జగన్‌ చేతుల నిండా దళితుల నెత్తురు!

మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్‌డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది  పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్‌ అసలు రూపం.

Updated : 18 Apr 2024 16:56 IST

మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు...
దళితుడిని చంపి ఇంటికి డోర్‌డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు...
దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం...
చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్‌ అసలు రూపం...


సీఎం సొంత జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న దళిత మహిళ జ్యోతిపై వైకాపా కీచకులు దాడిచేశారు. ఆమె దుస్తులు చించేసి తీవ్రంగా కొట్టారు.  అనంతపురం జిల్లాలో వైకాపా ఇసుకాసురులను నిలదీసిన దళిత రైతులను కులం పేరుతో దూషిస్తూ, దౌర్జన్యం చేశారు.

‘‘నా ఎస్సీలు..’’ అంటూ దీర్ఘాలు తీసే జగన్‌మోహన్‌ రెడ్డి రాజ్యమిది! నోరెత్తిన దళితుల నెత్తురు కళ్లజూసిన జగన్‌మోహన్‌ రెడ్డి రాజ్యమిది!


భూకబ్జాల గురించి బయట పెడుతున్నారని నంద్యాల జిల్లాలో దళిత న్యాయవాది విజయ్‌కుమార్‌పై వైకాపా కిరాతక నేతలు కక్షగట్టారు. విజయ్‌ను చెప్పులతో కొడుతూ కాళ్లతో తంతూ బూతులు తిడుతూ వీధుల్లో నడిపించుకుంటూ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితుడిపైనే ఎదురు కేసు పెట్టారు. మా అబ్బాయిని కొట్టొద్దంటూ కన్నీళ్లతో వేడుకున్న విజయ్‌ తల్లి మీదా వైకాపా దుర్మార్గులు దాష్టీకం చేశారు.  

‘‘నా ఎస్సీలు..’’ అంటూ దీర్ఘాలు తీసే జగన్‌మోహన్‌ రెడ్డి రాజ్యమిది! ఎదిరించిన దళితుల ఎముకలేరేసిన జగన్‌మోహన్‌ రెడ్డి రాజ్యమిది!


కరోనా రోజుల్లో మాస్కులైనా ఇవ్వకుండా వైద్యం చేయమంటే ఎలాగని విశాఖ దళిత వైద్యుడు సుధాకర్‌ నిలదీశారు. అంతే.. ఆయనను సస్పెండ్‌ చేశారు. నడిరోడ్డు మీద లాఠీలతో చావబాదారు. పిచ్చివాడనే ముద్రవేసి మానసికంగా హింసించారు. ఆఖరికి సుధాకర్‌ను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. సర్కారీ తప్పిదాలపై గళమెత్తినందుకు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ న్యాయాధికారి, దళితుడు రామకృష్ణను నానా హింసలుపెట్టారు.

‘‘నా ఎస్సీలు..’’ అంటూ దీర్ఘాలు తీసే జగన్‌మోహన్‌ రెడ్డి రాజ్యమిది! ప్రశ్నించిన దళితులను పిశాచిలా పట్టిపీడించిన జగన్‌మోహన్‌ రెడ్డి రాజ్యమిది!


= వైకాపా నాయకుడు, అతని సోదరుడు, స్థానిక ఎస్సై బెదిరింపులను తట్టుకోలేక పోతున్నానంటూ లేఖ రాసి పశ్చిమ గోదావరి జిల్లా దళిత ఆక్వారైతు నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. రూ.20 లక్షలు అప్పు తెచ్చి చేపల చెరువు పెట్టుకుంటే వైకాపా నేత, అతని అనుచరుడు కలిసి వేధిస్తున్నారంటూ నెల్లూరు జిల్లా దళిత యువకుడు కరుణాకర్‌ ప్రాణాలు తీసుకున్నారు.

‘‘నా ఎస్సీలు..’’ అంటూ దీర్ఘాలు తీసే జగన్‌మోహన్‌ రెడ్డి రాజ్యమిది! జీవితంలో ఎదిగేందుకు చెమట చిందించే దళితులను చంపేసిన జగన్‌మోహన్‌ రెడ్డి రాజ్యమిది!


డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా గోపాలపురంలోని ఒక హోటల్‌లో బాబాసాహెబ్‌ బొమ్మ ముద్రించిన పేపర్‌ ప్లేట్లలో ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు. ఎంగిలి ప్లేట్ల మీద రాజ్యాంగ నిర్మాత చిత్రమేంటని నిలదీసిన పాపానికి 18 మంది దళిత యువకులపై కేసులు బనాయించారు. రోజుల తరబడి వారు జైల్లో మగ్గిపోయేలా చేశారు.

‘‘నా ఎస్సీలు..’’ అంటూ దీర్ఘాలు తీసే జగన్‌మోహన్‌ రెడ్డి రాజ్యమిది! పైకి అంబేడ్కర్‌ జపం చేస్తూ, ఆయనను అడుగడుగునా దారుణంగా అవమానించిన  జగన్‌ మోహన్‌ రెడ్డి రాజ్యమిది!


పాశవిక పాలకుడు

అంటరానితనమనే అమానవీయ సంస్కృతిని రూపుమాపడానికి జీవితాంతం పోరాడిన మహానుభావుడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌. భారతీయులు అందరూ సమానులేనన్న రాజ్యాంగ నిర్దేశాన్ని నాలుగు తాటిచెట్ల నిలువున పాతిపెట్టేసిన పాశవిక పాలకుడు జగన్‌మోహన్‌ రెడ్డి. రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సిన పాలనా యంత్రాంగంతో ఆయన వైకాపాకు ఊడిగం చేయించారు. దాంతో దళితుల మీద వైకాపా నేతలు, కార్యకర్తల ఆగడాలు విశృంఖలమయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా చాకార్లపల్లిలో దళితులు ఏర్పాటుచేసిన వినాయకుడి విగ్రహం నిరుడు ముందుగా నిమజ్జనానికి బయల్దేరింది. జగన్‌ పార్టీ స్థానిక నేతలకు అది కంటగింపు అయ్యింది. కొందరు యువకులను దళితులపైకి ఉసిగొల్పి దుర్భాషలాడించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వైకాపాసురులు ఇంకా పేట్రేగిపోయారు. తమవారిని రెచ్చగొట్టి దళిత కాలనీపై దాడి చేయించారు. అక్కడివారిని దారుణంగా కొట్టించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కుండలేశ్వరానికి చెందిన భావనకుమార్‌.. ఆర్బీకేలో వ్యవసాయ సహాయకుడు. దళితుడైన కుమార్‌ తన ఎదుట కుర్చీలో కూర్చున్నాడని చెప్పి, అతనిపై దాడి చేశాడొక వైకాపా నాయకుడు. నిడదవోలులో గణపతి అనే దళిత సచివాలయ ఉద్యోగిని నడిబజార్లో చెప్పుతో కొట్టాడో జగన్‌ పార్టీ నేత. ‘ఎస్సీలకు పొగరు పెరిగిపోయింది’ అంటూ నానా తిట్లు తిట్టాడు. ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్లలో కాండ్రు శ్యామ్‌కుమార్‌ అనే దళితుడిపై కొద్దినెలల క్రితం హరీశ్‌రెడ్డి, మరికొందరు దాడిచేసి పైశాచికంగా ప్రవర్తించారు. ‘‘అధికారంలో ఉన్నది మేం. మేం కొట్టినా తిట్టినా పడాల్సిందే. అతిగా మాట్లాడితే చంపేస్తాం’’, ‘‘మీ దళితులకు ఇంతే జరగాలి.. మిమ్మల్ని ఇంతే కొట్టాలి’’ అంటూ ఆ కిరాతకులు చెలరేగిపోయినట్లు బాధితులు, అతని కుటుంబసభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. దళితులపై దమన కాండకు పాల్పడిన స్వపక్ష నేతలను చంకనెక్కించుకున్న జగన్‌ కారణంగానే రాష్ట్రంలో కులవివక్ష కోరలు ఇంతగా పదునెక్కాయి.


అనంతబాబుకు ప్రేమతో.. జగన్‌!

నేతి బీరకాయలో నెయ్యి ఉండదు.. జగన్‌మోహన్‌ రెడ్డి మాటల్లో నిజం ఉండదు. ‘‘దళితులపై దాడులను, అనైతిక చర్యలను ఉపేక్షించేది లేదు. బాధ్యులు ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవు’’ అని సీఎంగా జగన్‌ ఢంకా బజాయించారు. దళితులకు రక్షణగా నిలబడాల్సిన బాధ్యత మనపై ఉందని కలెక్టర్లు, ఎస్పీలకు ఆయన బోలెడన్ని సుద్దులూ చెప్పారు. అదే జగన్‌- దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని చంపి, అతడి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును వెంటేసుకుని తిరుగుతున్నారు. మొన్న జనవరిలో కాకినాడలో తాను పాల్గొన్న ఓ కార్యక్రమంలో అనంతబాబును ముందు వరసలో కూర్చోబెట్టుకున్నారు జగన్‌. దళితులను చంపుకొనితినే తోడేళ్లను ప్రేమగా సాకడమంటే తనకు మహాఇష్టమని ఆయన నిరూపించు కున్నారు. దళితుడి హత్యకేసులో నిందితుణ్ని జగనే ముద్దుచేస్తుండటంతో పోలీసులూ అనంతబాబుకు సాగిలపడుతున్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదేంటని నిలదీసిన నేరానికి అనంతబాబు గన్‌మెన్‌, ఆయన అనుచరులు తమను దారుణంగా కొట్టారని అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ యువకులు తాజాగా వాపోయారు. ఇదీ- జగన్‌మోహన్‌ రెడ్డి రాజ్యం! దళితులను చంపి, గిరిజనుల తలలు పగలగొట్టే పైశాచికత్వాన్ని నరనరాల్లో నింపుకొన్న నరరూప రాక్షసుల రాజ్యం!


దురహంకారి జగన్‌ పాలనలో..

జనమంతా తన దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి బతకాలనుకునే భూస్వామ్య మనస్తత్వం జగన్‌ది. తనను కాదన్న వారిని వెంటాడి వేధించే దుర్మార్గమూ ఆయనలో నిండుగా ఉంది. జగన్‌ శిష్యరికంలో వైకాపా నేతాగణాలన్నీ అలాగే మంచీ మానవత్వం లేని కర్కశ మూకలుగా తయారయ్యాయి. అనంతపురం జిల్లా ప్రసన్నాయపల్లిలో ఓచోట దళితులు గుడిసెలు వేసుకున్నారు. మొన్న మార్చి మొదటివారంలో రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అనుచరులు ఆ దళితుల మీద పడి ఇష్టమొచ్చినట్లు కొట్టారు. వారి గుడిసెలను తగలబెట్టారు. దళితులు ఉంటున్న స్థలాన్ని ఆక్రమించేందుకు వైకాపా నేతలు అంతకు మునుపే సిద్ధమయ్యారనే వాదనలున్నాయి. గుడిసెలు ఖాళీచేసి వెళ్లిపోవాలని జగన్‌ పార్టీ నాయకులు తమను చెండుకు తింటున్నారని, కాదన్నందుకు దౌర్జన్యం చేశారని బాధిత దళితులు మొత్తుకుంటున్నారు. దళితుల చేతుల్లో ఉన్న కొద్దోగొప్పో భూమిని లాగేసుకోవడానికి వైకాపా రక్కసి మందలు చేయని అరాచకాలంటూ లేవు. చిత్తూరు జిల్లా బోయకొండ క్రాస్‌లో దళితుడైన శ్రీనివాసులు కుటుంబానికి కొంత భూమి ఉంది. జగన్‌ పార్టీ మనుషుల కన్ను దాని మీద పడింది. ఆ భూమిని చేజిక్కించుకోవడానికి వచ్చినవాళ్లు.. శ్రీనివాసులు కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడిచేశారు. మహిళలను జుట్టుపట్టుకుని కాళ్లతో తన్నారు. కర్రతో నడుములు విరగ్గొట్టారు. ఓ దివ్యాంగుడి వేళ్లు విరిచేశారు. అనంతపురం జిల్లా వెలిగొండ, నెల్లూరు జిల్లా నాగుల వెల్లటూరుల్లో కూడా దళితుల భూములను సొంతం చేసుకోవడానికి వైకాపా నాయకులు తెగబడ్డారు. అడ్డొచ్చిన వారిని చావబాదారు. బాపట్ల జిల్లా చుండూరుపల్లిలో దళిత రైతు దంపతులను జగన్‌ పార్టీ సానుభూతిపరులు కత్తులతో నరికారు. ఆధిపత్య దురహంకారం, హింసోన్మాదం బుసలుకొట్టిన జగన్‌ ఏలుబడిలో ఎస్సీలకు ఎక్కడా కనీస రక్షణ లేకుండా పోయింది. ఈ వాస్తవాన్ని దాచేసి దళితుల అభ్యున్నతి కోసం తాము తెగ పాటుపడ్డామంటూ నెత్తురు అంటిన చేతులతోనే జగన్‌ నిర్లజ్జగా చాటింపు వేసుకుంటున్నారు.


జగన్‌ హఠావో.. దళిత్‌ బచావో

‘‘క్రైమ్‌రేటును తగ్గించడానికి మన పోలీసులు నిరంతరం కృషిచేస్తున్నారు’’ అని ఖాకీలకు జగన్‌ కితాబిచ్చారు. ఏపీ పోలీసుల పనితీరు మెరుగుపడిందనీ ఆయన చంకలు గుద్దుకున్నారు. నిజానికి ఖాకీల పని తీరు బాగుందంటే అది జగన్‌ పార్టీకి పాదసేవ చేయడంలోనే! సామాన్యులకు.. ముఖ్యంగా దళితులకు భద్రత కల్పించడంలో పోలీసుల పనితీరు గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. జగన్‌ సొంత జిల్లాలో పశుసంర్థకశాఖ ఉపసంచాలకుడు, దళిత అధికారి డాక్టర్‌ అచ్చెన్న అతిదారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన అదృశ్యంపై అంతకు కొన్ని రోజుల ముందే ఫిర్యాదు వచ్చినా పోలీసులు పెద్దగా స్పందించలేదు. జగన్‌ దృష్టిలో పోలీసులు బాగా పనిచేయడమంటే ఇదే కాబోలు! ఇక గుంటూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో దళితులపై వరస దాడులు జరిగాయి. ఆ ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌- ఖాకీల వైఫల్యాన్ని ఎండగట్టారు. పోలీసులు ఓ సామాజిక వర్గానికి మద్దతుగా నిలుస్తున్నారని, బాధితుల కుటుంబాలు ఫిర్యాదు చేసినా రోజుల తరబడి కేసులు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ జగన్‌ ఏలుబడిలో దళితుల దయనీయ స్థితి! దళితులను చిత్రహింసలు పెడుతూ, వారిపైనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులను నమోదు చేస్తూ వైకాపా దాసానుదాసులైన పోలీసులు గత అయిదేళ్లలో అంతులేని అరాచకాలకు పాల్పడ్డారు. కడుపులో కత్తులు పెట్టుకుని పైకి ‘‘నా ఎస్సీలు..’’ అంటూ కపట డైలాగులు కొట్టే జగన్‌- అణగారిన వర్గాలపై జరుగుతున్న హింసాకాండను అడ్డుకోలేదు. సరికదా, అనంతబాబు లాంటి తన సామంతులకు రాచమర్యాదలు చేయించి దళిత సమాజానికి తీరని ద్రోహం చేశారు. అందుకే విద్యాధికులైన ఎస్సీ యువత ఇప్పుడు ‘జగన్‌ హఠావో - దళిత్‌ బచావో’ (దళితులు బతకాలంటే జగన్‌ను వెళ్లగొట్టాల్సిందే) అని గట్టిగా నినదిస్తున్నారు. అవును.. అంబేడ్కర్‌ ఆశించిన స్వేచ్ఛాసమాజం సాకారం కావాలంటే- జగన్‌ మోహన్‌ రెడ్డి దానవ రాజ్యం కూలిపోవాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని