అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?

‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్‌.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు.

Published : 19 Apr 2024 04:39 IST

డ్వాక్రా మహిళా సంఘాలకు జగన్‌ పచ్చిమోసం
రుణ విప్లవం తెస్తామని కుదేలుచేశారు
రూ.5 లక్షల రాయితీ కుదింపు
సంఘాలపై రూ.70 వేల కోట్లకు పైగా అప్పులు
ఈనాడు, అమరావతి

నరం లేని నాలుకలా వరాలు గుప్పించడం అవసరాలు తీరాక ఏమీ ఎరుగనట్లు నటించడం జగన్‌కు మాత్రమే సాధ్యం! సున్నా వడ్డీ రుణాలిస్తాం అంటూ ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలను నమ్మించిన ఆయన అధికార పీఠం ఎక్కాక ఆ హామీని చుట్టచుట్టి అటకెక్కించారు. గత ప్రభుత్వ హయాంలో సున్నా వడ్డీకి ఉన్న పరిమితిని కుదించి డ్వాక్రా వనితల వెన్నువిరిచారు.

‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్‌.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. పథకాన్ని అమలు చేసినట్టు నటించి దాని వెనుక అలవిమాలిన కుయుక్తులు పన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో అమలైన సున్నావడ్డీ రాయితీ పరిమితిని మరింత పెంచాల్సింది పోయి  కుదించారు. డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రూ.5 లక్షల వరకు రుణాలకు అప్పట్లో సున్నావడ్డీ రాయితీ వర్తించేది. ఏదేని ఒక వర్గం తెదేపా ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిందంటే జగన్‌ కళ్లల్లో నిప్పులు కురుస్తాయి కదా..! డ్వాక్రా సంఘాల విషయంలోనూ ఇదే జరిగింది. ఆ సంఘాల సభ్యులకు మేలు చేయడం ఇష్టంలేని ఆయన సున్నా వడ్డీ రాయితీకి రుణ పరిమితిని రూ.3 లక్షలకు తగ్గించారు. తద్వారా మహిళల నెత్తిన భారీగా వడ్డీల భారం మోపారు. ఇలా డ్వాక్రా సంఘాల్ని కుదేలు చేయడమే జగన్‌ దృష్టిలో విప్లవమేమో..! పైగా ఈ పథకం గతంలోనే రద్దయినట్టు, తాను అధికారం చేపట్టిన తర్వాత దీనికి మళ్లీ పురుడుపోసినట్టు నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లెవేశారు.


రూ.2,100 కోట్ల బకాయిల ఎగవేత....

ఉమ్మడి రాష్ట్రంలో 2004-09 మధ్య అప్పటి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల సభ్యులు తీసుకునే రుణానికి ‘పావలా వడ్డీ’ పథకాన్ని అమలుచేసింది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయ్యాక దాన్ని ‘సున్నా వడ్డీ’కి మార్చారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణానికి రూ.5 లక్షల వరకు ‘సున్నా వడ్డీ’ని వర్తింపజేసింది. తెదేపా తన ఐదేళ్ల పాలనాకాలంలో డ్వాక్రా సంఘాల్లోని సభ్యులకు సున్నా వడ్డీ కింద రూ.2,836 కోట్ల వరకు రాయితీని అందించింది. కానీ, అప్పటికే అమలులో ఉన్న ‘సున్నా వడ్డీ’ రుణ సదుపాయాన్ని తానే కొత్తగా తీసుకొస్తున్నట్టుగా జగన్‌ తన మ్యానిఫెస్టోలో ప్రకటించడం గమనార్హం. వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చేనాటికి అప్పటి తెదేపా ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రాయితీకి సంబంధించి రూ.2,100 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. మ్యానిఫెస్టోలో తానే కొత్తగా పెట్టినట్లు పథకాన్ని ప్రకటించిన జగన్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిల చెల్లింపునకు తోకముడవడం శోచనీయం. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా.. రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం గత ప్రభుత్వాలు వెచ్చించిన మొత్తాలకు సంబంధించిన బకాయిలను చెల్లించడం పరిపాటి. కానీ, వైకాపా సర్కారు గత తెదేపా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న దుర్బుద్ధితో రూ.2,100 కోట్ల సున్నా వడ్డీ రాయితీ బకాయిలను చెల్లించకుండా మొండికేసింది. బకాయిల చెల్లింపునకు మనసు రాని జగన్‌.. 30 ఏళ్ల నుంచి వివిధ ప్రభుత్వాలు బడుగు, బలహీనవర్గాల ఇళ్ల కోసం ఇచ్చిన రుణాన్ని మాత్రం ఓటీఎస్‌ పేరుతో ముక్కుపిండి వసూలు చేశారు.


వడ్డీ అధికమవుతున్నా...

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి దాదాపుగా 9 లక్షల డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నాయి. వాటిలో కోటి మందికిపైగా సభ్యులు ఉన్నారు. వీరికి జీవనోపాధి కల్పించడానికి బ్యాంకు లింకేజీ రుణాలే కీలకం. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఒక్కో డ్వాక్రా సంఘానికి బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితి రూ.10 లక్షల వరకు ఉండేది. జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం అప్పట్లో అంతవరకే అనుమతి ఇచ్చింది. 2021లో దేశవ్యాప్తంగా ఈ నిబంధనల్ని సడలించింది. ఎలాంటి తనఖా లేకుండా డ్వాక్రా సంఘాలకు ఇచ్చే రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచింది. రుణ పరిమితి పెరిగినప్పుడు సభ్యులపై వడ్డీ భారం అధికంగా ఉండటం సహజం. తెదేపా ప్రభుత్వం అమలు చేసిన సున్నా వడ్డీ రాయితీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకో, అంతకంటే ఎక్కువకో పెంచాలి. జగన్‌.. అలా చేయలేదు. వడ్డీల భారం తడిసిమోపెడై డ్వాక్రా మహిళలు విలవిల్లాడిపోయినా చూస్తూ రాక్షసత్వాన్ని ప్రదర్శించారేగానీ వడ్డీ రాయితీ పరిమితిని పెంచి, బకాయిలు చెల్లించి వారికి ఊరట కలిగించలేదు. ఇదీ.. సున్నా వడ్డీ పథకానికి జగన్‌ ‘సున్నా’ చుట్టిన తీరు!


ఆరు జిల్లాలకు 7% కేంద్రం రాయితీ

జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం గతం నుంచే దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలుచేస్తోంది. దీని పరిధిలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. సంఘాలు రూ.3 లక్షలకు వరకు తీసుకున్న రుణానికి కేంద్రమే 7% వడ్డీని బ్యాంకులకే నేరుగా జమ చేస్తుంది. ఆయా జిల్లాల పరిధిలో రూ.3 లక్షలు తీసుకున్న ఒక్కో సంఘానికి బ్యాంకులు సరాసరి 11 శాతం వడ్డీని విధిస్తాయనుకుంటే.. అందులో కేంద్రమే 7% చెల్లిస్తుంది. మిగిలిన 4 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. మిగిలిన జిల్లాల్లో మాత్రం సంఘాల సభ్యులు రూ.20 లక్షల రుణ పరిమితి మించకుండా ఎంత రుణం తీసుకున్నా.. రూ.3 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీ భారాన్ని భరిస్తుంది. కేంద్రం అమలు చేస్తున్న రూ.3 లక్షల పరిమితినే వైకాపా ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకుని గతంలో అమలు అయిన రూ.5 లక్షల రాయితీ రుణ పరిమితిని తగ్గించింది. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ఏటా విడుదల చేస్తున్న సున్నా వడ్డీ రాయితీలోనూ ఈ ఆరు జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంత సంఘాలకు సంబంధించి కేంద్రం వాటా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సాయాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.


మహిళలపై రూ.70 వేల కోట్ల అప్పు

తెదేపా ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలపై రూ.27 వేల కోట్లు అప్పులు ఉన్నాయని, ఆ సంఘాలను కుదేలు చేశారని ఎన్నికలకు ముందు జగన్‌ ఊరూరా ప్రచారం చేశారు. జగన్‌ ప్రభుత్వంలో ఇప్పుడు(గత జనవరి వరకు) వారిపై అప్పు అక్షరాల రూ.70 వేల కోట్లకు చేరింది. ఆ తర్వాత కూడా డ్వాక్రా మహిళలు భారీగా రుణాలు తీసుకున్నారు. ఇదీ కాకుండా తెదేపా హయాంలో డ్వాక్రా రుణాలకు వర్తింపజేసిన సున్నా వడ్డీ రాయితీ పరిమితిని వైకాపా సర్కారు రూ.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు కుదించింది. జగన్‌ చేసిన ఈ నిర్వాకంతో డ్వాక్రా సంఘాల సభ్యులపై వడ్డీల భారం మరింత పెరిగింది. ఇలా ఉద్దేశపూర్వకంగా డ్వాక్రా సంఘాలను కుదేలు చేసిన జగన్‌.. ఇప్పుడు తాజాగా తన హయాంలో డ్వాక్రా సంఘాలు అద్భుతంగా ఉన్నాయంటూ కొత్తపల్లవి ఎత్తుకోవడం విడ్డూరం. తెదేపా ప్రభుత్వంతో పోలిస్తే జగన్‌ హయాంలో డ్వాక్రా సంఘాలపై అప్పు దాదాపు మూడు రెట్లు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని