అమరావతిపై ఇంత కక్షా!

అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

Updated : 18 Apr 2024 06:58 IST

శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసం
ప్రతి నమూనానూ పగలగొట్టిన వైనం
భద్రత కల్పించకపోవడంతో దుండగుల దుశ్చర్య

ఈనాడు - అమరావతి, తుళ్లూరు, న్యూస్‌టుడే: అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజధాని నిర్మాణం బృహత్తర ప్రణాళిక, అమరావతి నవనగరాల రూపురేఖలను వివరించేలా ఏర్పాటు చేసిన మ్యూజియంలో నమూనా గ్యాలరీని జగన్‌ సర్కారుతో పాటు సీఆర్‌డీఏ యంత్రాంగం గాలికొదిలేయడంతో అసాంఘిక శక్తులు దీనిని ధ్వంసం చేశాయి. రాజధానిలో ఆగిపోయిన నిర్మాణాలను పరిశీలించడానికి బుధవారం ఎన్డీయే కూటమి గుంటూరు లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఉద్దండరాయునిపాలెం వెళ్లినప్పుడు రాజధాని రైతులు ఈ విషయాన్ని గుర్తించారు. 2015 అక్టోబరు 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇక్కడ రాజధానికి శంకుస్థాపన జరిగింది. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి నిర్మాణం ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి గత ప్రభుత్వం ఇక్కడ త్రీడీ నమూనాలను ఏర్పాటు చేసింది. ప్రజలు ఈ మ్యూజియాన్ని సందర్శించి భవిష్యత్తులో నగరం ఎలా ఉంటుందో అంచనాకు వచ్చేవారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం బ్లూ, గ్రీన్‌ సిటీగా అమరావతి భవిష్యత్‌ ముఖచిత్రాన్ని తెలిపే నమూనా, రాజధాని రహదారులు, ఎల్‌పీఎస్‌ లేఔవుట్‌లు, భూగర్భ  మురుగు నీటి పారుదల వ్యవస్థ, భూగర్భ విద్యుత్తు, తాగునీటి సరఫరా విధానాలు, అమరావతి ప్రాంత చరిత్ర, చారిత్రక నిర్మాణాలు, అధునాతన రాజధాని కట్టడాలు, అసెంబ్లీ, సచివాలయం భవనాలను కళ్లకు కట్టినట్లు చూపే నమూనాలు, బోర్డులు, మ్యాపులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అప్పటి ప్రభుత్వం దీని నిర్వహణకు, భద్రతకు సిబ్బందిని ఏర్పాటు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక అమరావతి నమూనాలను కూడా సందర్శకులకు అందుబాటులో లేకుండా చేస్తూ, గ్యాలరీని మూసేసింది. భద్రతా సిబ్బందిని తొలగించింది. సీఆర్‌డీఏ పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగి ఆ ప్రాంతం కళావిహీనంగా తయారైంది. ఇదే సందుగా దుండగులు భవనం తాళం పగలగొట్టి మ్యూజియంలో ఉన్న వస్తువులను, త్రీడీ నమూనాలను పాడుచేశారు. అద్దాలను రాళ్లతో పగలగొట్టారు. ప్రాంగణం లోపలికి వెళ్లే ద్వారం దగ్గర గేట్లను పీకి పడేశారు. కుర్చీలు, బల్లలు సహా దొరికిన వస్తువునల్లా ధ్వంసం చేశారు. అమరావతి ప్రాశస్త్యం, చరిత్ర తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఆనవాళ్లు ఏవీ లేకుండా చేశారు.

నిర్వహణ లేకపోవడంతోనే..

వైకాపా ప్రభుత్వం వచ్చాక అమరావతి విషయంలో కక్ష సాధింపు ధోరణితో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దుండగులు ఇనుము, ఇసుక, కంకర నిర్మాణ సామగ్రి ఎత్తుకుపోతున్నా చివరకు రోడ్లను ధ్వసం చేసి మట్టి తవ్వుకుపోతున్నా ఏమాత్రం చర్యలు లేవు. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా లేరని స్థానికులు చెబుతున్నారు. చివరకు అది ప్రదర్శనశాలలో విధ్వంసం వరకు దారి తీసిందని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. శంకుస్థాపన ప్రాంతం, మ్యూజియం నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వారు పలుమార్లు నిరసనలు వ్యక్తం చేశారు. అమరావతి నమూనాలను కూడా ధ్వంసం చేయడం దారుణమని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం జగన్‌ది రాక్షసానందం

తుళ్లూరు, న్యూస్‌టుడే: ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి తెదేపా అధినేత చంద్రబాబు రూపకల్పన చేస్తే.. అమరావతిని నిర్వీర్యం చేసి సీఎం జగన్‌ రాక్షసానందం పొందుతున్నారని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో ఆగిపోయిన నిర్మాణాలను బుధవారం ఆయన నాయకులు, రాజధాని రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత అర్ధంతరంగా నిర్మాణాలు నిలిచి పోవడంతో ఆ ప్రాంతమంతా ముళ్ల పొదలతో నిండిపోయిందని, మ్యూజియంలో నమూనాలను సైతం ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆధునిక రీతిలో బ్లూ, గ్రీన్‌ సిటీ నిర్మించడానికి సంకల్పించారని, ఆ పనులు కొనసాగి ఉంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవని, 125 కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు జరిగేవని తెలిపారు. వైకాపా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని చిట్టడవిలా మార్చిందని మండిపడ్డారు. పేదల అవసరాల కోసం ఆర్‌-3 జోన్‌లో 5 శాతం భూమిని గత ప్రభుత్వం కేటాయిస్తే.. దాన్ని విస్మరించి అమరావతి బృహత్‌ ప్రణాళికను నాశనం చేయాలనే తలంపుతో ఆర్‌-5 జోన్‌ను తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన వారిలో 20 వేల మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన సన్న, చిన్నకారు రైతులే ఉన్నారన్నారు. రాజధానిలో పాడైపోతున్న కట్టడాలను చూస్తుంటే ఎంతో బాధగా ఉందన్నారు. ఎన్నికల్లో జగన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.


విధ్వంసపు చర్యలు మానుకోరా?
అమరావతి గ్యాలరీ విధ్వంసంపై చంద్రబాబు ఆగ్రహం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఉద్దండరాయునిపాలెంలోని రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేసిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ‘మీరు మారరా.. మీ బుద్ధి మారదా?’ అంటూ వైకాపా వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ వికృత పోకడలను ఇంటికి పోయే ముందు కూడా మార్చుకోరా? విధ్వంసం, విషం చిమ్మే, మీ నీచమైన చర్యల్ని మానుకోరా?’ అని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని