త్రిమూర్తులును సస్పెండ్‌ చేశాకే జగన్‌ ఓట్లడగాలి

సీఎం జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా... దళితులకు శిరోముండనం కేసులో దోషిగా నిర్ధారణైన తోట త్రిమూర్తుల్ని ఎమ్మెల్సీ పదవి నుంచి, మండపేట అభ్యర్థిత్వం నుంచి తొలగించాలని దళిత, ప్రజాసంఘాలు డిమాండు చేశాయి.

Published : 17 Apr 2024 04:47 IST

ఎమ్మెల్సీ పదవితో పాటు, పార్టీ అభ్యర్థిగానూ తప్పించాలి
లేకపోతే పోరాటం కొనసాగిస్తాం
దళిత, ప్రజాసంఘాల హెచ్చరిక
శిరోముండనం బాధితులకు అండగా 28 ఏళ్లుగా పోరాటం

ఈనాడు, విశాఖపట్నం, కాకినాడ, న్యూస్‌టుడే-రామచంద్రపురం, ద్రాక్షారామ: సీఎం జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా... దళితులకు శిరోముండనం కేసులో దోషిగా నిర్ధారణైన తోట త్రిమూర్తుల్ని ఎమ్మెల్సీ పదవి నుంచి, మండపేట అభ్యర్థిత్వం నుంచి తొలగించాలని దళిత, ప్రజాసంఘాలు డిమాండు చేశాయి. దళితులు తనకు మేనమామలని చెప్పుకొనే జగన్‌... త్రిమూర్తులును పార్టీనుంచి తొలగించాలని, లేకపోతే పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించాయి. ఆ కేసులో ప్రధానదోషి త్రిమూర్తులుకు 18 నెలల జైలుశిక్షే విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. తీర్పును సవాలు చేస్తూ హైకోర్టుకు వెళతామని తెలిపాయి. సుదీర్ఘ న్యాయపోరాటంలో ప్రజా, దళితసంఘాలు బాధితులకు అండగా నిలిచాయి. ఒత్తిళ్లకు తలొగ్గకుండా అలుపెరగని పోరాటం చేశాయి. ఎట్టకేలకు దోషులకు శిక్ష పడిందంటే ఆ సంఘాల పాత్ర కీలకం..! అయితే కోర్టు తీర్పుపై ఆ సంఘాలు సంతృప్తిగా లేవు.

మడమ తిప్పని పోరాటం

శిరోముండనం బాధితులకు న్యాయం కోసం విశాఖ దళితసంఘాల ఐక్యవేదిక (విదసం), వెంకటాయపాలెం దళిత ఐక్యపోరాట వేదిక మడమ తిప్పకుండా పోరాడాయి. కేసు నమోదైనప్పటి నుంచి న్యాయం కోసం బాధితులు, వారి పక్షాన దళితసంఘాల ప్రతినిధులు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. వివిధ ప్రజా, దళితసంఘాలు కలసి... రైతుకూలీ సంఘం నాయకుడు వెంటపల్లి భీమశంకరం కన్వీనర్‌గా... వెంకటాయపాలెం దళిత ఐక్య పోరాటవేదికగా ఏర్పాటై ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాయి. గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద 2018లో 75 రోజులు నిరాహారదీక్ష చేశారు. పోలీసులు వారి దీక్షను భగ్నం చేసి, అరెస్టుచేసి కేసులు పెట్టారు.

కేసు కొట్టేయకుండా అడ్డుపడ్డ విదసం

కొవిడ్‌ సమయంలో 2020 ఆగస్టు నాటి వర్చువల్‌ విచారణలో... నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్యతో బాధితుల న్యాయవాది వాదనలు వినిపించలేకపోయారు. దాంతో నిందితుల తరఫు న్యాయవాదులు... తీర్పు చెప్పేయాలని న్యాయమూర్తిని కోరారు. జడ్జి తీర్పు చెప్పేందుకూ సిద్ధమయ్యారు. ఆ దశలో బాధితుల వాదనలు వినేలా చేయడంలో విదసం ప్రత్యేకకృషి చేసింది. కేసును రీఓపెన్‌ చేయించడంలో హైకోర్టు సీనియర్‌ న్యాయవాది బొజ్జా తారకం కీలకంగా వ్యవహరించారు.


దళితులపై దాడులు చేసేవారికి ఇదో హెచ్చరిక
- బూసి వెంకట్రావు, విదసం ఐక్యవేదిక కన్వీనర్‌

సరైన సమయంలో తీర్పు రాలేదని భావిస్తున్నాం. సకాలంలో శిక్షపడి ఉంటే రాష్ట్రంలో మరో రెండు ఘటనలు జరిగేవి కావు. ఈ ధైర్యంతోనే అనంతబాబు దళిత యువకుడిని హత్యచేసి డోర్‌ డెలివరీ చేశారు. అలాంటివారికి సరైన శిక్షపడి రాజకీయ భవిష్యత్తు సమాధి అవ్వాలని పోరాటం చేశాం. దళితులపై దాడులు చేసినవారికి ఇది ఒక హెచ్చరిక.


పూర్తిన్యాయం జరగలేదు
- వెంటపల్లి భీమశంకర్‌, దళిత ఐక్య పోరాటవేదిక కన్వీనర్‌

‘‘ఈ కేసు ఇంతకాలం కొనసాగడానికి ప్రధాన కారణం ఉంది. ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు కనుక కుల ధ్రువీకరణ పత్రం కీలకమైంది. బాధితులు ఎస్సీలు కారని, క్రిస్టియన్లని అన్నారు. ఇప్పటికీ పూర్తి న్యాయం జరగలేదనే భావిస్తున్నాం.’’


ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి
- చీకట్ల వెంకటేశ్వరరావు, దళిత ఐక్య పోరాటవేదిక కోకన్వీనర్‌

‘‘28 ఏళ్లుగా పోరాడుతూ కోర్టు న్యాయం చేస్తుందని ఎదురుచూస్తున్న బాధితులను ఈ తీర్పు నిరాశపరిచింది. త్రిమూర్తులుకు రెండేళ్లకు మించి జైలుశిక్ష విధిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని 18 నెలల జైలుశిక్ష మాత్రమే విధించడం సరికాదు. తీర్పును హైకోర్టులో సవాలు చేస్తాం. జగన్‌ ఓటు అడిగేందుకు ప్రజల దగ్గరకు వెళ్లాలంటే... ముందు త్రిమూర్తులును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి.’’


పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి
- ఆకుమర్తి చినమాదిగ, రాష్ట్ర మాదిగ పోరాట సమితి అధ్యక్షుడు

‘‘న్యాయం కోసం పోరాడుతున్న దళిత సంఘాల్ని త్రిమూర్తులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. జగన్‌కు ఏమాత్రం మాత్రం చిత్తశుద్ధి ఉన్నా త్రిమూర్తులును పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి. ఆయనను అభ్యర్థిగా తప్పించకపోతే దళితసంఘాలు వైకాపాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి.’’


తగిన శిక్ష పడలేదు: సీనియర్‌ న్యాయవాది సత్యప్రసాద్‌

ఈనాడు, అమరావతి: శిరోముండనం కేసులో నిందితులకు తగిన శిక్ష పడలేదని హైకోర్టు సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నా.. న్యాయస్థానం కేవలం 18 నెలలకే పరిమితం కావడం కొంత నిరుత్సాహపరుస్తోందన్నారు. శిక్షా కాలాన్ని పెంచాలని కోరుతూ బాధితులు హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేయవచ్చన్నారు. న్యాయం జరగడానికి 28ఏళ్లు పట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు.


కొంత ఉపశమనం: న్యాయవాది జాహా ఆరా

నిందితులకు శిక్ష పడినందుకు ప్రజాసంఘాలు, దళిత సంఘాలు హర్షిస్తున్నాయని న్యాయవాది జాహా ఆరా అన్నారు. శిక్షా కాలమే కొంత నిరాశాజనకంగా ఉందని తెలిపారు. ‘దళితులకు గుండు కొట్టించడం ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్‌ 3 కిందకు వస్తుంది. దాని ప్రకారం ఆరు నెలల నుంచి అయిదేళ్ల వరకు శిక్ష వేయొచ్చు. ఈ కేసులో గరిష్ఠంగా 18 నెలల శిక్ష మాత్రమే విధించారు. ఇంకొంచెం శిక్షా కాలం ఎక్కువగా పడినట్లయితే బాగుండేది’ అని పేర్కొన్నారు.  


తీర్పు ఊహించిన విధంగానే వచ్చింది: పీపీ సత్యనారాయణమూర్తి

తీర్పు ఊహించిన విధంగానే వచ్చిందని పీపీ సత్యనారాయణమూర్తి అన్నారు. ‘28 ఏళ్ల సుదీర్ఘ విచారణ జరిగింది. సంచలనమైన కేసుల్లో ఇటువంటి జాప్యం అనివార్యమైంది. అనేక అంశాల మీద ముద్దాయిలు హైకోర్టుకు వెళ్లారు, కొన్ని విషయాల్లో బాధితులు సైతం హైకోర్టును ఆశ్రయించారు. తీర్పుపై అప్పీలుకు వెళ్లడం దోషులు హక్కులను వినియోగించుకోవడం కిందకే వస్తుంది’ అని అన్నారు.


బాధితులకు న్యాయం: ముప్పాళ్ల సుబ్బారావు

రాజమహేంద్రవరం(దానవాయిపేట), న్యూస్‌టుడే: డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో 1996లో జరిగిన శిరోముండనం కేసులో తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో బాధితులకు న్యాయం జరిగిందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులైన వైకాపా నాయకుడు తోట త్రిమూర్తులుతో పాటు మరో ఎనిమిది మందికి ఒక్కొక్కరికి 18 నెలల చొప్పున శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘ఇప్పటికే అధికార వైకాపా తోట త్రిమూర్తులుకు మండపేట ఎమ్మెల్యే టికెట్‌ ఖరారు చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం జగన్‌ తోట త్రిమూర్తులను తప్పిస్తారా లేక దళిత వ్యతిరేకి అనే ముద్రను ఆస్వాదిస్తారా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని సుబ్బారావు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని