వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి తప్పించుకోలేరు

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు.

Updated : 17 Apr 2024 07:01 IST

శాస్త్రీయమైన ఆధారాలున్నాయి
అవినాష్‌రెడ్డి ఆరోపణలకు సమాధానమిచ్చిన సునీత

ఈనాడు, కడప: వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు సాధ్యం కాదని.. ప్రజలను నమ్మించడానికి చేసే ప్రయత్నాలు చెల్లుబాటుకావని హెచ్చరించారు. కడపలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ఆరోపణలు, విమర్శలకు ఆమె సమాధానాలిచ్చారు. గత ఎన్నికల్లో అవినాష్‌రెడ్డి గెలుపు కోసం వివేకానందరెడ్డి కష్టపడి పని చేసింది నిజమైతే.. ఆయన చివరి కోరిక తీర్చుకునే అవకాశం వారికి వచ్చిందని తెలిపారు. షర్మిలను కడప ఎంపీగా చేయాలనే వివేకా కోరికను నెరవేర్చే అవకాశం వచ్చింది..చేస్తారా అని ప్రశ్నించారు. నిజంగా వారికి వివేకా మీద ప్రేమ ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని షర్మిలకు మద్దతు ఇవ్వాలని సవాల్‌ విసిరారు. వివేకా హత్యతో తనకు సంబంధం లేకపోయినా.. సునీత, దస్తగిరి, సీబీఐ కుమ్మక్కై తనను కేసులో ఇరికించారంటూ అవినాష్‌రెడ్డి చేసిన ఆరోపణలపై సునీత తీవ్రంగా స్పందించారు. మీ ఫోన్‌ దర్యాప్తు అధికారికి అప్పగించి.. కడిగిన ముత్యంలా బయటపడాలని అవినాష్‌కు సవాల్‌ విసిరారు.

దస్తగిరి ఇప్పటికీ నిందితుడే

వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారినంత మాత్రాన దస్తగిరి తప్పించుకునే అవకాశం లేదని సునీత తెలిపారు. సీఎంగా జగన్‌, ఎంపీగా అవినాష్‌రెడ్డి ఉన్నారని, అయినా తమకు న్యాయం చేశారా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు, దస్తగిరి, తాను సీబీఐని ప్రభావితం చేస్తున్నామంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. సీఎంగా జగన్‌ కేంద్రంలో భాజపాతో అంటకాగుతున్నారని..

వారికి లేని శక్తి తనకు ఎక్కడి నుంచి వస్తుందన్నారు. చంద్రబాబు తన కేసుల్లోనే కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారని.. నా కేసులో సీబీఐని ఎలా ప్రభావితం చేస్తారని ప్రశ్నించారు. ‘దారుణ హత్య విషయంలోనూ రాజకీయాలే చూస్తారా? రాజకీయాలే కాకుండా జీవితం కూడా ఉంటుందని గుర్తించాలి’ అని ఆమె పేర్కొన్నారు. ‘అవినాష్‌ కోసం వివేకా ఎన్నికల ప్రచారం చేశారంటున్నారు.. మీ కోసం అంతగా కష్టపడిన వ్యక్తి కోసం మీరేం చేశారు. వివేకా చేసిన మంచి పనుల గురించి ఈ అయిదేళ్లలో ఒక్కమాట చెప్పారా’ అని నిలదీశారు. మీ కోసం కష్టపడిన షర్మిలకు 2014లో ఎందుకు ఎంపీ సీటు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. అవినాష్‌ పోటీ నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. హంతకులకు ఓటు వేయకండి.. మీ కోసం పోరాటం చేసేవారికి ఓటేయాలని పిలుపునిచ్చారు.

జగన్‌కు ఏమని సమాచారం ఇచ్చావు?

వివేకా ఘటనను చూడటానికి వెళ్లిన అవినాష్‌రెడ్డి.. ఆ తర్వాత సీఎం జగన్‌కు గుండెపోటు అని చెప్పారా?.. హత్య అని చెప్పారా అని ప్రశ్నించారు. హత్య జరిగినట్లు జగన్‌ తెలుసుకుని ఉంటే ఎందుకు అప్పట్లో డీజీపీకి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయలేదన్నారు. గూగూల్‌ టేకౌట్‌ ప్రకారం అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉదయ్‌కుమార్‌రెడ్డి అనే నిందితుడు ఉన్నారని తెలిపారు. గూగుల్‌ టేకౌట్‌ ఫ్యాబ్రికేటెడ్‌ అని అవినాష్‌రెడ్డి అంటున్నారని.. టేకౌట్‌ రిపోర్టును సీబీఐ, సర్వే ఆఫ్‌ ఇండియా, ఎఫ్‌ఎస్‌ఎల్‌ శాస్త్రీయంగా తయారు చేస్తాయని గుర్తు చేశారు. అవినాష్‌పై సర్వే ఆఫ్‌ ఇండియాకు, ఎఫ్‌ఎస్‌ఎల్‌కూ కోపం ఉంటుందా? ఇదందా ఎందుకు?.. అవినాష్‌ ఫోన్‌ సీబీఐకి ఇస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయని.. ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. సిట్‌, సీబీఐలకు వేరువేరు విధాలుగా స్టేట్‌మెంట్లు ఇచ్చానని అవినాష్‌ అంటున్నారని వారు అర్థం పర్థంలేని స్టేట్‌మెంట్లు రాసుకున్నారని విమర్శించారు. అందుకే కేసును స్థానిక పోలీసు నుంచి సీబీఐకి బదిలీ చేసినట్లు గుర్తు చేశారు. ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు మార్చిందని, సాక్షులు చనిపోతున్నారనే కారణంగానే తెలంగాణకు మార్చారని పేర్కొన్నారు.

45 సెకన్లలో ఎలా సాధ్యమైంది?

హత్య జరిగిన రోజు శివప్రకాష్‌రెడ్డి ఉదయం 6.26 గంటలకు అవినాష్‌కు ఫోన్‌ చేయడానికి ఒక నిమిషం ముందే నిందితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డి ఎంపీ ఇంట్లో ఉన్నట్లు గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా తేలిందని సునీత చెప్పారు. జమ్మలమడుగు వెళ్తుంటే విషయం తెలిసి వచ్చానని చెబుతున్న అవినాష్‌.. 45 సెకన్లలో హత్యా స్థలానికి ఎలా చేరుకున్నారని ప్రశ్నించారు. ఎంపీ ఇంటి నుంచి రావడంతోనే ఇది సాధ్యమైందని వివరించారు. వివేకా ఇంట్లో దృశ్యాలను చూసి సీఎం ఓఎస్డీకి, ఇంట్లో పని చేసే నవీన్‌ ద్వారా జగన్‌కు సమాచారం ఇచ్చానని అవినాష్‌ చెపుతున్నారని..అప్పుడు తక్షణమే జగన్‌ ఏం చేయాలని ప్రశ్నించారు. ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ఎందుకున్నారని నిలదీశారు. తన ఈ న్యాయ, ప్రజా పోరాటం ఎంత వరకు సాగుతుందో తెలియదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని