నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Updated : 18 Apr 2024 10:18 IST

25 వరకు గడువు
సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు 29 వరకు అవకాశముంది. లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్‌ పత్రాలు సమర్పించాలి. లోక్‌సభ అభ్యర్థి రూ.25 వేలు, శాసనసభ అభ్యర్థి రూ.10 వేలు ధరావత్తు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50% చెల్లిస్తే సరిపోతుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి. నామినేషన్‌ పత్రాల దాఖలు ప్రక్రియతో పాటు అభ్యర్థుల ఊరేగింపులు సైతం సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేస్తాం’ అని సీఈఓ పేర్కొన్నారు.


అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • నామినేషన్‌ దాఖలుకు అభ్యర్థులు 13 రకాల ధ్రువపత్రాలు తీసుకురావాలి.
 • లోక్‌సభ స్థానానికి పోటీచేసే అభ్యర్థులు ఫాం-2ఎ, శాసనసభ అభ్యర్థి ఫాం-2బిలో దరఖాస్తు చేయాలి.
 • నిర్ణీత తేదీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ పత్రాలు స్వీకరిస్తారు.
 • ప్రభుత్వ సెలవు రోజుల్లో నామినేషన్‌ పత్రాలు స్వీకరించరు.
 • అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయవచ్చు.
 • ఆయా పత్రాలను సంబంధిత రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కి, ఏఆర్వోకి మాత్రమే ఇవ్వాలి.
 • అభ్యర్థి తన నామినేషన్‌ పత్రాలు నేరుగా కానీ తన ప్రతిపాదకుడు (ప్రపోజర్‌) ద్వారా కానీ సమర్పించవచ్చు.
 • నామినేషన్‌ పత్రాలతో పాటు కొత్త బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి.
 • రెండు కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్లు వేయడం కుదరదు.
 • నామినేషన్‌ దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్ఠంగా మూడు వాహనాలకే అనుమతిస్తారు.
 • అభ్యర్థి సహా అయిదుగురినే ఆర్వో కార్యాలయంలోకి అనుమతిస్తారు.
 • అన్ని నియోజకవర్గాల్లో హెల్ప్‌డెస్క్‌లు అందుబాటులో ఉంటాయి.
 • ‘సువిధ’ యాప్‌ ద్వారా నామినేషన్‌ దాఖలు చేసినా వాటి పత్రాలను ఆర్వోకి భౌతికంగా ఇవ్వాలి.
 • ఫాం-26 ద్వారా అఫిడవిట్‌ సమర్పించాలి. దాని స్టాంప్‌ పేపర్‌ విలువ రూ.10 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఈ-స్టాంప్‌ కూడా వినియోగించవచ్చు.
 • అభ్యర్థి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన నాటి నుంచి అతని వ్యయాన్ని లెక్కిస్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని