నవీన్‌ పట్నాయక్‌ నిర్మించారు.. జగన్‌ ముంచేశారు

ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్‌ పట్నాయక్‌ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు.

Published : 18 Apr 2024 06:45 IST

నాగావళి నదిపై  వంతెనల నిర్మాణం తీరిది

ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్‌ పట్నాయక్‌ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. 2019 ఎన్నికల ముందు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జగన్‌ పర్యటిస్తూ.. కొమరాడ మండలంలో పూర్ణపాడు-లాబేసు వద్ద వంతెన నిర్మాణం పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అయిదేళ్లలో కేవలం పది శాతం పనులు చేసి ఓట్లేసిన ప్రజలను పూర్తిగా మోసం చేశారు. పూర్ణపాడు తరువాత నాగావళికి మరోవైపు తొమ్మిది పంచాయతీల్లో 33 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 19 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరు నేరుగా మండల కేంద్రానికి చేరుకునేందుకు పూర్ణపాడు-లాబేసు మధ్య రూ.6 కోట్ల అంచనాతో 2006లో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ ఐటీడీఏ, ర.భ.శాఖ, పంచాయతీరాజ్‌ శాఖల మధ్య సమన్వయలోపంతో పనులు ముందుకు కదల్లేదు. 2017లో తెదేపా హయాంలో రూ.4 కోట్లు అదనంగా కేటాయించి 50 శాతం పనులు పూర్తి చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో జగనే హామీ ఇవ్వడంతో వంతెన పూర్తిచేస్తారని స్థానికులు భావించారు. 2019లో ఉప ముఖ్యమంత్రి హోదాలో పుష్పశ్రీవాణి మరో రూ.4 కోట్లు కేటాయించినా.. పనులు పిల్లర్ల దశ దాటలేదు. దీంతో ఇక్కడివారు అవస్థలు పడుతూ 50 కిలోమీటర్లు చుట్టూ తిరిగి మండల కేంద్రానికి చేరుకుంటున్నారు. మరోవైపు ఈ వారధికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా రాష్ట్రం కరడ సమీపంలో అక్కడి ప్రభుత్వం 2018లో వంతెన నిర్మాణం ప్రారంభించి 2023లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

న్యూస్‌టుడే, కొమరాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని