‘జగన్‌ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!

వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్‌ జమానాలోనే దాపురించింది.

Published : 19 Apr 2024 06:12 IST

రోజుకో రైతు బలవన్మరణం
రాష్ట్రంలో ఏ అన్నదాతను కదిలించినా రూ.లక్షల్లో అప్పులే
వాటిని తీర్చే దారి కనిపించకనే తీవ్ర నిర్ణయాలు
బాధిత కుటుంబాలకు సరిగా అందని పరిహారం  
తన హయాంలోనే వ్యవసాయం సుభిక్షమంటూ సీఎం గొప్పలు
ఈనాడు - అమరావతి

దేశంలోనే మూడో స్థానం... ఇది వినడానికి బాగున్నా...
ఏ విభాగంలో, ఎందుకొచ్చిందో తెలిస్తే గుండెలు తరుక్కుపోతాయి...
అన్నదాతల ఆత్మహత్యల్లో ఏపీకి దక్కిన స్థానమిది!!
అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో...
పంటల దిగుబడుల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంలో...
ఇప్పుడు రైతుల బలవన్మరణాలు నిత్యకృత్యంగా మారిన దైన్యమిది...
తన ఐదేళ్ల పాలనలో జగన్‌ తీసుకొచ్చిన అపకీర్తి ఇది...
రైతుల జీవితాలను అల్లకల్లోలం చేసిన పాపమిది...


చదువుల తల్లి చేతికి పలుగు, పార

కర్నూలు జిల్లా ఆలూరు మండలం అంగసకల్లుకు చెందిన జయరాముడు(56) కుటుంబానికి ఉమ్మడిగా ఆరెకరాల పొలముంది. మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, ఆముదం వేసేవారు. బ్యాంకు నుంచి రూ.5.90 లక్షలు, ప్రైవేటుగా రూ.4 లక్షలు అప్పుగా తెచ్చి 14 బోర్లు వేయించినా అరకొర నీళ్లే వచ్చాయి. దాంతో ఏడేళ్లపాటు నష్టాలే మిగిలాయి. సొసైటీ అధికారులు నోటీసు పంపడంతో పొలం వేలానికి పోతుందనే ఆవేదనతో జయరాముడు తొమ్మిది నెలల కిందట ఉరేసుకున్నారు. ఆయనకు భార్య ఉచ్చీరమ్మ, ఆరుగురు కుమార్తెలున్నారు. అయిదుగురికి వివాహాలు చేశారు. చిన్న కూతురు పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో పాసైనా చదువు మాన్పించారు. కాలేజీకి పంపాల్సిన బిడ్డను కూలీ పనులకు తీసుకెళ్తున్నానని ఉచ్చీరమ్మ కన్నీరు పెట్టుకున్నారు. వీరికి ఇప్పటికీ పరిహారం అందలేదు.


వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్‌ జమానాలోనే దాపురించింది. వరుస నష్టాలతో రాయలసీమలో వేరుశనగ రైతులు సాగు నుంచే బయటకొచ్చేస్తున్నారు. మిరప రైతులకు నష్టం నషాళానికి అంటింది. పత్తి రైతులు తెల్లబోయారు. ఉద్యాన రైతులైతే... జగన్‌ పేరు వింటేనే వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్ని కష్టాలకోర్చి వ్యవసాయం చేస్తున్నా కాలం కరుణించడం లేదు. సర్కారు దయ తలచడంలేదు. ఏడాదిలో రెండు, మూడుసార్లు పంటల మునక... ఆపై కరవు కాటకాలు. రూ.లక్షల్లో పెరుగుతున్న అప్పుల్ని, వాటిపై వడ్డీల్ని తలచుకుని.. రైతు కుటుంబాలకు అన్నం సయించడం లేదు. ఇదిగో ఈ ఏడాది కలిసొస్తుందేమో అంటూ ఆశల సేద్యం చేసి చేసి.. అలసిపోతున్నారు. నిస్సహాయ స్థితిలో... నమ్ముకున్న పొలంలోనే కొందరు నిర్జీవులవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి సగటున 1,100 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.7లక్షలు ఇస్తామనే హామీనీ సక్రమంగా అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో  ఆత్మహత్య చేసుకున్న 39 రైతు కుటుంబాల పరిస్థితిపై ‘ఈనాడు’ క్షేత్ర పరిశీలన చేసింది. యజమాని మరణంతో వీధిన పడిన కుటుంబాలు, పిల్లల ఆకలి తీర్చడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తల్లుల కష్టాలు కళ్లకు కట్టాయి.

వ్యవ‘సాయం’పై జగన్‌ డాంబికాలు

‘‘మాది రైతు కష్టం తెలిసిన ప్రభుత్వం. ఆర్‌బీకేల ద్వారా వారిని చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. దేశంలో మరెక్కడా లేనంతగా రైతు భరోసా ద్వారా పెట్టుబడిలో 80% మేమే ఇస్తున్నాం. ఆహార ధాన్యాల దిగుబడి పెరిగింది. రైతులంతా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం అద్భుతంగా మారింది. మా ఏలుబడిలో వ్యవసాయం  సుసంపన్నం...’’ అంటూ సీఎం జగన్‌ కొన్ని వందల, వేలసార్లు బాకాలు ఊదారు. ఎన్నికల ప్రచారంలోనూ పదేపదే అదే వల్లెవేస్తున్నారు.

ఈ మాటలే నిజమైతే...

రాయలసీమలో ఎండిన పంటల సంగతేంటి? డెల్టాలో ధర దక్కని వరి రైతు పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో సాగెందుకు తగ్గుతోంది... ఉత్పత్తి ఎందుకు పడిపోతోంది? పెట్టుబడిలో 80% ఇస్తుంటే(ఎకరాకు ఎంత పెట్టుబడి అవుతుందో సీఎంకి తెలిస్తే కదా?)... ఏ రైతును కదిలించినా రూ.లక్షల్లో అప్పులయ్యాయని ఎందుకు కన్నీరు పెడుతున్నారు... నిస్సహాయ స్థితిలో ఉరికొయ్యకు ఎందుకు వేలాడుతున్నారు. ప్రాణంకంటే మిన్నగా ప్రేమించే వృత్తినే ఎందుకు వదిలేస్తున్నారు..? కరవుతో అల్లాడుతున్న రైతులు, ప్రజల కష్టాలను పరిశీలించడానికి మనసు రాని ఈ పాలకుడికి, తుపానుతో నష్టపోయిన పంటలను చూడడానికి కార్పెట్‌ వేయించుకున్న ఈ ముఖ్యమంత్రికి అసలు వ్యవసాయమంటే ఏంటో తెలిస్తేగదా..!


ఒకే ఊరు నుంచి 15 రైతు కుటుంబాల వలస

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం పంచాయతీ పరిధిలోని గ్రాంటు నుంచి ఏకంగా 15 రైతు కుటుంబాలు హైదరాబాద్‌కు వలస వెళ్లాయి. ఇళ్లకు తాళాలు వేసి కొందరు, తల్లిదండ్రులను ఇంటి వద్దనే ఉంచేసి మరికొందరు... పొట్టచేత పట్టుకుని, పుట్టిన గడ్డను, సొంతూరిని వదిలేసి వెళ్లిపోయారు. అప్పులను తీర్చడానికే అక్కడ కూలి పనులు చేస్తుండటం గమనార్హం.


ఆత్మహత్యల్లో మూడో స్థానం... ఇదేనా వైకాపా ఘనత?

వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారిలో అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటకల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ)-2022 నివేదిక ఈ కఠోర వాస్తవాన్ని వెల్లడించింది. ఏపీలో 2022 సంవత్సరంలో 917 మంది రైతులు, రైతు కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిలో 309 మంది సొంత భూములున్న పట్టాదారులు, 60 మంది కౌలుదారులు. మిగిలిన వారంతా రైతు కూలీలు. అంటే జగన్‌ పాలనలో రోజుకో రైతు ఆత్మహత్య చేసుకున్నారు.

  • 2019లో 628 మంది, 2020లో 564, 2021లో 481 మంది అన్నదాతలు ఆంధ్రప్రదేశ్‌లో అర్ధంతరంగా తనువు చాలించారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాజ్యసభలో వెల్లడించారు.
  • వివిధ నివేదికలు, మానవ హక్కుల వేదిక, రైతుస్వరాజ్య వేదికల గణాంకాల ప్రకారం... 2019 జూన్‌ నుంచి 2021 చివరివరకు 2,112 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగ్గా... 2022 ఏప్రిల్‌ నాటికి 718 మందికే జీవో 43 ప్రకారం ఆర్థిక సాయం అందింది. ప్రభుత్వం మాత్రం 2023 జులై వరకు 1,197 మందికి పరిహారం ఇచ్చినట్లు ప్రకటించింది.

జగన్‌ పాలనలో సాగు డీలా..

పంటల పెట్టుబడి వ్యయం ఐదేళ్లలో భారీగా పెరిగింది. 2018-19లో ఎకరం వరికి రూ.25 వేల పెట్టుబడి అయ్యేది. ఇప్పుడది రూ.40 వేలకు చేరింది. మిరప రూ.లక్షన్నర నుంచి రూ.2.75 లక్షలకు  పెరిగింది.

  • దిగుబడి ఏమాత్రం పెరగడం లేదు. పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కడం లేదు. ఒకవేళ ధర తగ్గితే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు.
  • ఉచిత పంటల బీమా పథకం బ్రహ్మ రహస్యమే. రాష్ట్రంలో 2023 ఖరీఫ్‌లో 1.38 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైతే... 64 లక్షల ఎకరాలకే బీమా చేశారు. మిరప రైతుల్లో అత్యధికులకు బీమానే దక్కడం లేదు. మామిడికైతే పథకాన్నే ఎత్తేశారు.
  •  సూక్ష్మ సేద్య పథకాన్ని తొలి మూడేళ్లు అటకెక్కించి చివరి రెండేళ్లు నామమాత్రంగా అమలు చేశారు. ఫలితంగా రాయలసీమలాంటి మెట్ట ప్రాంత రైతులు అప్పులపాలయ్యారు.
  •  రైతుల కోసం ఉచితంగా 2లక్షల బోర్లను వేయిస్తామని జగన్‌ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా ఇప్పటివరకు 25 వేలకు మించలేదు. మరోవైపు లక్షల మంది రైతులు పదేపదే బోర్లు వేయిస్తూ రూ.లక్షల అప్పుల్లో మునుగుతున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షేక్షానుపల్లికి చెందిన వడ్డే నాగరాజు రూ.5లక్షలు పెట్టి తన పొలంలో 15సార్లు బోర్లు వేయగా చివరిసారి నీళ్లు పడ్డాయి.
  •  ప్రకృతి విపత్తులు పంటల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. 2023 డిసెంబరులో మిగ్‌జాం తుపాను రైతుల ఆశలను చిదిమేసింది. ఎకరాకు రూ.12 వేల చొప్పున సాయం ఇవ్వాలని రైతులు మొరపెట్టుకున్నా... సగటున రూ.6వేలు నిర్ణయించారు. వాటికి జగన్‌ బటన్‌ నొక్కినా సాయం ఇంకా అందలేదు.

ఆకలికేం తెలుసు... ఆ ఇంటి పెద్ద చనిపోయారని..!

ఇల్లు గడవడమే కష్టంగా ఉంది! 

ల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మందాడికి చెందిన మాలంరెడ్డి శ్రీనివాసరెడ్డి(53) తనకున్న మూడెకరాలకు తోడు పదెకరాలను కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి సాగు చేసేవారు. ఏళ్లుగా దిగుబడి సరిగా రాక అప్పులే మిగిలాయి. 2022 డిసెంబరులో విరుచుకుపడిన తుపాన్‌తో సమస్యలు పెరిగాయి. మొత్తం అప్పు రూ.20 లక్షలకు చేరింది. పొలం అమ్మినా రుణం తీరదనే బాధతో ఈ ఏడాది ఫిబ్రవరి 28న పురుగుల మందు తాగారు. అధికారులు రైతు ఆత్మహత్యగా కేసు రాసుకున్నా భార్య వెంకట్రావమ్మకు పరిహారం అందలేదు. ఆకలిదప్పులను తీర్చుకోవడమే ఆ కుటుంబానికి కష్టంగా మారింది. బీటెక్‌ చదివిన కుమారుడు హైదరాబాద్‌లో ఉద్యోగ వేటలో ఉన్నారు.


తల్లి కూలీకి... కుమారుడు ముఠా పనికి!

ల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడుకు చెందిన గంగారపు హనుమంతురావు(49) కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. సొంతంగా 1.75 ఎకరాల పొలముంది. పదెకరాలను కౌలుకు తీసుకొని ఎక్కువగా మిర్చిని వేసేవారు. ఏటా అప్పులే దిగుబడులుగా వచ్చాయి. ప్రైవేటుగా రూ.5.50 లక్షలు, బ్యాంకులో రూ.3.12 లక్షల రుణముంది. ఏంచేయాలో పాలుపోని స్థితిలో తన ఇంట్లోనే 2020 నవంబరు 18న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత కుటుంబానికి ఇప్పటికీ పరిహారం దక్కలేదు. ఆకలి తీర్చుకోవడానికి హనుమంతురావు భార్య వ్యవసాయ పనులకు, కుమారుడు ముఠా పనికి వెళ్తున్నారు.


పేపర్‌ ప్లేట్ల పరిశ్రమలో కార్మికురాలిగా...

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం ఆర్‌.కురవపల్లికి చెందిన సురేంద్రకు 2.67 ఎకరాల పొలముంది. సాగునీటి కోసం బోర్లు వేసినా నీళ్లు పడలేదు. అప్పటికే రూ.11 లక్షల అప్పు చేశారు. దాన్ని తీర్చే మార్గం కనిపించక 2020 జనవరి 28న ఇంట్లోనే ఉరేసుకున్నారు. అధికారులు రైతు ఆత్మహత్యగా నివేదిక ఇచ్చినా సురేంద్ర భార్య చంద్రకళకు సాయం అందలేదు. ఇప్పుడామె కల్లూరులో పేపర్‌ ప్లేట్ల పరిశ్రమలో రోజుకూలీకి వెళుతున్నారు. ఇద్దరు పిల్లలకు వివాహమవగా చిన్న కూతురు ఇంటర్‌ చదువుతోంది.


భర్త ఉన్నప్పుడు యజమానురాలు.. నేడు కూలీ

ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నమశ్శివాయపురం గ్రామ రైతు అవులూరి ఏడుకొండలరెడ్డికి ఎనిమిదెకరాల భూమి ఉంది. నాలుగెకరాల్లో దానిమ్మ, జామ తోటలు వేసి భారీగా నష్టపోయారు. మొత్తంగా రూ.15 లక్షలు అప్పులయ్యాయి. భూమంతా అమ్మేసినా అవి తీరలేదు. 2021 సెప్టెంబరు 15న పురుగుల మందు తాగి మరణించారు. భార్య వెంకటలక్ష్మిని, కూతుళ్లు దేవిక(8వ తరగతి), నీలిమ(5వ తరగతి)లను వీధినపడేశారు. బిడ్డల ఆకలి తీర్చేందుకు ఆ అభాగ్యురాలు తమ పొలంలోనే కూలీగా పనిచేస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ పరిహారం అందలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని