పై లోకేశ్‌ ఆగ్రహం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గతంలో కోడికత్తి డ్రామా ఆడి ఎస్సీ యువకుడిని వేధించిన జగన్‌.. ఇప్పుడు గులకరాయి డ్రామాతో బీసీ బిడ్డను బలి చేయాలని చూస్తున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ‘అధికారమే పరమావధిగా సాగుతున్న జగనాసుర రక్తచరిత్రలో తన, మన తేడా లేదు. సానుభూతితో సీఎం సీటు దక్కించుకోవాలని సొంత బాబాయ్‌ని లేపేశారు. అదే సమయంలో కోడికత్తి డ్రామాతో దళితుల్ని వేధించారు. ప్రజా వ్యతిరేకతలో ఓటమి ఖాయమని తేలడంతో ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. నా ఎస్సీలు అన్నారు.. వందల మందిని బలిచ్చారు’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.


అమాయకులను ఇరికించే పన్నాగం?: పట్టాభిరామ్‌

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటన కోడికత్తి డ్రామా 2.0ను తలపిస్తోందని, ఈ వ్యవహారంలో అమాయకులను బలి చేయాలని చూస్తున్నారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. మంగళవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోడి కత్తి కేసులో అమాయకుడైన శ్రీనివాసరావును బలి చేశారు. ఇప్పుడు మరికొందరు యువకులను ఇరికించే పనిలో ఉన్నారన్నారు. రాష్ట్రంలో పోలీసు అధికారులు జగన్‌ పర్సనల్‌ సర్వీస్‌ (జేపీఎస్‌)గా మారిపోయారని ధ్వజమెత్తారు. జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటా చెబుతున్న దానికి, వాస్తవంగా అక్కడ జరిగిన దానికి పొంతన లేదన్నారు. అరచేతి పరిమాణంలో ఉన్న రాయి సీఎంకు తగిలి, తర్వాత మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ను తాకి ఎక్కడో పడిపోయిందని సీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని