పోస్టల్‌ బ్యాలెట్‌ సమర్పణలో గందరగోళం

ప్రభుత్వ ఉద్యోగులు జగన్‌ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నందున వారు పోస్టల్‌ బ్యాలెట్లు ఉపయోగించుకోకుండా దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated : 19 Apr 2024 05:27 IST

ఓటు ఉన్న నియోజకవర్గ ఆర్‌వోకు ఇవ్వాలని ఆదేశాలిచ్చినా.. తిరస్కరిస్తున్న వైనం
ఫాం-12 ఎవరికి ఇవ్వాలో తెలియక ఉద్యోగుల్లో అయోమయం
ఈ నెల 22తో ముగియనున్న గడువు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు జగన్‌ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నందున వారు పోస్టల్‌ బ్యాలెట్లు ఉపయోగించుకోకుండా దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల (ఓట్ల) కోసం సమర్పించే దరఖాస్తుల విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారు. ఉద్యోగులను కార్యాలయాల చుట్టూ తిప్పితే వారే పోస్టల్‌ బ్యాలెట్‌ వేయడం మానుకుంటారనే ఉద్దేశమో.. ఏమో ఉపాధ్యాయుల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తులు తీసుకోవడం లేదు. ఈనెల 22 లోపు వాటిని సమర్పించాల్సి ఉండగా.. దాదాపు 80శాతం ఉద్యోగులు ఇంతవరకు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ విధులకు 3.30 లక్షల మంది ఉద్యోగులను వినియోగించనున్నారు. వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు సృష్టిస్తున్న సమస్యలతో ఉద్యోగులు విసిగిపోతున్నారు. కొందరు ఉన్నతస్థాయి అధికారుల నుంచి వచ్చిన డైరెక్షన్‌లోనే ఇది జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్‌కు ముందు రిటర్నింగ్‌ అధికారులను జగన్‌ ప్రభుత్వం భారీగా మార్చింది. చాలా చోట్ల వైకాపాకు అనుకూలంగా ఉండే వారిని నియమించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ అధికారులు చేస్తున్న పనులు ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. రాష్ట్రంలో ఒక పక్క నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఇంతవరకు ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్లకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు క్షేత్రస్థాయికి చేరలేదు. ఎన్నికల కమిషన్‌ సైతం వీటిపై దృష్టి సారించకపోవడంతో క్షేత్రస్థాయిలో కొందరు అధికారులకు ఆడింది ఆట.. పాడింది పాటగా పరిస్థితి తయారైంది.

ఎక్కడ ఇవ్వాలి?

రాష్ట్రంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర ఉద్యోగులకు పోలింగ్‌ అధికారులు (పీవో), సహాయ పోలింగ్‌ అధికారులు (ఏపీవో), ఇతర పోలింగ్‌ అధికారులు(ఓపీవో)గా డ్యూటీలు వేశారు. పీవో, ఏపీవోలకు శిక్షణ సమయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఇచ్చి, వివరాలు నింపిన తరవాత వాటిని వెనక్కి తీసుకున్నారు. అయితే పోలింగ్‌ కేంద్రాల్లో ఓపీవోలుగా ఎక్కువ మందిని నియమిస్తారు. వీరిలో చాలా మంది ఒక చోట పని చేస్తుంటే.. వారికి మరో చోట ఓటు హక్కు ఉంది. ఇలాంటి వారిని ఓటు హక్కు ఉన్న నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి వద్దకు వెళ్లి పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫాం-12ను సమర్పించాలంటూ విధులు కేటాయించిన అధికారులు సూచించారు. ఈ మేరకు వారికి ఫాం-12 సైతం ఇచ్చారు. వీటిని తీసుకొని సంబంధిత ఆర్‌వో వద్దకు వెళ్తే వారు తీసుకోవడం లేదు. ఫాం-12 ఎక్కడ ఇచ్చారో అక్కడే ఇవ్వాలని తిప్పి పంపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే ఉపాధ్యాయులు నియోజకవర్గ కేంద్రంలోని ఆర్‌వో వద్దకు వెళ్లివచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. పని చేసే మండలం లేదా ఓటు హక్కు ఉన్న మండలంలో ఫాం-12ను సమర్పించే అవకాశం కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నా దీన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫాం-12 ఎవరికి ఇవ్వాలన్నదానిపై ఇంతవరకు చాలాచోట్ల స్పష్టత లేదు. ఫాం-12ను ఈ నెల 22లోపు సమర్పించాల్సి ఉంది. ఈలోపు ఇవ్వకపోతే ఓటు వినియోగించుకునే పరిస్థితి ఉండదు. కొందరు ఆర్‌వోలు కావాలనే వీటిని తీసుకోకుండా వెనక్కి పంపిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని