ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు

ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Published : 18 Apr 2024 05:10 IST

వేసవి సెలవుల్లో తరగతులొద్దని సుద్దులు చెప్పిన సర్కారు
ఇప్పుడు తరగతులేంటని అధ్యాపకుల విమర్శలు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వేసవి సెలవుల్లో ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆ శాఖే ఇప్పుడు ప్రభుత్వ కళాశాలల్లో పునశ్చరణ తరగతులు నిర్వహించాలంటూ ఆదేశాలిచ్చింది. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని ఇటీవల ప్రైవేటు కళాశాలలను హెచ్చరించగా.. ప్రభుత్వ కళాశాలల్లో గురువారం నుంచి పునశ్చరణ తరగతులు ప్రారంభించాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, ప్రిన్సిపాళ్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అధ్యాపకులు మండిపడుతున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు కళాశాలలకు వచ్చే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులు సరిపడా లేకపోవడం, కొత్తవారిని నియమించకపోవడంతోపాటు రీఅడ్మిషన్లు పొందినవారు తరగతులకు సరిగా హాజరుకాకపోవడంతో పబ్లిక్‌ పరీక్షల్లో ఘోరమైన ఫలితాలు వచ్చాయి. మొదటి ఏడాదిలో 62%, ద్వితీయ సంవత్సరంలో 42% మంది విద్యార్థులు పరీక్ష తప్పారు. పబ్లిక్‌ పరీక్షల్లో అనుత్తీర్ణులైన వారికి మే 24 నుంచి జూన్‌ 1వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ నిర్వహించేందుకు ఇప్పటికే బోర్డు షెడ్యూల్‌ ఇచ్చింది.

ఉన్నతాధికారి అత్యుత్సాహం

పాఠశాల విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తిని పెంచి చూపించేందుకు ఉన్నతాధికారి చేసిన ప్రయత్నం ఇంటర్మీడియట్‌లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలవడానికి దారి తీసింది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోతున్నందున దీన్ని పెంచి చూపించేందుకు గతంలో ఫెయిలయిన వారిని సైతం రెగ్యులర్‌ విద్యార్థుల్లా ప్రవేశాలు కల్పించాలని ఆదేశాలిచ్చారు. కళాశాలల ప్రిన్సిపాళ్లపై ఒత్తిడి తెచ్చి, పరీక్ష ఫీజులు కట్టించారు. కొన్నిచోట్ల విద్యార్థులు ఆసక్తి చూపకపోయినా ప్రిన్సిపాళ్లే పరీక్ష ఫీజులు చెల్లించారు. వీరు తరగతులకు హాజరుకాలేదు. పాఠాలు వినకపోవడంతో ఇలా రీ-అడ్మిషన్లు పొందినవారిలో చాలా మంది ఫెయిలయ్యారు. ప్రభుత్వ కళాశాలల నుంచి మొదటి సంవత్సరం పరీక్షలకు 46,549 మంది హాజరైతే 17,789 (38%) మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు 36,929 మంది రాస్తే వీరిలో 21,382 (57.9%) మంది ఉత్తీర్ణత సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని