మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?

న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్‌ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది.

Updated : 18 Apr 2024 10:38 IST

రూపం, పేరు మార్చి తిరుగుతూ సవాల్‌  విసురుతుంటే చేష్టలుడిగి చూస్తున్న సీబీఐ
ఈనాడులో కథనం వచ్చాక  24గంటలపాటు ‘శివ అన్నపురెడ్డి’ పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతా తొలగింపు
బుధవారం మధ్యాహ్నం మళ్లీ పునరుద్ధరణ
ఈ వ్యవధిలో విదేశాలకు వెళ్లిపోయి ఉండొచ్చని అనుమానాలు

ఈనాడు, అమరావతి: న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్‌ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. సీబీఐ వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్న ఆయన పేరు, రూపం మార్చేసుకుని అమెరికా నుంచి స్వదేశానికి వచ్చి ఇక్కడ దర్జాగా వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంటే కనీసం పట్టుకునేందుకు ప్రయత్నమైనా చేయలేదు. ‘సీబీఐ వెతుకుతున్న నిందితుడు.. సీఎం జగన్‌ పక్కనే’ శీర్షికతో ఈ నెల 16న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమవగా తన ఉనికి చిక్కకుండా అదే రోజు ఉదయానికి ‘శివ అన్నపురెడ్డి’ పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతాను ఆయన తొలగించేశారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అదే ఖాతాను పునరుద్ధరించి పోస్టులు పెట్టారు.

ఈ వ్యవధిలో మణి అన్నపురెడ్డి భారత్‌ నుంచి  ఏదైనా దేశానికి వెళ్లిపోయి ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాతే ఆయన అక్కడ నుంచి ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నట్లు కనిపిస్తోంది. న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను అసభ్యంగా దూషించిన కేసులో నిందితుడు ఇలా దర్జాగా తిరుగుతుంటే.. సీబీఐ చేతులు ముడుచుకుని కూర్చోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ ఎన్‌ఆర్‌ఐ యష్‌ బొద్దులూరిపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ.. ఇమ్మిగ్రేషన్‌ అధికారుల ద్వారా సమాచారం తెలుసుకుని, ఆయన అమెరికా నుంచి వచ్చి శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగిన వెంటనే అరెస్టు చేసింది. అలాంటిది న్యాయమూర్తులపై దూషణలో కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి దేశాల మధ్య హాయిగా తిరుగుతుంటే సీబీఐ పట్టుకోలేకపోతోందా? ఇలాంటి వ్యక్తికి అధికార పార్టీ పెద్దలు యూఎస్‌ఏ వైకాపా కన్వీనర్‌ పదవి ఇవ్వటాన్ని ఏమనాలి? స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల వెంట తిరుగుతూ, వారితో ఫొటోలు దిగుతున్నారంటేనే ఆయనకు వైకాపా పెద్దల మద్దతు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అందుకే తనను ఏ వ్యవస్థలూ ఏమీ చేయలేవనే ధిక్కారంతో మణి అన్నపురెడ్డి వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని