ఐదేళ్లుగా ముంచేస్తున్న.. జగన్మొండి సర్కారు!

పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పినప్పుడు తరతరాలుగా ఉంటున్న ఈ నేలను వదిలిపెట్టి వెళ్లలేమని నెత్తీనోరూబాదుకున్నాం.

Updated : 17 Apr 2024 03:50 IST

వరదల్లో కునారిల్లిన పోలవరం విలీన మండలాలు
లక్షమంది నిర్వాసితులకు కష్టాలే కష్టాలు
కనీసం పునరావాసానికి తరలించలేని దుస్థితి!
న్యూస్‌టుడే, కుక్కునూరు

కొన్ని వేల కుటుంబాల త్యాగఫలమే ఆంధ్రావనికి పోల‘వరం’.. ప్రతిపక్ష నేతగా వారిపైన వల్లమాలిన ప్రేమని చూపించారు.. ముఖ్యమంత్రి అయ్యాక.. హామీల వర్షం కురిపించారు.. కానీ ఐదేళ్లలో పరిహారం చెల్లించకుండా, పునరావాసం ఊసెత్తకుండా.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు జగన్‌. గోదావరి వరదల తీవ్రతకు ఐదేళ్లుగా లక్షమంది నిలువునా మునిగిపోతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది వైకాపా సర్కారు.


పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పినప్పుడు తరతరాలుగా ఉంటున్న ఈ నేలను వదిలిపెట్టి వెళ్లలేమని నెత్తీనోరూబాదుకున్నాం. అయినా, కాదూ కూడదన్నారు. ఆఖరికి ఒప్పించారు. మా భూములు స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టారు. పునరావాసం చూపించకుండా గోదావరికి అడ్డంగా కాఫర్‌ డ్యాంలు నిర్మించారు. వరదలొస్తే మా ఊళ్లలోకి నీళ్లొస్తున్నాయి, ఇళ్లు మునిగిపోతున్నాయి. జీవచ్ఛవాలుగా బతుకులీడుస్తున్నా... అయ్యో పాపం అనే నాథుడే లేడు..’

 ఇదీ పోలవరం ప్రాజెక్టులో విలీన మండలాల నిర్వాసితుల ఆక్రందన, ఆవేదన. ప్రతిపక్ష నేతగా జగన్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా ఈ ఐదేళ్లలో  నెరవేర్చకుండా వరదల్లో ఇలా ముంచేస్తున్నారని వారు ఆందోళన చెందుతున్నారు.


పోలవరం నిర్వాసితులను ఆదుకోకపోవడం ఒక ఎత్తయితే.. ‘ఏం ఇంతకుముందు వరదల్లో ఊళ్లు మునగలేదా? ఈ ఐదేళ్లలోనే మీరు మునిగిపోతున్నారా?’ అని అధికార వైకాపా నాయకగణం ఎదురు ప్రశ్నించడం మరో ఎత్తు. ఇంతకుముందూ వరదలు వచ్చిందీ నిజం.. కానీ ఇన్ని ఇబ్బందులు పడలేదు. ఇన్ని రోజులు ఊళ్లలో ముంపు నిలిచింది లేదు. గోదావరికి అడ్డంగా 42.5 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించిన తర్వాత వరద ఎగదన్నుతోంది. స్పిల్‌ వే మీదుగా మొత్తం నీరు వెళ్లడం లేదు. ఆ ప్రభావం ఈ ఊళ్లపై రోజుల తరబడి ఉంటోంది. నిర్వాసితులకు పునరావాసం పూర్తి చేయనందున ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తి చేయలేదని మొదట్లో వైకాపా ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఆ తర్వాత పునరావాసం పూర్తి చేయకుండానే ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం 42.5 మీటర్ల మేరకు పూర్తి చేసింది. ఈ నిర్మాణం పూర్తయ్యాక పోలవరం పునరావాస గ్రామాల్లో దాదాపు లక్షమంది మీద ముంపు ప్రభావం పడుతోంది. గతంలో భద్రాచలం వద్ద 60 అడుగులు పైబడి నీరు నిలిస్తేనే గ్రామాలపైకి వరద దండెత్తేది. ఇప్పుడు 50 అడుగులు దాటగానే చాలా గ్రామాల్లో ప్రజలు బతుకుజీవుడా అంటూ కొండలు, గుట్టలపైకి వెళ్లిపోవాల్సి వస్తోంది.

ఐదేళ్లూ వరదలే..

జగన్‌ సర్కారు వచ్చిన తర్వాత రెండు భారీ  వరదలు గోదావరిని ముంచెత్తాయి. మరో మూడు సార్లు ప్రమాద హెచ్చరిక స్థాయికి సమీపంలో   వరదలు వచ్చాయి. ఐదేళ్లూ విలీన ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నా జగన్‌ వీరిని పట్టించుకోనేలేదు. కాఫర్‌డ్యాం కట్టి, నది మార్గాన్ని మళ్లించారు. దీంతో వర్షాకాలంలో ఎగువ నుంచి ఉవ్వెత్తున వచ్చి పడుతున్న వరద ప్రవాహానికి పోలవరం వద్ద ఆటంకం ఏర్పడుతోంది. విలీన గ్రామాల(రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రాలో విలీనం చేసినవి) మీద ఆ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అక్కడ గోదావరి సహజ మార్గం స్పిల్‌వే వైపు మళ్లింది. దీంతో అక్కడ వేగం మందగించి మొత్తం వరద విలీన గ్రామాలవైపు ఎగదన్నుతోంది.


ముంపు గ్రామాలపై సరైన లెక్కలే లేవా?

పోలవరం ప్రాజెక్టు వద్ద 41.15 మీటర్ల స్థాయిలో నీరు నిలిస్తే 54 రెవెన్యూ గ్రామాలు.. అందులోని 115 ఆవాసాల్లోని 20,946 కుటుంబాలు ముంపులో చిక్కుకుంటాయని కాంటూరు సర్వే ప్రకారం లెక్కించారు. ఒకవేళ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టం 45.72 మీటర్ల వరకు నీరు నిలిస్తే మొత్తం మీద 222 రెవెన్యూ గ్రామాల్లోని 373 ఆవాసాల్లో 1,06,000 కుటుంబాలు ముంపులో చిక్కుకుంటాయని గణించారు. వీళ్లందరికీ పునరావాసం కల్పించకుండా ఏటా జగన్‌ సర్కారు వరదల్లో ముంచేసింది. 2022లో గోదావరి నది చరిత్రలోనే రెండో అతి పెద్ద వరద వచ్చింది. ఆ వరదల్లో వందల గ్రామాలు నీటమునిగాయి. రూ.కోట్లలో నష్టం సంభవించింది. ఆ వరదల తాకిడిని తట్టుకోలేక పోలవరం, దేవీపట్నం మండలాల వాసులు స్వచ్ఛందంగా వారి కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన పునరావాస కాలనీలకు శాశ్వతంగా వెళ్లిపోయారు. ఆ కాలనీల్లో ఇంకా పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా జగన్‌  పట్టించుకోవడం లేదు. ఇక మిగిలిన గ్రామాలకు పునరావాసం కల్పించడంలోనూ ఆయన విఫలమయ్యారు. ముంపు సమయంలో వచ్చి మాటలు చెప్పడం తప్ప ఈ ముఖ్యమంత్రి చేసిందేమీ లేదు.


2022 వరదలు ఒక పెద్ద గుణపాఠం...

2022 జులైలో సంభవించిన వరదలు ఈ కాంటూరు లెక్కలను ప్రశ్నించే విధంగా ఉన్నాయి. ఆ వరదల సమయంలో పోలవరం స్పిల్‌వే వద్ద 36.545 మీటర్ల, కాఫర్‌డ్యాం వద్ద 36.89 మీటర్ల గరిష్ఠ నీటిమట్టాలు నమోదయ్యాయి. నిజానికి పోలవరం ప్రాజెక్టులో నీరు నిలబెడితేనే ఈ నిర్వాసిత గ్రామాలు ముంపులో చిక్కుకోవాలి. అలాంటిది నీరు నిలబెట్టకుండా స్పిల్‌వే మీదుగా మొత్తం నీరు వదిలేసినా ముంపు తప్పలేదు. 41.15 మీటర్ల స్థాయికి నీటిమట్టం రాకున్నా తొలిదశ, మలిదశ గ్రామాలు అనేకం మునిగిపోయాయి. జలవనరుల శాఖ అధికారులు లెక్కించిన కాంటూరు స్థాయిలను ఆ వరదలు ప్రశ్నించేవిగా కనిపించాయి. ప్రాజెక్టులో నిండా నీరు నిలిపితే మునుగుతాయని లెక్కించిన గ్రామాలెన్నో.. 2022 నాటి వరదల తీవ్రతకు ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయాయి. ఉదాహరణకు 41.15 కాంటూరులో అల్లూరి జిల్లా కూనవరం మండలంలో ఒక్క గ్రామమే ఉంది. మిగిలిన గ్రామాలన్నీ 45.75 కాంటూరు వరకు నీళ్లు నిలిపితేనే ముంపులోకి రావాలి. అలాంటిది నీరు నిలపకపోయినా ఆ మండలంలోని   గ్రామాలన్నీ వరద ముంపులో చిక్కుకున్నాయి. కుక్కునూరు మండలంలో తొలిదశలో ఎనిమిది గ్రామాలకే ముంపు ఉంటుందని లెక్కించారు. ఆ వరదల్లో 76 ఆవాసాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ తరహా లెక్కలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంటే, ఎన్నేళ్లని ఈ వరదలను తట్టుకొని జీవించాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. అయినా, ఈ జగమొండి సర్కారు నుంచి సమాధానం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని