వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు

వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది.

Updated : 19 Apr 2024 12:22 IST

ఉమ్మడి కడప జిల్లా ఆర్టీసీ డిపోల్లో ఎన్నికల ప్రచారం
ప్రభుత్వోద్యోగి అయినా.. అధికార పార్టీ కరపత్రాల పంపిణీ

ఈనాడు, అమరావతి: వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో.. ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సస్పెన్షన్‌ కాలంలో ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లరాదని హెచ్చరించింది. వెంకట్రామిరెడ్డి మొదటినుంచి ప్రభుత్వోద్యోగిలా కాకుండా వైకాపాకు అధికార ప్రతినిధిలా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల కోడ్‌కు ముందు, కోడ్‌ సమయంలోనూ అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ఉన్నతాధికారులు, వైకాపా పెద్దల మద్దతు ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలోని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న ఈయన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి పదవితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఉమ్మడి కడప జిల్లాలో మార్చి 31న ప్రజారవాణా శాఖ (పీటీడీ) వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, మరికొందరితో కలిసి వైకాపాకు ఓట్లు వేయాలని బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో ప్రచారం చేశారు. వైకాపాకు అనుకూలంగా కరపత్రాలు పంచారు. దీన్ని ‘ఈనాడు’ ఏప్రిల్‌ 2న ‘ప్రభుత్వ ఉద్యోగులా? వైకాపా నాయకులా?’ కథనంతో వెలుగులోకి తీసుకురావడంతో ఆర్టీసీ అధికారులు స్పందించారు. పీటీడీకి చెందిన చల్లా చంద్రయ్యతో పాటు 10 మందిని వెంటనే సస్పెండ్‌ చేశారు. ‘ఈనాడు’లో వచ్చిన కథనం ఆధారంగా వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు తెదేపా ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్‌ సమయంలో ఆర్టీసీ డిపోల్లో ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సైతం ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి, వెంకట్రామిరెడ్డిని సస్పెండ్‌ చేసింది.

వైకాపా నాయకుడిలా ప్రచారం..

వెంకట్రామిరెడ్డి అచ్చం అధికార వైకాపా నాయకుడిలా వ్యవహరించారు. ఎన్నికల కోడ్‌కు ముందు ‘మన ప్రభుత్వం- మన ప్రగతి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంతో మేలు జరిగిందంటూ ప్రచారం చేశారు. సంఘం నాయకుడిగా వచ్చే ఆన్‌డ్యూటీ సదుపాయాన్ని వాడుకుంటూ జిల్లాల్లో ప్రచారాలు చేశారు. ఎన్నికల కోడ్‌కు ముందు మార్చి 7న చిత్తూరు నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త విజయానందరెడ్డి నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. బహిరంగంగానే వైకాపాకు అనుకూల వ్యాఖ్యలు చేసినట్లు విమర్శలున్నాయి. మార్చి 8న అనంతపురంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. మార్చి 10న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, అనంతరం ఉద్యోగులను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని