చెరలోనే అనుమానితులు!

సీఎం జగన్‌పై రాయి విసిరిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన అనుమానితులు ఇంకా పోలీసుల చెరలోనే ఉన్నారు. వారి ఆచూకీ గురించి చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

Published : 18 Apr 2024 03:48 IST

సీఎంపై రాయి విసిరిన కేసులో పోలీసుల అదుపులో మరో ముగ్గురు
వడ్డెర కాలనీ వాసుల ఆవేదన.. ఆందోళన
తమ వారి ఆచూకీ చెప్పాలని డిమాండ్‌
కమిషనర్‌ కార్యాలయం, అజిత్‌సింగ్‌నగర్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ నేరవార్తలు: సీఎం జగన్‌పై రాయి విసిరిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన అనుమానితులు ఇంకా పోలీసుల చెరలోనే ఉన్నారు. వారి ఆచూకీ గురించి చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌లోని వడ్డెరకాలనీకి చెందిన పలువురు మైనర్లను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. వారిని రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నట్లు తెలిసింది. వైకాపా నాయకుల ప్రోద్బలంతో పోలీసులు తమపై అక్రమంగా కేసులు పెడుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెవరిని ఇరికిస్తారో అనే భయంతో కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. రెండు, మూడు వీధులు జన సంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున అయిదుగురిని, సాయంత్రం.. ఆటోడ్రైవర్‌, తెదేపా నాయకుడు వేముల దుర్గారావును పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసినా వారి వివరాలు తెలియడంలేదు. తమ సామాజికవర్గాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని పోలీసులను నిలదీస్తున్నారు. ఆటో డ్రైవరు దుర్గారావు తెదేపా పథకాల పట్ల ఆకర్షితులై రెండు నెలల క్రితమే ఆ పార్టీలో చేరారు. దీంతో వైకాపా నేతల మాటలు విని పోలీసులు ఆయనను అక్రమంగా ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అడ్డుకున్న పోలీసులు.. ఆటోల్లో బలవంతంగా తరలింపు

రెండు రోజులుగా పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం మధ్యాహ్నం అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద బాధితులు ఆందోళన చేశారు. స్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన బాలల కుటుంబ సభ్యులకు కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను తరఫున వాదించిన న్యాయవాది సలీం సంఘీభావం ప్రకటించారు. వారి తరఫున వకల్తా తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొనడంతో.. అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. న్యాయవాదితో కలిసి స్టేషన్లోకి వెళ్లిన కుటుంబ సభ్యులకు.. తమవారు ఎవరూ కనిపించకపోవడంతో తిరిగి వచ్చారు. సాయంత్రం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి బయలుదేరారు. పోలీసులు వారిని రోడ్డు మొదట్లోనే నిలిపివేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధితులంతా రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసులు వారిని బలవంతంగా ఆటోల్లో ఎక్కించి, అయోధ్యనగర్‌లోని నార్త్‌ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. కాలనీవాసులు, కుటుంబ సభ్యులతో అక్కడ 15 నిమిషాల పాటు చర్చించారు. తమ అదుపులో ఉన్న వారిని గురువారం సాయంత్రం ఇంటికి పంపించేస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు కాలనీవాసులు చెప్పారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కొందరిని గురువారం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

న్యాయాధికారి ఇంటికి వెళ్లిన న్యాయవాది

పోలీసుల అదుపులో ఉన్నవారి ఆచూకీ తెలపాలని కోరుతూ న్యాయవాది సలీం సెర్చ్‌ వారెంట్‌ పిటిషన్‌ వేసేందుకు సమాయత్తం అయ్యారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి ఆయన ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధికారి రమణారెడ్డి నివాసానికి వెళ్లారు. అత్యవసరంగా వినాలని కోరారు. ఈరోజు సెలవు దినం కావడంతో.. గురువారం నేరుగా కోర్టులో దాఖలు చేయాలని మేజిస్ట్రేట్‌ సూచించారు.


జగన్‌ బండారం బయటపెట్టేందుకే వచ్చా..
- సలీం, న్యాయవాది

‘‘జగన్‌పై గులకరాయి దాడి ఘటనకు.. విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి కేసుకు పోలిక ఉంది. అది బాహుబలి- 1 అయితే.. ఇది బాహుబలి-2. జగన్‌మోహన్‌రెడ్డికి ఎన్నికల ముందు ఇలాంటి డ్రామాలు అలవాటే. అమాయకులైన ప్రజలను నమ్మించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈ వ్యవహారాన్ని బయట పెట్టేందుకే నేను ఇక్కడికి వచ్చా. కేసులో పలువురు మైనర్లు, ఆటోడ్రైవర్‌ దుర్గారావును రెండు రోజుల నుంచి పోలీసులు అక్రమంగా కస్టడీలో ఉంచుకున్నారు. వారి తరఫున వకల్తా తీసుకున్నా. న్యాయస్థానంలో సెర్చ్‌ వారెంట్‌ పిటిషన్‌ వేస్తున్నా. మైనర్లను వారి కుటుంబ సభ్యులకు చెప్పకుండా తమ కస్టడీలో ఎలా ఉంచుకుంటారు? ఈ అంశంపైనే పిటిషన్‌ వేయబోతున్నా’’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు