20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్‌ వేటు

రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్‌ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది.

Updated : 19 Apr 2024 09:26 IST

అయిదేళ్లలో అడ్డగోలుగా జాబ్‌ కార్డుల తొలగింపు 
జాతీయ స్థాయిలో తొలగించినవి 11%.. ఏపీలో అసాధారణంగా 24.6%
సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా పేదలపై వైకాపా సర్కార్‌ వేటు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్‌ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. జాతీయ స్థాయిలో 2019-20 నుంచి 2023-24 మధ్య జాబ్‌కార్డులు తొలగించిన కుటుంబాలు 11.1% ఉంటే.. ఏపీలో అసాధారణంగా 24.6% ఉండటం పేదలపట్ల వైకాపా సర్కారు ఆపేక్షకు నిదర్శనం! నరేగా అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఆధారిత చెల్లింపుల స్థానంలో ఆధార్‌ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆధార్‌కార్డు, జాబ్‌కార్డులను అనుసంధానించే పద్ధతిని తీసుకొచ్చింది. ఆధార్‌, జాబ్‌కార్డుల్లో కూలీల పేర్లలో స్వల్ప తేడాలున్నా అనుసంధానం కావడం లేదు. ఇది పూర్తయినా జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) అనుసంధానపరంగానూ సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటిని అధిగమించాలంటే ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి. కానీ సాంకేతిక సమస్యల పరిష్కారంలో జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కూలీలకు శాపమైంది. ఫలితంగా రాష్ట్రంలో 2022-23 నుంచి 2023-24 మధ్య ఏడాది వ్యవధిలోనే 53 వేల కుటుంబాలు జాబ్‌కార్డులు కోల్పోయాయి. నరేగా అమలును ఏటా విశ్లేషించే ‘లిబ్‌టెక్‌ ఇండియా’ సంస్థ గురువారం విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. 

బతికున్న కూలీని చంపేశారు:   కూలీలు బతికున్నా చనిపోయినట్లుగా చూపించి ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డులు తొలగించడం జగన్‌ ప్రభుత్వ అరాచకానికి పరాకాష్ఠ. 2022-23లో పెద్దఎత్తున జాబ్‌ కార్డుల తొలగింపుపై మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్‌) ప్రతినిధులు పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల పరిశీలించినప్పుడు విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లోని చింతలపాడు, వాలేసు, దుర్బిలి ఆదివాసీ గ్రామాల్లో వివిధ కారణాలతో 30 మంది జాబ్‌కార్డులు తొలగించారు. సాంకేతిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా.. 2022-23లో పెద్ద సంఖ్యలో కూలీలను ఇతర కారణాలతో ఉపాధికి దూరం చేసిందని మానవ హక్కుల వేదిక విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అనురాధ అన్నారు.

2022-23లో కూలీలకు కనీస వేతన నష్టం రూ.1,055 కోట్లు: ఉపాధి కూలీలకు కేంద్రం ప్రకటించిన కనీస వేతనమూ రావడం లేదు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వపరంగా చేస్తున్న కృషి అంతంత మాత్రమే. తెదేపా ప్రభుత్వ హయాంలో కూలీలకు కేంద్రం ప్రకటించిన కనీస వేతనం అందేది. గత అయిదేళ్లలో కూలీలకు కనీస వేతనం వచ్చిన దాఖలాల్లేవు. 2022-23, 2023-24లో లోటు మరీ ఎక్కువగా ఉంది. 2022-23లో కేంద్రం ప్రకటించిన కనీస వేతనం ప్రకారం ఒక కూలీకి ఏడాదిలో రూ.13,433 వేతనంరావాల్సి ఉంటే రూ.11,053 అందింది. రూ.2,380 నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ ఏడాది పనులకు హాజరైన మొత్తం కూలీలు రూ.1,055.18 కోట్లు కోల్పోయారని లిబ్‌టెక్‌ ఇండియా సంస్థ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని