అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?

జగన్‌పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్‌ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు.

Updated : 18 Apr 2024 08:17 IST

తల్లిని ప్రశ్నిస్తున్న వేముల దుర్గారావు పిల్లలు
సీఎంపై దాడి కేసులో నిర్బంధించిన పోలీసులు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ నేరవార్తలు: జగన్‌పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్‌ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. మంగళవారం సాయంత్రం అజిత్‌సింగ్‌నగర్‌ డాబాకొట్ల సెంటర్‌లోని ఓ బంకులో స్నేహితుడితో కలిసి టీ తాగుతుండగా.. పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల క్రితమే ఆయన తెదేపాలో చేరారు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. భార్య శాంతి అంగన్‌వాడీ ఆయా. తండ్రిని పోలీసులు పట్టుకెళ్లారని తెలిసిన నాటి నుంచి పిల్లలు అన్నం తినడం మానేశారు. ‘నాన్న ఎక్కడ ఉన్నారు? ఎప్పుడు వస్తారు?’ అని పిల్లలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక తల్లి, బంధువులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఆటో నడిపి డబ్బులు తెస్తేనే పూట గడిచే ఆ కుటుంబం.. మంగళవారం రాత్రి నుంచి మంచినీళ్లు కూడా ముట్టలేదు. భర్త కోసం పిల్లలతో భార్య శాంతి పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.

ఆ కాలనీ వారికి తలలో నాలుక

ఐటీఐ చదివిన దుర్గారావు.. కాలనీవాసులకు తలలో నాలుకలా ఉంటారు. తమకు అవసరం వచ్చినా, సమస్య ఎదురైనా కాలనీవాసులు ఆయనకు చెప్పుకునేవారు. బీసీల కోసం పాటు పడుతూ.. తెదేపా పథకాల పట్ల ఆకర్షితులై 2 నెలల క్రితం ఆ పార్టీలో చేరారు. నాయకుడిగాఎదగడం.. తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి తిరుగుతుండడంతో వైకాపానేతలు ఈ కేసులో ఇరికించారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నా భర్తను నాకు చూపించాలి..
- శాంతి, వేముల దుర్గారావు భార్య

‘‘ఈ కేసుతో నా భర్తకు ఏం సంబంధం ఉందని పోలీసులు తీసుకెళ్లారో చెప్పాలి. ఆయన కోసం అజిత్‌సింగ్‌నగర్‌ స్టేషన్‌కు వెళ్లాం. ఎవరూ సమాధానం చెప్పలేదు. పోలీసు కమిషనర్‌ కార్యాలయానికీ వెళ్లాం. అక్కడ ఎవరూ లేరని చెప్పారు. మరి ఎక్కడ ఉంచారో భార్యకు, కుటుంబ సభ్యులకు కూడా చెప్పరా? తెదేపాలో చేరడమే ఆయన చేసిన తప్పా? తండ్రి కోసం పిల్లలు తిండి మానేసి అల్లాడుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏం ఆధారాలు ఉన్నాయని ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు? నా భర్తను వెంటనే నాకు చూపించాలి’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని