చర్మకారులకు ఏమిటీ ఖర్మ?

ఏ ప్రభుత్వానికైనా యువతకు ఉపాధి కల్పించడం అత్యంత కీలకమైన అంశం. కానీ ఐదేళ్లు పాలన వెలగబెట్టిన జగన్‌ దీన్ని పూర్తిగా పక్కన పెట్టారు.

Published : 17 Apr 2024 04:48 IST

లెదర్‌ పార్కుల ఏర్పాటుకు కేంద్రం రూ.12 కోట్ల నిధులు
అందులో రూపాయైనా ఖర్చు చేయని జగన్‌ ప్రభుత్వం
ఎస్సీ యువత ఉపాధి కల్పనపై చిత్తశుద్ధి ఇదేనా?
ఈనాడు, అమరావతి

ఒక్కసారి అవకాశమంటూ... అధికారంలోకి వచ్చీ రాగానే ఎస్సీలకు ఉన్న పథకాలను ఎత్తేశారు.. వారికిచ్చే స్వయం ఉపాధి రుణాలను తీసేశారు.. ఆఖరికి లెదర్‌ పార్కుల కోసం... కేంద్రం ఇచ్చిన నిధుల్నీ ఖర్చుచేయకుండా.. ఐదేళ్ల పుణ్యకాలం గడిపేశారు! ఇదీ ఎస్సీల అభివృద్ధిపై జగన్‌కున్న చిత్తశుద్ధి!

ఏ ప్రభుత్వానికైనా యువతకు ఉపాధి కల్పించడం అత్యంత కీలకమైన అంశం. కానీ ఐదేళ్లు పాలన వెలగబెట్టిన జగన్‌ దీన్ని పూర్తిగా పక్కన పెట్టారు. గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా ఊరూరా తిరుగుతూ యువతకు ఉద్యోగాల కల్పనపై ఊదరగొట్టిన ఆయన.. అధికారం చేపట్టగానే.. వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరించారు. వారు ఉద్యోగాలు పొందితే.. ఇక తన అబద్ధాలను నమ్మరనుకున్నారేమో.. కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా.. ఉన్న వాటిపైనా కక్షకట్టినట్టు వ్యవహరించి రాష్ట్రం నుంచి తరిమికొట్టారు. చివరికి ఎస్సీల ఉపాధికి ఉపయోగపడే లెదర్‌పార్కుల ఏర్పాటుకూ ఆయన మనసొప్పలేదు. గత ఎన్నికల్లో రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లోని అత్యధిక స్థానాల్లో ఎస్సీలు వైకాపాకే వెన్నుదన్నుగా నిలిచారనే కృతజ్ఞత కూడా చూపించలేదు. ‘నా ఎస్సీ..’ అని పదే పదే అనడమే తప్ప ఆయన వారి ఉపాధికి చేపట్టిన చర్యలేమీ లేవు.


కేంద్రం నిధులిచ్చినా ఖర్చు చేయలేదు...

లెదర్‌పార్కుల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేంద్రమే నిధులిస్తుంది. వాటిని సక్రమంగా ఖర్చు చేస్తే చాలు. కానీ ఎస్సీలకు ఉపాధి కల్పించే ఆలోచనే లేదు జగన్‌కు. గత ఐదేళ్లలో రాయితీ రుణ పథకాలను ఎత్తేసి వారి ఉపాధి అవకాశాల్ని   తెగ్గోసిన ఆయన.. చివరికి    కేంద్రమిచ్చే నిధులనూ ఖర్చు  చేయలేదంటే వారిపై ఎంతగా   పగబట్టారో ఇట్టే తెలిసిపోతుంది. లెదర్‌పార్కుల ఏర్పాటు కోసం 2021-22లో ‘పీఎం అజయ్‌’ పథకం కింద కేంద్రం రూ.12 కోట్లు ఇస్తే రెండేళ్లయినా ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది లేదు. నిర్మాణాలు చేపట్టాలని గతేడాది మార్చిలో ఆదేశాలు జారీ చేసి వదిలేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని.. ఎస్సీల ఓట్లకు గాలం వేసేందుకు ఇటీవల టెండర్లు పిలుస్తున్నట్టు హడావుడి చేశారు.

 తెదేపా ప్రభుత్వం 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చర్మకారుల ఉపాధికి పెద్దపీట వేస్తూ లెదర్‌ పార్కుల ఏర్పాటుకు ఊతమిచ్చింది. అప్పట్లోనే 72 చోట్ల వీటి ఏర్పాటుకు స్థలాన్ని, నిధులనూ కేటాయించింది. ఆ తర్వాత ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇవి ఏర్పాటైతే వేల మంది ఎస్సీ యువతకు ఉపాధి దక్కుతుంది. 2021-22లో కేంద్రం వీటికోసం నిధుల్ని రాష్ట్రానికి కేటాయించింది. వీటితో ప్రకాశం జిల్లా యడవల్లి, ఎన్టీఆర్‌ జిల్లా వెల్లటూరులో మినీ లెదర్‌ పార్కులను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. లెదర్‌ పార్కుల ఏర్పాటుకు భూములు కేటాయించింది కూడా తెదేపా ప్రభుత్వమే. కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఒక్కో చోట పార్కు ఏర్పాటుకు రూ.5.50 కోట్లు వినియోగించాలి. మిగతా రూ.50 లక్షలతో తోలు వస్తువులు, పాదరక్షల తయారీకిగాను చర్మకారులకు నైపుణ్య శిక్షణ అందించాలి. ఇది ఆ వర్గానికి ఎంతో ఉపయోగపడేది. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మరో చోట ఏర్పాటు చేయాల్సి ఉన్నా అతీగతీ లేదు. పార్కుల ఏర్పాటుపైనా ఎలాంటి కదలికా లేదు.


ఎస్సీల ఉపాధికి అవకాశమున్నా...

రాష్ట్రం సొంతంగా నిధుల్ని ఖర్చు చేయడం అటుంచితే... కేంద్రమిచ్చిన నిధుల్ని ఖర్చు చేసేందుకూ మీనమేషాలు లెక్కించింది.   వెల్లటూరులో 2003లోనే   ఏడెకరాల స్థలాన్ని మినీ లెదర్‌ పార్కు ఏర్పాటుకు కేటాయించగా.. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇందులో ఆరు ఎకరాల్ని జగనన్న కాలనీకి బదలాయించారు. మిగిలిన ఎకరంలో లెదర్‌పార్కు ఏర్పాటు కావాల్సి ఉంది. ఇక్కడ పార్కు   ఏర్పాటు చేస్తే 400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతకు రెట్టింపు సంఖ్యలో యువతకు చేయూత అందుతుంది. ఎస్సీలు ఇలా ప్రగతిబాట పట్టడం జగన్‌కు నచ్చదు కదా! అందుకే పట్టించుకోనట్టున్నారు. ఆయన నిర్వాకంతో ఇప్పుడు నిర్మాణానికి కేటాయించిన స్థలం పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది.

 ప్రకాశం జిల్లా రాచర్ల మండలం యడవల్లిలో లెదర్‌పార్కు ఏర్పాటు విషయంలోనూ అంతే. 2003లో తెదేపా ప్రభుత్వం 27.18 ఎకరాల్ని లెదర్‌ పార్కు కోసం కేటాయించింది. రూ.2 కోట్లతో కార్మికుల శాశ్వత నివాస గృహాలు, పాఠశాల, బ్యాంకు, ఇతర సౌకర్యాలు కూడా కల్పించాలని అప్పట్లో నిర్ణయించారు. ఇందులో రూ.18 లక్షలు వెచ్చించి షెడ్డు నిర్మాణం కూడా పూర్తి చేశారు. కొంతమందికి నైపుణ్య శిక్షణ కూడా ఇప్పించారు. ఇప్పుడు కేంద్రం నిధులిచ్చి రెండేళ్లు దాటినా మిగతా పనులు పూర్తి చేయడానికీ చేతులు రావడం లేదు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటయితే 500 మందికి ఉపాధి లభించనుంది. పరోక్షంగా మరింత మందికి  ప్రయోజనం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు