క్షేత్రస్థాయికి ఎన్నికల నిఘా

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా సాగేలా చూసేందుకు పనిచేస్తున్న సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) సంస్థను క్షేత్రస్థాయికి విస్తరించాలని నిర్ణయించారు.

Updated : 17 Apr 2024 05:58 IST

ఆంధ్రప్రదేశ్‌లోని మునుపటి 13 జిల్లాల్లో కమిటీలు
హైదరాబాద్‌లో సమావేశమైన ఏపీ సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా సాగేలా చూసేందుకు పనిచేస్తున్న సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) సంస్థను క్షేత్రస్థాయికి విస్తరించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మునుపటి 13 జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన వారితో ఆ జిల్లాల్లో ఎన్నికల నిఘా కమిటీలను (ఎలక్షన్‌ వాచ్‌ మెకానిజమ్‌) త్వరలో ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఆస్కీ)లో జరిగిన సమావేశంలో సీఎఫ్‌డీ తీర్మానించింది. ఎన్నికల నిర్వహణలో అనుసరించాల్సిన విధానాలు, రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ యాక్ట్‌లోని అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ వి.ఎస్‌.సంపత్‌ వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలను వివిధ అంశాల్లో చైతన్యవంతులను చేయాలని సీఎఫ్‌డీ భావించింది. సమావేశంలో చర్చించిన వివిధ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో తీర్మానించారు. ఓటు వినియోగం ప్రజల బాధ్యత అనే అంశాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

స్వేచ్ఛాయుత వాతావరణంలో.. నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని, హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో డబ్బు ప్రభావానికి ముకుతాడు వేయడం, మద్యం, ఉచితాల ప్రభావం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాలని నిర్ణయించారు. ఎన్నికల వ్యయాన్ని లెక్కించడంలోని లోటుపాట్లను చక్కదిద్దడంతోపాటు, పరిగణనలోకి తీసుకోవాల్సిన ఖర్చులు.. తీసుకోకూడని ఖర్చుల విషయంలో స్పష్టత తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. క్షేత్రస్థాయిలో నియమించే బృందాలు ఎన్నికల వ్యయ అంశాలతోపాటు చెల్లింపు వార్తలు, ఎన్నికల అక్రమాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. ఆయా అంశాలకు మార్గదర్శకత్వం వహించిన ఆస్కీ ఛైర్మన్‌ కె.పద్మనాభయ్యకు సీఎఫ్‌డీ కార్యదర్శి, విశ్రాంత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ డాక్టర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

సమావేశంలో ఆస్కీ ఛైర్మన్‌ కె.పద్మనాభయ్య, కేంద్ర ఎన్నికల సంఘం విశ్రాంత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ వి.ఎస్‌.సంపత్‌, సీఎఫ్‌డీ అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి భవానీప్రసాద్‌, సీఎఫ్‌డీ ఉపాధ్యక్షుడు ఎల్వీ సుబ్రహ్మణ్యం, విశ్రాంత ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్పీ టక్కర్‌, డాక్టర్‌ రాజీవ్‌ శర్మ, సీబీఐ విశ్రాంత డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి, తెలంగాణ రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ అజయ్‌మిశ్రా, సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్స్‌ ఇన్‌ పబ్లిక్‌ సిస్టమ్స్‌ విశ్రాంత డైరెక్టర్‌ డి.చక్రపాణి, సీఎఫ్‌డీ సభ్యులు డాక్టర్‌ రఘు, డాక్టర్‌ పీవీ రమేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని