డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం

అప్పులకు అలవాటు పడిన జగన్‌ సర్కార్‌.. విద్యుత్‌ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది.

Published : 18 Apr 2024 06:09 IST

పరపతికి మించి రుణాలు
వైకాపా పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితి
ప్రతి నెలా వాయిదా చెల్లించడానికే రూ.1,600 కోట్లు అవసరం

ఈనాడు, అమరావతి: అప్పులకు అలవాటు పడిన జగన్‌ సర్కార్‌.. విద్యుత్‌ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. అందరిలో వెలుగులు నింపే డిస్కంలు.. ఇప్పుడు అప్పులు తీర్చే దారి చూపే దీపం కోసం వెతుక్కునేలా దిగజార్చింది. రుణ పరపతికి సరిపడా ఆస్తులు లేకపోవడంతో కొత్త అప్పుల కోసం ప్రభుత్వ హామీ కోసం డిస్కంలు ఎదురుచూసే దుస్థితి కల్పించింది. గత రెండేళ్లలో వాటిపై రూ.24,031 కోట్ల కొత్త అప్పులు చేసింది. ఈ లెక్కన ప్రతి నెలా రూ.వెయ్యి కోట్లు అప్పు చేస్తేనే డిస్కంలకు ఆర్థికంగా వెసులుబాటు లభించే పరిస్థితి ఏర్పడింది. విద్యుత్‌ సరఫరా మెరుగుపరిచే పేరుతో అస్మదీయ కంపెనీల నుంచి ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు, అభివృద్ధి పనులను అప్పులు తెచ్చి మరీ చేసేలా ప్రతిపాదించాయి. విద్యుత్‌ పంపిణీ సంస్థల పునర్‌వ్యవస్థీకరణ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్‌) కింద స్మార్ట్‌ మీటర్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం పీఎఫ్‌సీ నుంచి రూ.10 వేల కోట్ల రుణం కోసం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ మొత్తం కూడా కలిపితే అప్పుల భారం సుమారు రూ.71,500 కోట్లకు చేరుతుంది.

2 ఏళ్లలో రూ.24 వేల కోట్ల అప్పులు

2021 నవంబరు నాటికి వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి డిస్కంలు తీసుకున్న రుణాలు రూ.37,377 కోట్లు. నిరుడు నవంబరు నాటికి అది రూ.61,407 కోట్లకు పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉన్న అప్పులతో పోలిస్తే.. గడిచిన రెండేళ్లలో డిస్కంలు 60.87 శాతం కొత్త అప్పులు తెచ్చాయి. ఈ మొత్తంపై ఏటా సుమారు రూ.6 వేల కోట్లు వడ్డీగా చెల్లించాల్సి వస్తోంది. అంటే నెలకు రూ.500 కోట్లు. డిస్కంలు ప్రతి నెలా సగటున తెచ్చే రూ.వెయ్యి కోట్ల కొత్త రుణాల్లో 50 శాతం మొత్తం పాత అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. వైకాపా అయిదేళ్ల పాలనలో డిస్కంలను అప్పుల భారంతో నిర్వీర్యం చేసింది. సిబ్బందికి ప్రతి నెలా జీతాలు సకాలంలో చెల్లించలేని దుర్భర స్థితికి దిగజార్చింది. దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తిలో గుర్తింపు సాధించిన జెన్‌కో నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) జాబితాలో చేరే పరిస్థితి కల్పించింది.

వైకాపా అధికారం చేపట్టిన తర్వాత విద్యుత్‌ ఒప్పందాల (పీపీఏల) సమీక్ష పేరుతో వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుంది. ఆ సమయంలో ఆయా సంస్థల నుంచి తీసుకోవాల్సిన విద్యుత్‌లో కర్టైల్‌మెంట్‌ విధించింది. కేంద్రం హెచ్చరికలు, ఇతర పరిణామాలతో వాటి నుంచి విద్యుత్‌ తీసుకోక తప్పలేదు. ఆ సమయంలో బహిరంగ మార్కెట్‌ నుంచి విద్యుత్‌ కొని, ఆ భారాన్ని వినియోగదారులపై వేసింది. కోర్టు ఆదేశాల మేరకు పీపీఏ ప్రకారం పూర్తి మొత్తాన్ని విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు చెల్లించడానికి డిస్కంలు మరో రూ.8 వేల కోట్లు అప్పులు తెచ్చాయి. ఆ మొత్తాన్ని నష్టాల్లో చూపాయి.

ఆర్థికంగా కుప్పకూలే పరిస్థితి

ప్రతి నెలా డిస్కంలకు వచ్చే ఆదాయం కంటే.. విద్యుత్‌ కొనుగోలు, రుణాలపై వాయిదాలు, సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులకు సర్దుబాటు చేయాల్సిన మొత్తమే ఎక్కువగా ఉంటోంది. ప్రతి నెలా విద్యుత్‌ విక్రయాల ద్వారా డిస్కంలకు వసూలయ్యే బిల్లుల మొత్తం సగటున రూ.4,839 కోట్లు ఉంటే నిర్వహణకు రూ.4,906 కోట్లు అవసరమవుతోంది. అంటే నెలకు రూ.67 కోట్ల వంతున.. ఏటా రూ.804 కోట్లు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. దీంతోపాటు ఇప్పటికే ఉన్న రుణాలపై ప్రతి నెలా వాయిదా, వడ్డీ కలిపి రూ.1,609 కోట్లు చెల్లించాలి. ఇందుకోసం అంతర్గతంగా సర్దుబాటు చేసిన సొమ్మ పోను.. మిగిలిన మొత్తాన్ని అప్పు కింద తీసుకుంటేనే గట్టెక్కే పరిస్థితి. ఈ నేపథ్యంలో డిస్కంలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం..  వివిధ కేటగిరిల కింద సరఫరా చేసిన విద్యుత్‌కు తాను చెల్లించాల్సిన రూ.23వేల కోట్లకు పైగా బకాయిలనూ చెల్లించడం లేదు. దీంతో డిస్కంలకు ఊపిరాడటం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని