ఆయనే ఓ విపత్తు!

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది.

Published : 19 Apr 2024 05:33 IST

ఐదేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులను విస్మరించిన సీఎం
ఆనకట్టల నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యం
ఫలితంగా తొమ్మిదిసార్లు అనూహ్య దుర్ఘటనలు
జలాశయాల విధ్వంస రచనలో జగన్‌ది చెరిగిపోని రికార్డు
ఈనాడు, అమరావతి

మీటలు నొక్కే మాటల సారు...  చెప్పనివీ చేశానంటూ బాకాలు ఊదుతారు! అత్యవసర పనులను మాత్రం వదిలేశారు... ఆంధ్రావనిని అన్నపూర్ణగా మార్చిన... ఆకలిగొన్న కడుపులకు పట్టెడన్నం పెట్టిన... అమూల్యమైన ఆనకట్టలను గాలికొదిలేశారు... గ్రీజు పూయలేదు... సిమెంటు రుద్దనూలేదు! వరదలొస్తాయని తెలిసీ గురక పెట్టారు... డ్యాంలు కొట్టుకుపోయినా... జనం అసువులు బాసినా...ఆయన బాధపడలేదు... బాధ్యత వహించలేదు!!

గన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం దేవుడెరుగు ఉన్నవాటి నిర్వహణకు నిధులివ్వక ఏకంగా ఆనకట్టలే కొట్టుకుపోయాయి. నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచి... కృత్రిమ విపత్తుల్లో రికార్డు సృష్టించారాయన.విపత్తులు సంభవిస్తే ఒక నాయకుడు ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించాలి. ప్రాణ, ధననష్టం అతి తక్కువగా వాటిల్లేలా చూడాలి. ఈ ఐదేళ్ల పాలనలో ఆయనే ఒక విపత్తుగా మారిన భయాందోళన పరిస్థితులు రాష్ట్రానికి దాపురించాయి. ఇందుకు ప్రజల కళ్లముందే సంభవించిన దుర్ఘటనలు సాక్ష్యాలుగా నిలిచాయి.

ముందు చూపా... ఠాట్‌ అదెందుకు...?

వాతావరణ శాఖ, కేంద్ర జల సంఘం, కేంద్ర ప్రభుత్వం అందించే సమాచారం ఆధారంగా జగన్‌ సర్కారు స్పందించి... విపత్తు నిర్వహణపై ఏనాడూ దృష్టి పెట్టిన పాపాన పోలేదు. సాగునీటి రంగంలో ఎక్కడ... ఏ అధికారిని నియమించుకోవాలి... ఏ ప్రాజెక్టు నిర్వహణలో ఎవరికి అనుభవముందన్న పరిశీలన జరగలేదు. వరదల సమయంలో డ్యాంల నిర్వహణ తెలియని, ఏ కాలువలోకి ఎంత పరిమాణంలో నీటిని వదలాలో కూడా అవగాహన లేని ‘‘తన’’ వాళ్లకు ఇష్టారాజ్యంగా పదవులు కట్టబెట్టి... రాష్ట్ర ప్రజలకు చేతులారా కష్టాలు కొనితెచ్చిన పాలకుడిని ఏమనాలి? అలాంటి వారి పాలనలో ఏం జరుగుతుంది...? అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు కోల్పోయారు. డ్యాం దిగువనున్న గ్రామంలో కొందరు అనుభవజ్ఞులు.... వందల మంది ప్రజలను అప్రమత్తం చేసి కొండలు, గుట్టలు ఎక్కించి వారి ప్రాణాలను కాపాడారు. విపత్తును ఊహించినా... జగన్‌ నాయకత్వంలో పనిచేస్తున్న అధికారులు మాత్రం చేష్టలుడిగి చూశారు.


ఇవీ జగన్‌ సృష్టించిన కృత్రిమ విపత్తులు

  •  2020లో కృష్ణా నదికి వచ్చిన వరదను ఏపీలో సరిగ్గా నిర్వహించని ఫలితంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 51 గ్రామాలు మునిగిపోయి వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. తెలంగాణలో క్లౌడ్‌ బరస్ట్‌ (అతి భారీ వర్షాలు) ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినా, అక్కడి నీరంతా నది నుంచి దిగువకే వస్తుందని తెలిసినా... ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు.
  •  2020 ఆగస్టు, 2021 సెప్టెంబరు నెలల్లో శ్రీశైలం జలాశయం నిర్వహణ తీరుపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ రెండేళ్లలోనూ క్రస్ట్‌ గేట్లపై నుంచి నీరు పొంగి పొర్లింది.
  •  2020లో వచ్చిన భారీ వరదలకు పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాల్‌ ధ్వంసమైంది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎగువ కాఫర్‌డ్యాంలోని గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడమే ఇందుకు కారణం. దాంతో డయాఫ్రం వాల్‌ను మళ్లీ రూ.వందల కోట్లు వెచ్చించి కొత్తగా నిర్మించాల్సి వచ్చింది.
  •  2021 ఆగస్టు 5న పులిచింతల ప్రాజెక్టులో 16వ నంబరు గేటు కొట్టుకుపోయింది. టైప్లాట్లు పూర్తిగా తెగిపోయాయి. అప్పటికి రెండేళ్లుగా గేట్ల నిర్వహణను పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు తేల్చారు.
  •  2021లోనే భారీ వర్షాలకు పింఛా ప్రాజెక్టు మట్టికట్ట కూడా కొట్టుకుపోయింది.
  •  2021లో అన్నమయ్య జలాశయం మట్టి డ్యాం కొట్టుకుపోయి, 39 మంది చనిపోయారు. ఇళ్లు మునిగి, వందల కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయి. ప్రాజెక్టు గేట్లు సరిగా పనిచేయడం లేదని తెలిసినా వాటిని బాగు చేయడానికి వైకాపా సర్కారు నిధులు ఇవ్వలేదు. భారీ వరదపై సమాచారమున్నా గేట్లు ఎత్తడంలో నిర్లక్ష్యం చేశారు.
  •  2022 ఆగస్టు 31 రాత్రి గుండ్లకమ్మలో మూడో నంబరు గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతుల కోసం రూ.3 కోట్లు కావాలని ప్రతిపాదించినా... జగన్‌ సర్కారు స్పందించకనే ఈ పరిస్థితి ఎదురైంది.
  • 2023 డిసెంబరు 8న రాత్రి గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు రెండోసారి కొట్టుకుపోయింది. అంతకుముందే కొట్టుకుపోయిన గేటును కూడా జగన్‌ సర్కారు మళ్లీ బిగించకలేకపోయింది.
  •  ‘పోలవరం’లో నిర్మించిన గైడ్‌బండ్‌ 2023 ఆగస్టులో కుంగిపోయింది. వైకాపా సర్కారు వచ్చాక చేపట్టిన ఈ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం, డిజైన్లకు అనుగుణంగా పనులు చేపట్టకపోవడం, తగిన సమయంలో కట్టడాన్ని పూర్తి చేయకపోవడమే కారణమని తేల్చారు.

బాధపడరు... బాధ్యత వహించరు

ప్రాజెక్టులకు గ్రీజు పెట్టడానికి డబ్బులు కావాలని, శ్రీశైలం జలాశయంలో చేసిన పనులకు బిల్లులివ్వాలని విన్నవించుకున్నా అధినేత స్పందించరు. వానాకాలానికి ముందే ప్రాజెక్టులకు ఏ అవసరాలు ఉన్నాయో సమీక్షించరు. నిధులను సర్దుబాటు చేయరు. ఫలితంగా శ్రీశైలం గేట్ల మీది నుంచి వరద నీరు ప్రవహించింది. గుండ్లకమ్మ ప్రాజెక్టులో ఒక్కసారి కాదు ఏకంగా రెండు పర్యాయాలు గేట్లు కొట్టుకుపోయాయి. పులిచింతల గేటూ వరదపాలైంది. ఏమైనా జరగనివ్వండి మేం బాధపడం... బాధ్యత వహించం... అనేది వైకాపా సర్కారు సిద్ధాంతం.


గుత్తేదారులూ ముందుకు రావడం లేదు

జగన్‌ సర్కారులో బిల్లుల చెల్లింపులు సరిగా లేకపోవడంతో చిన్నచిన్న పనులు చేసేందుకు సైతం గుత్తేదారులు ముందుకు రావడం లేదు. తక్కువ మొత్తంలోని బిల్లులకూ ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తుండటంతో వారు కొత్త పనులు చేయడానికి భయపడుతున్నారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు పలుమార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదు.

రాష్ట్రంలో డ్యాం భద్రతా కమిటీ తరఫున ప్రతి సంవత్సరం కొన్ని ప్రాజెక్టులను సందర్శించి వాటి నిర్వహణ, ఇతర సమస్యలను పరిశీలించి... చేపట్టాల్సిన పనులపై నివేదికలిచ్చినా అందుకు తగ్గ చర్యల్లేవు. డ్యాంలు, గేట్లు కొట్టుకుపోయినప్పుడు నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకున్న దాఖలాలూ లేవు.


కొద్దిపాటి నిధుల విడుదలపైనా నిర్లక్ష్యం

ప్రాజెక్టుల నిర్వహణకు కొద్దిపాటి నిధులనూ జగన్‌ సర్కారు ఇవ్వడం లేదు. అత్యంత విలువైన ఈ డ్యాంలను కాపాడుకునేందుకు ప్రతి ఏటా నిర్వహణ పనులను తప్పనిసరి చేపట్టాలి. అన్ని పరికరాలను తనిఖీ చేసుకోవాలి. గ్రీజు పెట్టుకోవాలి. తలుపులు ఎత్తే వ్యవస్థలను పరీక్షించుకోవాలి. వాటికి తుప్పు పట్టిందా... గట్టిగా ఉన్నాయా... అనేది పరిశీలించి ఎప్పటికప్పుడు బాగు చేసుకోవాలి. ఇలాంటి పనులకు నిధులు కావాలని అధికారులు ప్రతిపాదించినా పట్టించుకునే నాథులే లేరు.

  •  విశాఖలోని మేహాద్రిగడ్డ రిజర్వాయర్‌ స్పిల్‌ వే గేట్లు దెబ్బతిన్నాయి. ఆరు గేట్లలో రెండు పూర్తిగా తెరవడానికి వీల్లేని దుస్థితికి చేరాయి. వీటి మరమ్మతుకు రూ.3.4 కోట్లు అవసరమని అధికారులు నివేదించినా లాభం లేకపోయింది.
  •  ఉత్తరాంధ్రలోని రైవాడ జలాశయంలోనూ గేట్లు పాడయ్యాయి. వీటికీ నిధులివ్వడం లేదు. కోనాం జలాశయంలో స్పిల్‌వే గేటు కుంగిపోయింది. పెద్దేరు జలాశయంలోనూ నీరు లీకవుతోంది.
  •  రాయలసీమలోని అనేక ప్రాజెక్టులు దుస్థితిలో ఉన్నాయి. ఈ ప్రాంతానికి కీలకమైన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నిర్వహణకు సైతం నిధులు ఇవ్వలేదు. సుంకేశుల ప్రాజెక్టూ సమస్యల్లోనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలానికీ అన్నీ సవాళ్లే. ప్రాజెక్టులో మూడు సబ్‌ డివిజన్ల కింద నిర్వహణకు నిధులు అవసరమని ప్రతిపాదించినా స్పందించలేదు. మొత్తానికి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నాయి.

ఆదేశాలే తప్ప ఆచరణ లేదు

‘‘రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాజెక్టులపై సమగ్ర అధ్యయనం చేయాలి. అవసరమైన చర్యలు తీసుకోవాలి’’ అని జగన్‌ 2021 డిసెంబరు 9న తన యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రాజెక్టుల భద్రతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక కమిటీని వేశారు. వీటివల్ల రాష్ట్రంలోని సాగునీటి రంగానికి ఎలాంటి ప్రయోజనం ఒనగూరలేదు. ప్రాజెక్టుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం డ్రిప్‌ పథకం కింద నిధులిస్తున్నా... జగన్‌ వాటినీ సాధించలేకపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని