మంచి పుస్తకం మనో వికాసం

తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్‌ యుగంలోనూ  ఆ సంస్థది చెరగని సంతకం.

Updated : 19 Apr 2024 06:27 IST

బాల సాహిత్యంలో ప్రత్యేక ఒరవడి
పిల్లల్లో పఠనాసక్తి పెంచడమే లక్ష్యం
రెండు దశాబ్దాలుగా అక్షరసేద్యం

తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్‌ యుగంలోనూ  ఆ సంస్థది చెరగని సంతకం. పిల్లల మనోవికాసానికి 20 ఏళ్లుగా కృషి చేస్తోందీ సంస్థ. బాల్యం నుంచీ పఠనాసక్తి పెంపొందించేలా కథలు, విజ్ఞాన ప్రచురణలు తేట తెలుగులో ముద్రిస్తోంది. సొంత ప్రచురణలకు తోడు.. ఇతర సంస్థలు ముద్రణను ఆపేసిన పుస్తకాలను కూడా కొనుగోలు చేసి మరీ పంపిణీ చేస్తోంది. దేశ, విదేశీ భాషల్లోని మంచి బాల సాహిత్యాన్ని అనువాదం చేసి ఈ తరం పిల్లలకు అందిస్తోంది. ఈ నెలాఖరుతో ఆ సంస్థ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోనుంది. తార్నాకలోని సెయింట్‌ యాన్స్‌ జెనరలేట్‌లో ఈ నెల 27వ తేదీన రెండు దశాబ్దాల వేడుక నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ట్రస్టీల్లో ఒకరైన కొసరాజు సురేశ్‌తో ‘ఈనాడు’ ముచ్చటించగా.. సంస్థ ప్రస్థానాన్ని వివరించారు.

అలా శ్రీకారం..

తెలుగులో పిల్లల పుస్తకాలు పెద్దగా రాని రోజుల్లో స్నేహితుల తోడ్పాటుతో కొసరాజు సురేశ్‌ 2002లో ‘పుస్తకాలతో స్నేహం’ పేరిట హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనలో స్టాల్‌ ఏర్పాటు చేశారు. ప్రచురణ సంస్థలు, రచయితల నుంచి అందుబాటులో ఉన్న బాల సాహిత్యాన్ని సేకరించి ప్రదర్శించారు. అక్కడ లభించిన ప్రోత్సాహంతో ‘మంచి పుస్తకం’ ప్రచురణ ప్రస్థానం మొదలైంది. అంతకంటే ముందు బాలసాహితి పేరుతో కొన్ని పుస్తకాలు ప్రచురించిన అనుభవం వీరికుంది. ఇప్పటివరకు 500కు పైగా పుస్తకాలను ప్రచురిస్తే అందులో పిల్లల కోసం ఉద్దేశించినవే 383 ఉన్నాయి.


కార్డు మీద కథ

చిన్నారులకు పఠనం విసుగు అనిపించకుండా.. చదవడం అలవాటు చేసే క్రమంలో కథా కదంబం పేరుతో సరికొత్త ప్రయోగం చేశారు. కేవలం నాలుగు పేజీలుండే కార్డుపై ఒక్కో పేజీలో ఒకటి రెండు వాక్యాలతో బొమ్మల కథ ఉండేలా 50 కార్డు కథలను ప్రచురించారు. 5 నుంచి 8 ఏళ్ల చిన్నారులను ఈ ప్రయోగం బాగా ఆకట్టుకుంది. కార్డు కథల నుంచి క్రమంగా పుస్తకంలోని కథల్లోకి తీసుకు వచ్చారు. ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో వేర్వేరు వయసు పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని 16 నుంచి 64 పేజీల వరకు ఉండే రచనలను ప్రచురించారు. ఇలా ఇప్పటివరకు 85 పుస్తకాలు ముద్రించారు. కథలు, బొమ్మల పుస్తకాలతో పాటు విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలకు తెలుగు అనువాదాలు తెచ్చారు. జన విజ్ఞాన వేదికతో కలిసి ఉమ్మడిగా ప్రచురిస్తుండడంతో తమపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు.. రచనలు ఎక్కువ మందికి చేరువయ్యాయని ట్రస్ట్‌ కో ఆర్డినేటర్‌ భాగ్యలక్ష్మి తెలిపారు.


అనువాదాలతో ఆరంభించి..

తొలినాళ్లలో పరిమిత ఆర్థిక వనరుల కారణంగా.. అనువాద రచనలను ఎక్కువగా ప్రచురించేవారు. రష్యన్‌, ఆఫ్రికన్‌ తదితర భాషల అనువాదాలు అందుబాటులోకి తెచ్చారు. క్రమేణా తెలుగు మూల రచనలను ప్రోత్సహించారు. 2017 నుంచి తానా సంస్థతో కలిసి తెలుగు కథల రచనలను ఆహ్వానిస్తున్నారు. పదేళ్లలోపు పిల్లల కోసం బొమ్మల కథలు, ఆ పై వయసు వారికి సాహస, సైన్స్‌, కాల్పనిక, హాస్య నవలలను ఎంపిక చేసి ప్రచురించడం మొదలెట్టారు. 21 నవలలు, 28 బొమ్మల కథలు ప్రచురించారు. తెలంగాణ తియ్యని పలకరింపు పేరుతో బడి పిల్లల కథలను ప్రచురిస్తున్నారు. పిల్లలు రాసిన 306 కథల్లో 51 రచనలను ఎంపిక చేసి పుస్తక రూపంలో తీసుకొచ్చారు.

ఎక్కువగా అడిగే పుస్తకాలు

చిన్న పిల్లల కోసం బొమ్మల కథలు, పెద్ద పిల్లల కోసం నీతికథలు, జీవితగాథలు, స్ఫూర్తిదాయక, జీవన నైపుణ్యాలకు సంబంధించిన పుస్తకాలు, నిఘంటువులు ఎక్కువగా అడుగుతుంటారని సురేశ్‌ చెప్పారు. ప్రైవేటు బడుల్లోని పిల్లలు ఆంగ్ల మాధ్యమం కారణంగా తెలుగులో ధారాళంగా చదవలేకపోతున్నారని.. ప్రభుత్వ బడుల్లోని పిల్లలు వనరులు సరిగా లేక తెలుగు నేర్చుకోవడంలో తడబడుతున్నారని అన్నారు. పిల్లలకు తెలుగు నేర్పాలనే తపన ప్రైవేటు బడుల్లో చదివిస్తున్న తల్లిదండ్రుల్లో కనిపిస్తోందని, వారు పుస్తకాలు కొంటున్నారని తెలిపారు. పిల్లల పుస్తకాల కోసమైనా, గ్రంథాలయాలు, పాఠశాలలకు వాటిని ప్రదానం చేయాలనుకున్నా.. తార్నాకలోని ‘మంచి పుస్తకం’ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్‌ చేయవచ్చు. కార్యాలయ వేళల్లో కో ఆర్డినేటర్‌ భాగ్యలక్ష్మిని 94907 46614 ఫోన్‌ నంబరులో సంప్రదించవచ్చు.


బాలసాహితి నుంచి మొదలై..: కొసరాజు సురేశ్‌, ట్రస్టీ, మంచి పుస్తకం

‘మంచి పుస్తకం’ కంటే ముందు 1990లో బాల్‌రెడ్డి, సుబ్బయ్య, రాజేంద్రప్రసాద్‌, నేనూ కలిసి బాల సాహితి అనే సంస్థను ప్రారంభించాం. ఎవరికి వారు ఉద్యోగాలు చేసుకుంటూ.. దాదాపు పదేళ్ల పాటు 35 పుస్తకాలను ప్రచురించాం. ‘ఈనాడు’ రైతేరాజులో నేను ఉప సంపాదకుడిగా అనువాదాలు చేసిన అనుభవం బాల సాహితికి ఉపయోగపడింది. తర్వాత వాసన్‌ స్వచ్ఛంద సంస్థలో చేరాను. నా అభిరుచిని గమనించి అక్కడ ఒక అల్మారాలో పుస్తకాలు పెట్టుకునేందుకు స్థలం కేటాయించారు. ఇక్కడే మిత్రుల సహకారంతో మంచి పుస్తకానికి బీజం పడింది. రవీంద్ర, ఎస్‌.ఎస్‌.లక్ష్మి, నేను ట్రస్టీలుగా 2004 ఏప్రిల్‌ 29వ తేదీన ‘మంచి పుస్తకం’ ప్రయాణం ప్రారంభమైంది. అంతకుముందు పుస్తకాలు అమ్మగా వచ్చిన డబ్బును మూలధనంగా పెట్టాం. పాఠకులు, స్వచ్ఛంద సంస్థల ఆదరణ ఫలితంగా ‘మంచి పుస్తకం’ ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో 20 ఏళ్లుగా సాఫీగా నిర్వహిస్తున్నాం. ఎంవీ ఫౌండేషన్‌, రెడ్డీస్‌ ఫౌండేషన్‌ సహా పలు స్వచ్ఛంద సంస్థలు పుస్తకాలను కొని పాఠశాలలు, గ్రంథాలయాలకు అందిస్తున్నాయి. తార్నాకలో కార్యాలయం అద్దెకు తీసుకున్నాం. నాతో పాటు కో ఆర్డినేటర్‌ భాగ్యలక్ష్మి పూర్తికాలం పనిచేస్తున్నారు. బాలల్లో పఠనంపై ఆసక్తి, పుస్తకాలపై ప్రేమ కల్పించాలనేది మా ప్రయత్నం.


ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని