తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా

విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్‌ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ తెలిపారు.

Updated : 18 Apr 2024 06:47 IST

ఏప్రిల్‌ 23కు బదులు జూన్‌ 12న నిర్వహించాలని ప్రవీణ్‌ప్రకాశ్‌ ఆదేశం

ఈనాడు, అమరావతి: విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్‌ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఈ సమావేశం నిర్వహించాలని ప్రవీణ్‌ప్రకాశ్‌ ఆదేశించడాన్ని తప్పుపడుతూ పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. అనంతరం ఈ ఆదేశాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు భాజపా ఫిర్యాదు చేసింది. దీంతో ప్రవీణ్‌ప్రకాశ్‌ సమావేశాన్ని వాయిదా వేశారు. తల్లిదండ్రుల కమిటీ సమావేశాన్ని పాఠశాలల పునఃప్రారంభం రోజు జూన్‌ 12న నిర్వహించాలని పేర్కొన్నారు. పాఠశాలల చివరి పని రోజున విద్యార్థులందరికీ రిపోర్టు కార్డులు పంపిణీ చేయాలని, సమ్మెటివ్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను సమగ్ర విశ్లేషణ కోసం పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.


వీశాట్‌-2024 ఫేజ్‌-1 ఫలితాలు విడుదల

పొన్నూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వీశాట్‌-2024 ఫేజ్‌-1 (విజ్ఞాన్‌ స్కోలాస్టిక్‌ యాప్టిట్యూడ్‌ టెస్ట్‌) ప్రవేశ పరీక్ష ఫలితాలను బుధవారం డీన్‌ అడ్మిషన్స్‌ కేవీ కృష్ణ కిశోర్‌, ఉపకులపతి పి.నాగభూషణ్‌, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ పీఎంవీ రావు విడుదల చేశారు. బీటెక్‌, బీఫార్మసీ, అగ్రికల్చరల్‌ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీశాట్‌-2024 ఫేజ్‌-1కు విశేష స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. వీశాట్‌-2024 ర్యాంకుతోపాటు జేఈఈ మెయిన్‌ ఫలితాలు, ఎంసెట్‌ ర్యాంకులు, ఇంటర్మీడియట్‌ మార్కులనూ పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. వీశాట్‌లో 50లోపు ర్యాంకులు సాధించిన వారికి 50 శాతం, 51 నుంచి 200లోపు వారికి 25 శాతం, 201 నుంచి రెండు వేల లోపు ర్యాంకులున్న వారికి పది శాతం స్కాలర్‌షిప్‌ అందజేస్తామని తెలిపారు. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు విజ్ఞాన్‌ యూనివర్సిటీలో బీటెక్‌, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చరల్‌ సైన్స్‌ ప్రవేశాల  మొదటి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. వీశాట్‌-2024 ఫేజ్‌-2 ప్రవేశ పరీక్షలను మే 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఫలితాలను వెబ్‌సైట్‌ https://www.vignan.ac.in.vsatresult/లో అందుబాటులో ఉంచామని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని