బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిపై వేటు

జగన్‌ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది.

Updated : 17 Apr 2024 10:59 IST

జగన్‌ ప్రభుత్వ మద్యం దోపిడీలో ఆయనదే ప్రధాన పాత్ర
ఎట్టకేలకు బదిలీ చేసిన ఎన్నికల సంఘం
ఈనాడు - అమరావతి

గన్‌ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. అధికార వైకాపాకు కరడుగట్టిన మద్దతుదారైన ఆయన.. ఈ ఎన్నికల వేళ ఆ పార్టీకి అనుచిత లబ్ధి కలిగించేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేస్తున్నారన్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టింది. ఆయన తర్వాత స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించేసి, తక్షణమే ఆ విధుల నుంచి ఆయన్ను రిలీవ్‌ చేయాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ వాసుదేవరెడ్డికి ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధులూ అప్పగించొద్దని నిర్దేశించింది. ఆయన స్థానంలో మరొకర్ని నియమించేందుకు వీలుగా ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల పేర్లతో మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా ప్యానల్‌ జాబితా సమర్పించాలని ఆదేశించింది. గత అయిదేళ్లలో వారి ఏపీఏఆర్‌ గ్రేడింగ్‌, విజిలెన్స్‌ క్లియరెన్స్‌ల వివరాలను ప్యానల్‌తో పాటు పంపాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాసుదేవరెడ్డిని ఎక్సైజ్‌ శాఖ నుంచి ఉపసంహరిస్తూ, సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సీఎస్‌ ఉత్తర్వులిచ్చారు.

ప్రభుత్వ పెద్దలు సూత్రధారులు.. వాసుదేవరెడ్డి పాత్రధారి

2009 బ్యాచ్‌ ఐఆర్‌టీఎస్‌ అధికారి, కేంద్ర సర్వీసుల్లో ఉన్న డి.వాసుదేవరెడ్డిని జగన్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు, మూడు నెలల్లోనే డిప్యుటేషన్‌పై తెచ్చుకుని ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీగా నియమించుకుంది. 2019 అక్టోబరు 1 నుంచి నూతన మద్యం విధానం పేరిట ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించిన జగన్‌ అంతకు 20 రోజుల ముందు 2019 సెప్టెంబరు 16 నుంచి ఆయన్ను నియమించారు. ఆ తర్వాత డిస్టిలరీస్‌, బ్రూవరీస్‌ కమిషనర్‌గా కూడా ఆయనకు బాధ్యతలప్పగించారు. అప్పటి నుంచి దాదాపు నాలుగున్నరేళ్లుగా అదే పోస్టులో కొనసాగుతున్న వాసుదేవరెడ్డి.. ఈ మద్యం విధానం ద్వారా ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ ముఖ్య నాయకులు కొనసాగించిన దోపిడీకి అన్నీ తానై వ్యవహరించారన్న ఫిర్యాదులున్నాయి. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి ప్రభుత్వం రూ.వేల కోట్ల అప్పులు తీసుకురావడంలోనూ వాసుదేవరెడ్డిదే ప్రధాన పాత్ర.

ప్రతి మద్యం కేసుకూ రూ.200- 250 చొప్పున కమీషన్‌

గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని ‘జే బ్రాండ్లు’ తీసుకురావటంలో వాసుదేవరెడ్డిదే కీలక పాత్ర. ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లేవీ అందుబాటులో లేకుండా చేశారు. ప్రభుత్వ, పెద్దలు అధికార పార్టీ ముఖ్య నాయకులకు ప్రతి మద్యం కేసుకు రూ.200 నుంచి రూ.250 చొప్పున, ప్రతి బీరు కేసుకు రూ.100 నుంచి రూ.150 చొప్పున కమీషన్‌ చెల్లించిన మద్యం సరఫరా కంపెనీలకే 99 శాతం మేర కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్న ఫిర్యాదులున్నాయి. వైకాపా అధికారం చేపట్టాక రాష్ట్రంలోని డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైకాపా ముఖ్య నేతల చేతుల్లోకి వెళ్లిపోయేలా చేయటంలో వాసుదేవరెడ్డిదే కీలక పాత్ర. వైకాపా ఎంపీ విజయ సాయిరెడ్డి అల్లుడైన పెనక రోహిత్‌రెడ్డి బినామీ కంపెనీ అని  ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గుప్పిట్లో నడుస్తోందని ఫిర్యాదులున్న ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ తదితర చోట్ల తయారయ్యే ‘జే బ్రాండ్ల’ మద్యాన్ని రోజువారీ లక్ష్యాలు విధించి మరీ ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించిన ఘనత వాసుదేవరెడ్డిదే. రాష్ట్రంలో మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నీ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నేతల గుత్తాధిపత్యంలో కొనసాగుతున్నాయి. ఈ దందాను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసింది వాసుదేవరెడ్డేనని ఫిర్యాదులున్నాయి. అలాగే అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు బినామీల పేరుతో ఏర్పాటు చేసిన మద్యం సరఫరా కంపెనీలు తయారు చేసే కొత్త కొత్త బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో దొరికేలా చేశారు.

సీఎంవో అధికారి ఆదేశిస్తారు.. వాసుదేవరెడ్డి ఆచరిస్తారు: ఏ మద్యం సరఫరా కంపెనీలకు ఎంత విలువైన ఆర్డర్లు ఇవ్వాలి? ఏయే బ్రాండ్లకు అనుమతులివ్వాలి? ఇలా ప్రతి అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లోని కీలక అధికారి నుంచి వాసుదేవరెడ్డికి ఆదేశాలందుతుంటాయి. వాటిని ఆయన తు.చ.తప్పకుండా ఆచరిస్తుంటారు. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ ముఖ్య నాయకులకు అనుచిత లబ్ధి కలిగించటమే లక్ష్యంగా ఈ వ్యవహారం సాగుతోందన్న ఫిర్యాదులున్నాయి.

ఎన్నికల షెడ్యూల్‌కు ముందు, తర్వాత వైకాపా నాయకులకే మద్యం: ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో.. గతేడాది ఇదే తేదీన ఎంత మద్యం అమ్మారో అంతకు మించి జరగటానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యాన్ని వైకాపా నేతలకు చేరేలా చేసి.. ఆ తర్వాత విక్రయాలను నిలిపేసి, ఇతరులెవరికీ అందుబాటులో లేకుండా వాసుదేవరెడ్డి చేస్తున్నారన్నది ప్రతిపక్షాల ఫిర్యాదు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే వైకాపా నేతలకు భారీ ఎత్తున మద్యం నిల్వలు చేర్చారన్న ఫిర్యాదులున్నాయి.


రూ.లక్ష కోట్లకు పైగా నగదు లావాదేవీలే

రాష్ట్రంలో చిన్న చిల్లర దుకాణం వద్ద చూసినా డిజిటల్‌ లావాదేవీలు ఉంటాయి. కానీ జగన్‌ ప్రభుత్వం గత అయిదేళ్లలో రూ.1.24 లక్షల కోట్ల విలువైన మద్యాన్ని కేవలం నగదు రూపంలోనే అమ్మింది. మూడున్నరేళ్లపాటు అసలు డిజిటల్‌ చెల్లింపులకు చోటే కల్పించలేదు. గతేడాది ప్రభుత్వ దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టినా అది పేరుకే పరిమితమైంది. ఈ మొత్తం దందాలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ప్రభుత్వంలోని కీలక పెద్దకు అవినీతి సొత్తంతా చేరుతోందని, నల్లధనం పోగుపడుతోందని ప్రతిపక్షాలు తొలి నుంచీ గగ్గోలు పెడుతున్నాయి. ఈ వ్యవహారమంతటిలోనూ కీలకపాత్ర పోషిస్తున్నది వాసుదేవరెడ్డేనని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండు చేస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని