జగన్‌ వచ్చె.. జనం హడలే!

సీఎం జగన్‌ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Published : 19 Apr 2024 05:28 IST

‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో తూర్పున అడుగœడుగునా ఆంక్షలే

ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ: సీఎం జగన్‌ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్తు తీగలు కత్తిరించి జనాన్ని అంధకారంలోకి నెట్టేశారు. దుకాణాలు మూయించేశారు. ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో మండే ఎండల్లో విసుక్కుంటూ నిట్టూర్చాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి నుంచి గురువారం ఉదయం బయల్దేరిన బస్సుయాత్ర పెరవలిలో తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ప్రవేశించిన యాత్ర రావులపాలెం, ఆలమూరు, కడియం, రాజమహేంద్రవరం గ్రామీణ మండలాల మీదుగా నగరంలోకి చేరుకుంది. రాజానగరం నియోజకవర్గం ఎస్టీ రాజపురం వద్ద రాత్రి బస ప్రాంగణం వరకు యాత్ర సాగింది. ఈ మార్గంలో బస్సుకు అడ్డుగా ఉన్న విద్యుత్తు తీగలు, చెట్ల కొమ్మలను తొలగించారు. రాజమహేంద్రవరంలో దేవీచౌక్‌, జాంపేట, గోకవరం బస్టాండ్‌, సీతంపేట, ఆర్యాపురం ప్రాంతాల్లో విద్యుత్తు తీగలు తొలగించడంతో అంధకారం నెలకొంది. వ్యాపారాలకు అంతరాయం కలగడంతో పాటు, 40 డిగ్రీలు దాటిన ఎండలకు విద్యుత్తు కోత తోడవ్వడంతో జనం ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి దుకాణాలు మూయించారు.

ట్రాఫిక్‌ ఆంక్షలతో ఎండలో విలవిల..

జాతీయరహదారిపై ప్రయాణించేవారికి మండుటెండలో చుక్కలు కనిపించాయి. పెరవలిలో సీఎం వాహనం ముందుకు కదలగానే 15 నిమిషాలు జాతీయరహదారిపై రాకపోకలను పోలీసులు అడ్డుకున్నారు. కాన్వాయ్‌ రెండు గ్రామాలు దాటిన తర్వాత ట్రాఫిక్‌ విడిచిపెట్టారు. ఎండకు తాళలేక, రోడ్డుపై వాహనాలతో నిరీక్షించలేక ప్రయాణికులు, వాహనచోదకులు అసహనం వ్యక్తం చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని