మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు

‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్‌, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు.

Published : 19 Apr 2024 06:20 IST

ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ: ‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్‌, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి గురువారం ప్రవేశించిన బస్సుయాత్ర ఒకట్రెండు సెంటర్ల మినహా ఆశించినస్థాయిలో స్పందన కనిపించలేదు. ఈ పరిస్థితి అధినేతను నిరుత్సాహపరిచింది. ఆయన మంత్రులు, ఇతర నేతలపై అసహనం వ్యక్తంచేసినట్లు తెలిసింది. దీంతో గురువారం సాయంత్రం యాత్ర గంట ఆలస్యంగా ప్రారంభించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర ముగించి తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో ప్రవేశించే సమయానికి స్వాగతం పలికేందుకు పట్టుమని పదిమందీ లేకపోవడం అధినేతతో పాటు శ్రేణులను నిరుత్సాహపరిచింది. రావులపాలెం, రాజమహేంద్రవరంలో ఓ మాదిరిగా ఉన్నా.. మిగిలినచోట్ల, ప్రధాన కూడళ్లలో స్వాగతం పలకడానికి జనం లేరు.

డబ్బులిచ్చి.. కూపన్లు పంచి..

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో వైకాపా నాయకులు డబ్బులిచ్చి తీసుకొచ్చినా పెద్దగా ఫలితం లేకపోయింది. మహిళలకు రూ.200 చొప్పున పంపిణీ చేశారు. వాహనాలతో వచ్చినవారికి పెట్రోలు కూపన్లు పంచిపెట్టారు. ఉదయం 10 గంటలకు జగన్‌ వస్తారని పలు మండలాలు, గ్రామాల నుంచి రావులపాలెం ఆటోల్లో జనాన్ని తెచ్చారు. కానీ బస్సుయాత్ర రావులపాలెం చేరుకునే సరికి మధ్యాహ్నం ఒంటిగంట దాటడంతో ఎండ తీవ్రతకు ప్రజలు అవస్థలు పడ్డారు. ఉదయం స్పందన లేకపోవడంతో సాయంత్రం పర్యటనకు వైకాపా నాయకులు జాగ్రత్తపడ్డారు. రాజమహేంద్రవరం నగరంలో ఒక్కొక్కరికి రూ.300 చొప్పున ఇచ్చి ప్రధాన కూడళ్లకు జనాన్ని తరలించారు.

అరటి రైతులకు నిరాశ

రావులపాలెం వరకు బస్సులో నుంచే జగన్‌ అభివాదం చేశారు. రావులపాలెం బస్టాండు ఇన్‌గేట్‌ సమీపం నుంచి కళావెంకటరావు సెంటర్‌ వరకు బస్సుపైకి ఎక్కారు. అరటి రైతులు తమ సమస్యలు చెప్పుకోడానికి అరటి గెలలు వేసుకుని బస్సుయాత్ర వద్దకు వచ్చారు. జగన్‌ కింది దిగితే సమస్యలు వివరిద్దామని ఎదురుచూశారు. కిందకు దిగేందుకు సుముఖత వ్యక్తం చేయని జగన్‌.. ఇద్దరు వస్తే మాట్లాడతానన్నారు. తర్వాత ఆ అవకాశం కూడా ఇవ్వకుండా తర్వాత మాట్లాడదామని ముందుకెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని