కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్‌?

ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్‌ మాటలు చూస్తే అర్థం అవుతుంది.

Published : 19 Apr 2024 05:00 IST

ఏలేరు పనులు ఎప్పటికి పూర్తయ్యేనో?
ఉప్పాడ రేవు.. అలాగే వదిలేశారెందుకు?
ఆగిన ఐటీ పరుగులు
కాకినాడలో సీఎం జగన్‌ బస్సు యాత్ర నేడు

ఈనాడు, కాకినాడ: ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్‌ మాటలు చూస్తే అర్థం అవుతుంది. కాకినాడ జిల్లా ప్రజలకు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోతే ఉపయోగమేంటి? వాళ్లు మాత్రం ఎంత కాలమని ఎదురు చూస్తారు? ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని నిలదీస్తే చెప్పుకునేందుకు మీ దగ్గర సమాధానం ఉందా ముఖ్యమంత్రిగారూ..? రైతులకు మేలు చేసే ప్రభుత్వం మాది అని మీరు చెప్పుకుంటూనే.. పొలాలు తడిపే ప్రాజెక్టులనే ముందుకు కదలకుండా అడ్డుపడుతున్నారంటే రైతులపై మీకున్న ప్రేమ ఏపాటిదో ఊహించుకోవచ్చు. మత్స్యకారులపై మమకారం ఎలాంటిదో చేపల రేవు పనుల పురోగతిని చూస్తే అర్థం అవుతుంది. అవకాశం ఉన్న అన్ని విధాలుగా విధ్వంసం చేసి ఇప్పుడు కల్లబొల్లి మాటలతో మరోసారి మోసం చేయాలని చూస్తే ప్రజలు నమ్మేస్తారనే అనుకుంటున్నారా జగన్‌?

ఏలేరు ప్రాజెక్టు పనులు ఎప్పుడు?

‘కొంప కొల్లేరు చేస్తావా’ అన్న నానుడి గురించి జిల్లా ప్రజలకు అప్పట్లో అంతగా తెలిసి రాలేదు. సీఎం జగన్‌ దాన్ని మార్చేసి ‘కొంప ఏలేరు చేస్తావా’ అన్న కొత్త నానుడిని కాకినాడ జిల్లా ప్రజలకు పరిచయం చేశారు. ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. జలాశయం ఆధునికీకరణ మిగులు పనులకు రూ.142 కోట్లు, రెండో దశ పనులకు రూ.150 కోట్లు ఇస్తున్నట్లు 2022 జులై 29న పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో జరిగిన ‘కాపునేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో సీఎం జగన్‌ ప్రకటించారు. ప్రాజెక్టు తొలిదశకు సంబంధించి గత తెదేపా ప్రభుత్వ హయాంలో పూర్తైన 52 శాతం పనులు మినహా.. జగన్‌ ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఎలాంటి పురోగతీ లేదు. దీంతో గతంలో రూ.100 కోట్ల ఖర్చుతో చేసిన పనులు కూడా నిరుపయోగంగా మారాయి. మూడు దశాబ్దాల క్రితం రూ.15 కోట్ల అంచనాతో చేపట్టిన ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం రూ.350 కోట్లకు చేరింది. ప్రాజెక్టు కుడి కాలువ నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు 2022 నవంబరు 4న గోకవరం మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించినా నేటికీ పైసా కూడా ఎందుకు విదల్చలేదని రైతులు అడిగితే ఏం సమాధానం ఇస్తారు జగన్‌?

ఫిషింగ్‌ హార్బర్‌ కంటే ముఖ్యమైనది ఏది?

చేపల రేవు పూర్తయితే 2,500 పడవలు నిలిపే ఏర్పాటు.. 1.10 లక్షల మెట్రిక్‌ టన్నుల మత్స్య సంపద.. 50 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. ఇంత మందికి ప్రయోజనం కలిగించే ఉప్పాడలో రూ.422 కోట్లతో చేపట్టిన ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం కంటే ముఖ్యమైనది ఏముంటుంది? గత ఏడాది మార్చి నాటికే నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా అవసరమైన నిధులు ఇవ్వలేదు. నిర్మాణ సంస్థకు 36 ఎకరాలకు గాను 28 ఎకరాలను మాత్రమే అప్పగిస్తే పనులు ఎలా పూర్తవుతాయి? 2020 నవంబరులో వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టునూ నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయలేకపోవడం మీ వైఫల్యం కాదా జగన్‌? 

ఐటీ రంగానికి ప్రోత్సాహమేది!

గత ప్రభుత్వం ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ అభివృద్ధిని ప్రోత్సహించడంతో జిల్లాలో ఐటీకి అడుగులు పడ్డాయి. అయిదేళ్లలో ఒక్క కొత్త ఐటీ సంస్థ కూడా కాకినాడ ముఖం చూడలేదు. అప్పట్లో వచ్చిన  కంపెనీలు కూడా తరలిపోయే పరిస్థితి నెలకొంది. సర్పవరంలో ఐటీ కారిడార్‌ ఏర్పాటు అభివృద్ధి ప్రతిపాదన ఏమైంది జగన్‌? మౌలిక సదుపాయాలు సరిగా లేక  సైయంట్‌ కంపెనీని కూడా నేడో రేపో తరలించే ప్రతిపాదన ఉందని తెలుస్తోంది. అదొక్కటీ వెళ్లిపోతే ఇక ఐటీ జాడ లేకుండా పోతుంది.

ఊళ్లే కడతానంటే.. నిజమే అనుకున్నారు!

సీఎం గారూ మీకు గుర్తుందా? రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల పథకానికి అప్పట్లో కొత్తపల్లి మండలం కొమరగిరిలోనే శంకుస్థాపన చేశారు. ఇళ్లు కాదు.. ఊళ్లే కడతామని అప్పట్లో మీరు అంటే ప్రజలు అమాయకంగా నమ్మారు. అధికారంలో ఉండి అలా హామీలు ఇస్తుంటే నమ్మక తప్పలేదు. కాలనీలకు అనుసంధానంగా జనతా బజార్లు, క్లినిక్‌లు, పాఠశాల, పార్కులు.. ఇలా అన్నీ వచ్చేస్తాయంటే మరో ప్రపంచంలో విహరించారు. అయితే కాలనీల్లో చిన్న చినుకు పడితే చాలు ముంపు సమస్య వేధిస్తోంది. ఇవేనా మీరు కట్టే ఊళ్లు అని ప్రజలు నిలదీస్తే సమర్థించుకోగలరా?


ఈ హామీలకు.. మీరిచ్చే సమాధానమేంటి?

  •  కాండ్రకోట వద్ద డ్రాప్‌ కమ్‌ బెడ్‌ రెగ్యులేటర్‌ పునర్నిర్మాణానికి రూ.6 కోట్లతో పనులు చేపడతామన్న హామీ గుర్తుందా జగన్‌? నిధుల కోసం అధికారులు తిరిగితిరిగి వేసారి దస్త్రాన్ని పక్కన పడేశారు. నిధులు ఇవ్వలేకపోయానంటూ జిల్లా ప్రజల ముందు అంగీకరించే ధైర్యం మీకుందా?  
  • కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని కాండ్రకోట- తూర్పుపాకలకు వెళ్లే మార్గంలో శిథిలమైన హైలెవెల్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.4 కోట్లు ఇస్తే రైతులు పడుతున్న బాధలు తప్పేవి. వంతెన కడితే వ్యవసాయ పనులకు వెళ్లడానికి 8 కి.మీ.ల దూరం తగ్గుతుందని ఆశపడిన రైతులకు ఎదురుచూపులే మిగిలాయి?
  •  సామర్లకోటలో జూనియర్‌ కళాశాలను డిగ్రీ కళాశాలగా మార్చేందుకు రూ.18 కోట్లు మంజూరు చేసే విషయం ఏమైందనే ప్రశ్న విద్యార్థుల నుంచి వినిపిస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని