ఏపీ సీఎస్‌, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం

ఆంధ్రప్రదేశ్‌లోని సీనియర్‌ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా చెప్పారు.

Updated : 19 Apr 2024 06:49 IST

వారిపై వచ్చిన ఫిర్యాదులకు వివరణ తీసుకుని దిల్లీకి పంపాం
విచారించుకుని తుది నిర్ణయం తీసుకుంటుంది
ఉద్దేశపూర్వకంగానే ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయలేదన్న ఫిర్యాదుపైనా వివరణ తీసుకున్నాం
సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతావైఫల్యం ఉంటే బాధ్యులపై చర్యలు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా

ఈనాడు, ఈనాడు డిజిటల్‌- అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని సీనియర్‌ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా చెప్పారు. ఆ ఫిర్యాదుల్లోని అంశాలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామన్నారు. దీంతోపాటు కేంద్ర నిఘా విభాగం ద్వారా, ఇతర పద్ధతుల్లో ఆ ఫిర్యాదులపైన విచారించుకుని ఈసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తదితర ఉన్నతాధికారులపై అందిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?’ అంటూ విలేకరులు ప్రశ్నించగా.. ముకేశ్‌కుమార్‌ మీనా ఈ మేరకు సమాధానమిచ్చారు.

వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ చేసేందుకు అవకాశమున్నా.. ఉద్దేశపూర్వకంగానే అలా పంపిణీ చేయకుండా ఇబ్బందులు కల్పించారని, దీంతో కొంతమంది వృద్ధులు చనిపోయారని ఫిర్యాదులందాయి. దీనిపై సంబంధిత శాఖ నుంచి వివరణ తీసుకుని ఈసీఐకి నివేదించాం. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై రాయి విసిరిన ఘటనకు భద్రతావైఫల్యమే కారణమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఈ ఘటన జరిగిన వెంటనే విజయవాడ పోలీసు కమిషనర్‌ను పిలిపించి నివేదిక తీసుకున్నాం. దర్యాప్తు తీరుపై రోజువారీ నివేదికలు తీసుకుంటున్నాం. కేసు దర్యాప్తు నడుస్తోంది. ఒకర్ని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రిపై రాయి దాడి జరిగిన సమయంలో వెలుతురు లేదు.. స్పాటర్లు లేరు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా జెడ్‌ ప్లస్‌, ఎస్పీజీ సెక్యూరిటీ ఉన్న ప్రముఖుల భద్రత విషయంలో అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ పద్ధతులను (ఎస్‌ఓపీ) అన్ని జిల్లాల ఎస్పీలకు పంపించాం. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎక్కువ ఫిర్యాదులందుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంపై ప్రత్యేక  దృష్టిసారించింది. అందులో భాగంగా 18 మంది పోలీసు పరిశీలకుల్ని నియమించింది’ అని మీనా వివరించారు. ఆయన మాటల్లోని ఇతర ప్రధానాంశాలివీ.

ఆ వాలంటీర్లను పోలింగ్‌ ఏజెంట్లుగా అనుమతించడంపై ఈసీఐదే నిర్ణయం

వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వారు రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతే వారిపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. నిబంధనల ప్రకారం ఓటరు జాబితాలో పేరున్న స్థానికులు పోలింగ్‌ ఏజెంట్‌గా ఉండేందుకు అర్హులు. అయితే ఎవరిపైనైనా నిషేధం విధించాలంటే కొత్త ప్రొవిజన్‌ పెట్టాలి. ఆ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికే ఉంది. వాలంటీర్లుగా రాజీనామా చేసిన వారిని పోలింగ్‌ ఏజెంట్లుగా అనుమతించొచ్చా     లేదా అనే అంశంపై ఈసీఐ  నిర్ణయం తీసుకుంటుంది.

సమస్యాత్మక కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా

‘రాష్ట్రవ్యాప్తంగా 30,111 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాం. ఆయా కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు జరగకుండా పోలింగ్‌ కేంద్రం లోపల, బయట కూడా ఒక్కో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తాం. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి ఒకరు చొప్పున సాధారణ ప్రత్యేక పరిశీలకుడు, ప్రత్యేక పోలీసు పరిశీలకుడు, ప్రత్యేక వ్యయ పరిశీలకులను ఇప్పటికే నియమించింది. 175 శాసనసభ నియోజకవర్గాలకు 50 మంది సాధారణ పరిశీలకులు, 18 మంది పోలీసు పరిశీలకులు నియమించింది. వ్యయ పరిశీలకులుగా లోక్‌సభ స్థానాలకు 25 మందిని, శాసనసభ స్థానాలకు 50 మందిని పంపింది. వారు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఓటింగ్‌ సరళిని పర్యవేక్షించి ఈసీకి నివేదిస్తారు. మద్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రత్యేక పోలీసు పరిశీలకుడు ఆదేశించిన నేపథ్యంలో అన్ని తయారీ కేంద్రాలు, గోదాంలో పాటు, వాటి వాహనాలకు కూడా జీపీఎస్‌ను అనుసంధానం చేయాలని ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేశాం. తయారీ కేంద్రం నుంచి విక్రయానికి కాకుండా మధ్యలో ఎక్కడికీ వెళ్లకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, ఉద్యోగులు, పాత్రికేయులు, అత్యవసర సేవల ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను మే 10లోపు పూర్తి చేయాలని నిర్ణయించాం. ఎన్నికల విధుల కోసం సుమారు 5.50 లక్షల మంది ఉద్యోగులను వినియోగించనున్నాం. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ఇంటింటి ప్రచారానికి ముందస్తు సమాచారమివ్వాలని రాజకీయ పార్టీలకు సూచించాం.

కేసుల నమోదు

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి వైకాపా వారిపై 136, తెదేపా వారిపై 126, ఇతరులపై 76 కేసులు నమోదు చేశాం. జనవరి 1 నుంచి గురువారం వరకు సుమారు రూ.180 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నాం. ఈ నెల 17 వరకు నగదు, నగలు తదితరాల స్వాధీనానికి సంబంధించి 7,336 కేసులు నమోదు చేశాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లఘించిన 1,017 మంది వాలంటీర్లను, 181 మంది ఒప్పంద, 127 మంది రెగ్యులర్‌ ఉద్యోగులను తొలగించాం.


అభ్యంతరకర పదజాలం వినియోగిస్తే చర్యలు

ఎన్నికల ప్రచారంలో అభ్యంతరకర పదజాలం వినియోగిస్తున్నారన్న ఫిర్యాదులపై కొందరు ముఖ్య నాయకులకు నోటీసులు జారీ చేశాం. వారిచ్చిన సమాధానాలను పరిశీలిస్తున్నాం. వారు మళ్లీ అలాంటి పదాలు వాడితే చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల అధికారులతో ఎన్నికల నిర్వహించాల్సినంత అసాధారణ పరిస్థితులేమీ రాష్ట్రంలో లేవు. మంత్రులకు ఎన్నికల నియమావళి ఎలా అమలవుతుందో.. క్యాబినెట్‌ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారులకు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండైన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు