త్రిమూర్తులే దగ్గరుండి గుండ్లు గీయించారు: శిరోముండనం బాధితుల ఆక్రందన

ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరగకుండా అడ్డుకున్నామని పగబట్టి తమకు శిరోముండనం చేయించారని బాధితులు కోటి చినరాజు, కనికెళ్ల గణపతి, చల్లపూడి పట్టాభిరామయ్య వాపోయారు.

Updated : 17 Apr 2024 09:48 IST

ఈనాడు-విశాఖపట్నం, న్యూస్‌టుడే-ద్రాక్షారామ, రామచంద్రపురం: ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరగకుండా అడ్డుకున్నామని పగబట్టి తమకు శిరోముండనం చేయించారని బాధితులు కోటి చినరాజు, కనికెళ్ల గణపతి, చల్లపూడి పట్టాభిరామయ్య వాపోయారు. ప్రస్తుత వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అప్పట్లో దగ్గరుండి గుండు గీయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ఎంతో మానసిక క్షోభకు గురయ్యామని వెల్లడించారు. ఎన్నో సంక్షేమ పథకాలను దూరం చేశారని వాపోయారు. అయినా న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాడినట్లు తెలిపారు. తోట త్రిమూర్తులును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండు చేశారు. బాధితుల ఆవేదన వారి మాటల్లోనే..


అయిదేళ్లు పడాల్సిన శిక్ష 18 నెలలు పడింది
- కోటి చినరాజు, బాధితుడు, వెంకటాయపాలెం

28 ఏళ్లుగా ఎన్నో కష్టాల పాలయ్యాం. మా పిల్లలకు కుల ధ్రువీకరణ పత్రాలు రాకుండా ఆపారు. దీనివల్ల ఎన్నో పథకాలు కోల్పోయాం. తీరా తీర్పు వచ్చేటప్పటికి అయిదేళ్లు వేయాల్సిన శిక్ష 18 నెలలు విధించారు. ఈ కోర్టులో న్యాయం జరగలేదు. హైకోర్టుకు వెళ్తేనే న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. త్రిమూర్తులును ఎమ్మెల్సీ పదవి నుంచి వెంటనే తొలగించాలి.


ఇన్నాళ్లకు న్యాయం జరిగింది
- కనికెళ్ల గణపతి, బాధితుడు, వెంకటాయపాలెం

న్యాయం కోసం 28 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. కోర్టులపై నమ్మకం ఉంది. ఇన్నాళ్లకు దళితులకు న్యాయం జరిగింది. కేసు 1996 డిసెంబరులో జరిగింది. తోట త్రిమూర్తులు దగ్గరుండి గుండ్లు గీయించారు. అందుకే ఆయనకు శిక్ష పడింది. ఇన్నాళ్లూ మమ్మల్ని ఎంతో వేదనకు గురిచేశారు.


ఈవ్‌టీజింగ్‌ కేసు పెట్టించారు
- బాధితుడు చల్లపూడి పట్టాభిరామయ్య

నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు గొడవ జరిగింది. అప్పుడు బీఎస్పీ తరఫున పోలింగ్‌ ఏజెంట్లుగా ముగ్గురం ఉన్నాం. త్రిమూర్తులు వర్గం రిగ్గింగ్‌కు పాల్పడితే అడ్డుకున్నాం. అది మనసులో పెట్టుకుని మాపై ఈవ్‌టీజింగ్‌ కేసు పెట్టించారు. రెండేళ్ల తర్వాత శిరోముండనం చేశారు. ఆ బాధితుల్లో నేనూ ఒకడిని. దళిత, ప్రజాసంఘాల మద్దతుతో ధైర్యంగా నిలబడ్డాం. ప్రతిసారీ అధికారపార్టీలో ఉంటూ త్రిమూర్తులు మాపై ఒత్తిళ్లు పెంచేవారు. బాధితులు ఎస్సీలు కారంటూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. 2023 డిసెంబరు 12న బాధితులు ఎస్సీలేనని చెప్పి, కేసు కొనసాగించాలని, ఆరు నెలల్లో తేల్చాలని హైకోర్టు సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని