ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం

తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.

Published : 18 Apr 2024 05:12 IST

ఒంటిమిట్టలా రామతీర్థాన్ని అభివృద్ధి చేస్తాం
శ్రీరామనవమి సందర్భంగా చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒంటిమిట్టలా విజయనగరం జిల్లాలోని రామతీర్థం దేవాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎక్స్‌ వేదికగా తెలుగు ప్రజలకు ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌ సీఎం అయ్యాక దేవాలయాలు, అర్చకులపై దాడులు పెరిగాయని.. రథాలు తగలబెట్టారని మండిపడ్డారు. ‘నవమి అనగానే నాకు వైయస్‌ఆర్‌ జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో చేసిన అభివృద్ధి గుర్తుకు వచ్చింది. దీంతోపాటు మూడేళ్ల క్రితం రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తలను తొలగించి.. కోనేరులో పడేసిన దారుణ ఘటన గుర్తుకొచ్చి మనసు కలత చెందింది. వైకాపా ప్రభుత్వంలో తిరుమల పుణ్యక్షేత్రం సహా అనేక ఆలయాల పవిత్రతను దెబ్బతీసే చర్యలు జరిగాయి. కానీ ఏ ఒక్క ఘటనలోనూ నిందితులు అరెస్టు కాలేదు. ‘భక్తుల మనోభావాలపై గొడ్డలి పోట్లు’ అనేట్టుగా సుమారు 160 ఘటనలు జరిగినా.. ఈ ప్రభుత్వం అది సమస్యే కాదన్నట్లు చూడటం భక్తుల్ని మరింత బాధించింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని