సుజనాచౌదరి రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతి

భాజపా నేత సుజనాచౌదరిపై రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ-హైదరాబాద్‌) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 19 Apr 2024 05:17 IST

జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా నేత సుజనాచౌదరిపై రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ-హైదరాబాద్‌) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రుణ పరిష్కార ప్రక్రియ నిపుణుడిని నియమిస్తూ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యేదాకా సుజనాచౌదరికి చెందిన ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం విధించింది. స్ల్పెండిడ్‌ మెటల్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌కు మంజూరు చేసిన సుమారు రూ.562 కోట్ల రుణాలను చెల్లించకపోవడంతో ఆ కంపెనీ దివాలా ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. అయితే ఈ రుణాలకు హామీగా ఉన్న సుజనాచౌదరిని బాధ్యులను చేస్తూ పరిష్కార ప్రక్రియ చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ ఎస్‌బీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ జ్యుడిషియల్‌ సభ్యులు రాజీవ్‌ భరద్వాజ్‌, సాంకేతిక సభ్యులు సంజయ్‌పూరిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సుజనాచౌదరి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కంపెనీ రుణాలకు వ్యక్తిగతంగా బాధ్యులను చేయడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం..సుజనాచౌదరిపై రుణ పరిష్కార ప్రక్రియ చేపట్టేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని