పేదలతో చెడు‘గూడు’!

‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్‌ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్‌.

Updated : 20 Apr 2024 14:08 IST

ఐదేళ్లలో 25 లక్షల గృహాలు కట్టిస్తామన్న జగన్‌ సర్కారు
కోరుకున్న వారికి ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని హామీ
‘మేం కట్టేవి ఇళ్లు కాదు.. ఊళ్లంటూ’ ప్రగల్భాలు
ఐదేళ్లు పూర్తయ్యాక.. పునాదులు దాటనివే లక్షలు!
ఈనాడు, అమరావతి

‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్‌ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్‌. ఫలితమే పునాదుల్ని దాటని ఇళ్లు.. మొండి గోడలతో దర్శనమిస్తోన్న కాలనీలు!

పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రతిపక్షనేతగా.. అధికారం చేపట్టాక.. జగన్‌ పలికిన ప్రగల్భాలు అన్నీ   ఇన్నీ కావు. ‘పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తాం..    ఐదేళ్లలో 25 లక్షల గృహాలు నిర్మిస్తామ’ని గొప్పలు చెప్పారు. ఇదే విషయాన్ని మ్యానిఫెస్టోలోనూ ముద్రించారు. అంతటితో ఆగకుండా.. ‘మేము కట్టేవి ఇళ్లు కాదు.. ఊళ్లం’టూ ఉపన్యాసాలు ఇచ్చారు.     నవరత్నాలంటూ ఇళ్ల నిర్మాణంపై ఇచ్చిన రత్నాన్ని   ఒక్కసారి పరిశీలిస్తే ఆయన పాలనాతీరు ఎంత అధ్వానమో ఇట్టే తెలిసిపోతుంది. ఆయన హామీగా ఇచ్చింది అసలు రత్నం కాదని, అది రాయి అని తేటతెల్లమవుతుంది. 25 లక్షల గృహాలు పూర్తవడం అటుంచితే.. ఇప్పటికి ఆయన చేపట్టింది  18.43 లక్షల ఇళ్ల నిర్మాణమే. కొసమెరుపేంటంటే.. ఈ 18.43 లక్షల నిర్మాణాలను 2023 డిసెంబర్‌ నాటికే పూర్తి చేస్తామని చెప్పడం.

7.25 లక్షల నిర్మాణాలు పునాదులు కూడా దాటలేదు...

డిసెంబరు 2020లో తొలి విడతగా 16.54 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగన్‌.. వాటిని 2022 నాటికి పూర్తి చేస్తామన్నారు. అయినా ఇంటి నిర్మాణానికి పేదలెవరూ ముందుకు రాలేదు. రెండో సారి 2021 జూన్‌లో లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చి మరీ 10 లక్షల   గృహాలకు భూమి పూజ చేయించారు. అప్పటికీ నిర్మాణాలు వేగిరం కాలేదు. ఇచ్చిన మాట ప్రకారం 2022 నాటికి 16.54 లక్షల గృహాలు పూర్తి చేయలేదు. ఇది ఇలా ఉండగానే అదే ఏడాది రెండో విడత కింద మరో 1.89 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని జగన్‌ ఆర్భాటంగా ప్రారంభించారు. ఇచ్చే రూ.1.80 లక్షలతో ఇళ్లు కట్టలేమని తేల్చి చెబుతూ కొంతమంది ఏకంగా పట్టాలే వెనక్కి ఇచ్చేశారు. ఇలా 50 వేల మందికి ఇచ్చిన ఇళ్లను రద్దు చేశారు. పేదలపట్ల ఇంత దుర్మార్గంగా   వ్యవహరించే ప్రభుత్వం మరేది ఉండబోదు. కర్నూలులో ఇళ్లు లేని పేదలు 25 వేల మంది వరకు ఉన్నారని గుర్తించి 2019లో వారికి పట్టాలు అందించారు. నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో పి.రుద్రవరం గ్రామ పరిధిలో కాలనీని ఏర్పాటు చేశారు. సరిహద్దులు ఏర్పాటు చేశారేగానీ.. స్థలాలు మాత్రం చూపించలేదు. ఇలా సరిహద్దు రాళ్లు మాత్రమే దర్శనమిచ్చే కాలనీలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి.

ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వడంపై జగన్‌ నాలుక మడత...

2020 డిసెంబరులో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన    చేసేటప్పుడు జగన్‌ మాటలు కోటలు దాటాయి. ప్రభుత్వమే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి ఇవ్వాలని అక్క   చెల్లెమ్మలు కోరుకుంటే.. ఆ బాధ్యతను సంతోషంగా తీసుకుని ఇళ్లను కట్టించి తాళాల్ని వారి చేతిలో  పెడతామంటూ గొప్పగా  ప్రకటించారు. ఇంటి నిర్మాణానికి ఇచ్చే డబ్బు చాలా తక్కువ కావడంతో మెజారిటీ లబ్ధిదారులు ప్రభుత్వమే  కట్టి   ఇవ్వాలనే ఆప్షన్‌ను ఎంచుకున్నారు. దీంతో బిత్తరపోయిన జగన్‌.. రకరకాల కోతలు వేసి ఈ విభాగంలో లబ్ధిదారులను  3.25 లక్షలకు పరిమితం చేశారు.

అడుగడుగునా పేదలపై బెదిరింపులే...

పేదలకు ఇళ్ల స్థలాలిస్తామంటూ జగనన్న కాలనీల పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద కుంభకోణమే నడిపించింది. చాలా చోట్ల వైకాపా నేతలు, వారి అనుచరులకు మేలు జరిగేలా ప్రైవేటు స్థలాల కొనుగోలు జరిగింది. ఎక్కువ భాగం లబ్ధిదారులకు వారు నివాసం ఉండే  ప్రాంతానికి కిలోమీటర్ల దూరంలో.. లేదంటే.. కొండలు, గుట్టల మీద, చెరువుల పక్కన.. లోతట్టు ప్రాంతాలు,  మునకకు గురయ్యే చోట స్థలాల్ని కేటాయించారు. పైగా ఇల్లు కట్టుకుంటారా లేదా కట్టుకోలేమని రాసిస్తారా? అంటూ బెదిరింపులకు దిగారు.

ఇల్లు ప్రారంభించి.. అప్పుల్లో కూరుకుపోయి..

కొందరు ప్రభుత్వ వేధింపులు భరించలేక మంజూరైన ఇల్లు ఎక్కడ పోతుందోననే భయంతో అప్పోసొప్పో చేసి నిర్మాణాలు చేపట్టారు. చాలామంది వడ్డీలకు తెచ్చి ఇళ్లు పూర్తి చేసుకుని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడుతున్నారు. ఇంటి నిర్మాణానికి చేసిన అప్పు తీర్చలేక ఏలూరులో ఓ లబ్ధిదారు భర్త మల్లికార్జునరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ చట్రంలో ఇరుక్కున్న వారి దుర్భర పరిస్థితులకు   నిదర్శనమిది. మరికొందరు ప్రభుత్వ ఒత్తిడి భరించలేక ఇంటి పట్టాలను తక్కువ ధరకే ఇతరులకు అమ్మేసుకున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని చోట్ల వైకాపా నేతలే జగనన్న కాలనీల్లో గద్దల్లా వాలి స్థిరాస్తి వ్యాపారానికి తెర తీశారు.

గ్రామీణ పేదలకు నిరాశే

గ్రామీణ పేదలపై జగన్‌ మరింత  కర్కశంగా వ్యవహరించారు. గ్రామాల్లో 2 లక్షల మంది ఇళ్లులేని పేదలు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఐదేళ్ల పాలనను  వెలగబెట్టి కూడా వారికి ఇళ్లు మంజూరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఉండే ఇళ్ల నిర్మాణానికి మాత్రమే నిధులిస్తోంది. పూర్తి గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంది. ఇక్కడున్న 2 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేస్తే మొత్తం రూ.1.80 లక్షలు రాష్ట్ర    ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. అందుకే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు.


ఆదివాసీ గిరిజనులకూ వెన్నుపోటే..

ఇదే కాదు... ఆరునెలల క్రితం కేంద్రం 52 వేల మంది ఆదివాసీలకు ఇళ్లు మంజూరు చేసే వరకు వారికి కూడా గూడు కల్పనలో జగన్‌ ఎలాంటి ఆదరువు ఇవ్వలేదు. ఒక్క అల్లూరి జిల్లాలోనే 32 వేల మంది ఇళ్లు లేని ఆదివాసీ గిరిజనులు ఉన్నారని తెలిసీ నాలుగున్నరేళ్లు మంజూరు చేయకుండా మీనమేషాలు లెక్కించారు.


ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణం దారుణం...

పేదరికంతో ఇళ్లు కట్టుకోలేని లబ్ధిదారులపై విపరీతమైన ఒత్తిడి తెచ్చిన జగన్‌.. ప్రభుత్వమే కట్టిస్తామని(ఆప్షన్‌-3) చెప్పిన గృహాల్ని వేగంగా పూర్తి చేశారా? అంటే అదీ లేదు. 3.25 లక్షల నిర్మాణాల్లో ఇప్పటికి పూర్తి అయింది 50 వేలే. 2.50 లక్షల గృహాలు బేస్‌మెంట్‌, అంతకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. నెల్లూరు పరిధిలోని వెంకటేశ్వరపురంలో 35 సిమెంటు బస్తాలు మాత్రమే ఇంటి నిర్మాణానికి గుత్తేదారులు  వినియోగిస్తున్నారంటే నాణ్యత ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


మౌలిక సదుపాయాల ఊసే లేదు...

దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా 17 వేల కాలనీలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన జగన్‌.. అక్కడ మౌలిక సదుపాయాలూ అద్భుతంగా ఉంటాయన్నారు. చచ్చీచెడి ఆరు నెలల క్రితం 26 కాలనీలను ప్రారంభించారు. ఈ కాలనీల్లో కూడా సిమెంటు రహదారులు ఏర్పాటు చేయలేదు. మురుగు కాల్వలు అందుబాటులోకి తీసుకురాకుండా ఇంకుడు గుంతలు తవ్వి వాటితో సరిపెట్టుకోండని వదిలేశారు. ఇక ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేస్తామని చెప్పి.. అరకొరగా  తాగునీటి సౌకర్యాన్ని కల్పించి పేదల్ని ఇబ్బందుల పాలుజేస్తున్నారు. జగనన్న కాలనీల్లో   18 రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు మొదలు ఆరోగ్య కేంద్రాలు, ఆర్‌బీకేలు, సచివాలయాలు, రైతు బజార్లు, పార్కులు, శ్మశానవాటికలు, కమ్యూనిటీ హాల్స్‌, తదితర సౌకర్యాలు కల్పిస్తామని ఊదరగొట్టారు. ఐదేళ్లు అధికారమిస్తే ఒక్కటంటే ఒక్క కాలనీలో కూడా పైన పేర్కొన్న వాటిలో  ఏ పనీ చేయలేదు. ఇలా ఉంది జగన్‌ పాలనలో  ఇళ్ల కట్టుడు!


గ్రామీణ ప్రాంతాల్లో రూపాయైనా ఇవ్వలేదు..

ఒక్కో ఇంటి నిర్మాణానికిగాను కేంద్రం రూ.1.50 లక్షలు మంజూరు చేస్తోంది. పట్టణాభివృద్ధి సంస్థల్లో అయితే ఉపాధి హామీ పథకం కింద మరో రూ.30 వేలు అందిస్తోంది. అంటే ఇప్పుడు పట్టణాభివృద్ధి సంస్థల్లోని లబ్ధిదారులకు అందుతున్న   రూ.1.80 లక్షలూ కేంద్రానిదే. పట్టణ ప్రాంతాల్లోకి వచ్చే సరికి కేంద్రమిచ్చే   రూ.1.50 లక్షలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేలు మాత్రమే ఇస్తోంది. నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయని, ఇక్కడ మరో లక్ష అదనంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని లబ్ధిదారులు వేడుకున్నా జగన్‌ వినలేదు. అదే 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు ఇంటి నిర్మాణానికి అందించింది. పైగా, ఎస్సీలకు రూ.2.25 లక్షల వరకు, ఎస్టీలకు రూ.2.50 లక్షల వరకు ఇంటి నిర్మాణానికి చేయూత అందించింది. అప్పట్లో 9 లక్షల గృహాల్ని పూర్తి చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ రూ.30 వేలు (అదీ పట్టణ ప్రాంతాల్లోనే) మినహా ఇచ్చిందేమీ లేదు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని