ఏబీ వెంకటేశ్వరరావు సాక్షులను బెదిరించినట్లు ఆధారాలు ఎక్కడున్నాయి?

‘‘ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సాక్షులను బెదిరించినట్లు ఆధారాలు ఎక్కడున్నాయి?’’ అని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా.. దానికి ఆయన సమాధానమివ్వలేదు.

Published : 17 Apr 2024 04:35 IST

ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన క్యాట్‌
తుది తీర్పు ఈ నెల 23కు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సాక్షులను బెదిరించినట్లు ఆధారాలు ఎక్కడున్నాయి?’’ అని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా.. దానికి ఆయన సమాధానమివ్వలేదు. తనను సస్పెండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. క్యాట్‌ జ్యుడిషియల్‌ సభ్యురాలు లతా బస్వరాజ్‌, నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యురాలు శాలినీ మిస్త్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టింది. తొలుత ఏబీ వెంకటేశ్వరరావు తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ‘‘కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఏబీవీని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆయన సాక్షులను బెదిరించినట్లు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం.. అధికారుల కమిటీ ఎప్పటికప్పుడు సస్పెన్షన్‌ను సమీక్షించటంలో విఫలమైతే ఆ సస్పెన్షన్‌ చెల్లదు. ఆ తర్వాత అది కొనసాగదు కూడా. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లో చేర్చుకున్నా సరే... అంతకు ముందు చేసిన పాత ఆరోపణలతోనే ఆయన్ను రెండోసారి సస్పెండ్‌ చేశారు. దీనికి ఎలాంటి కారణం లేదు’’ అని ఆదినారాయణరావు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన లిఖితపూర్వక వాదనల్లో తప్పులున్నాయని ఆదినారాయణరావు తన వాదనలో ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం తరఫున  అడ్వొకేట్‌ జనరల్‌ పి.శ్రీరాం వాదనలు వినిపించడంతోపాటు పలు పత్రాలను క్యాట్‌కు అందజేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తీర్పును ఈ నెల 23కు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు