పసివాడిన ప్రాణాలు!

పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్‌ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు.

Published : 20 Apr 2024 06:17 IST

రాష్ట్ర ఆసుపత్రుల్లో శిశువుల మరణ మృదంగం!
దుర్భరంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రాల పనితీరు
తిరుపతి రుయా, కర్నూలు, విజయవాడ ఆసుపత్రుల్లో 25 శాతం వరకూ మరణాలు
మినీ కేంద్రాల వైఫల్యంతో పెరుగుతున్న రిఫరల్‌ కేసులు, మృతుల సంఖ్య  
వెక్కిరిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత
తల్లిదండ్రులకు శాపంగా మారిన జగన్‌ సర్కారు నిర్లక్ష్యం
ఈనాడు, అమరావతి

పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్‌ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. వైద్యులు లేక.. సిబ్బంది సరిపోక.. వసతుల లేమితో.. పసిపిల్లలు పొత్తిళ్లలోనే పిట్టల్లా రాలిపోతున్నారు. చిన్నారుల కోసమే ప్రత్యేకంగా ఆసపత్రులు నిర్మిస్తామని చెప్పి.. అయిదేళ్లయినా కట్టలేకపోయిందీ అమానవీయ సర్కారు.

ప్రతి ఒక్కరికీ ప్రాథమిక హక్కుగా అందాల్సిన వైద్యం మన రాష్ట్రంలో అంపశయ్యపై అల్లాడుతోంది. సర్కారు ఆసుపత్రుల్లో సేవలు రోజురోజుకు మృగ్యంగా మారుతున్నాయి. తల్లి గర్భం నుంచి అప్పుడే బాహ్య ప్రపంచంలోకి వచ్చిన శిశువులకూ కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఉన్న నవజాత శిశు సంరక్షణ కేంద్రాలూ (ఎస్‌ఎన్‌సీయూ రెగ్యులర్‌-సిక్‌ న్యూబార్న్‌కేర్‌ యూనిట్‌) అసౌకర్యాలకు నెలవుగా మారాయి. కొన్ని ఆసుపత్రుల్లో మృతుల సంఖ్య పాతిక శాతం వరకూ ఉంటోంది. వైద్య నిపుణల కొరత, సరైన పరికరాలు లేకపోవడం ప్రధాన కారణాలు. అభం శుభం  తెలియని చిన్నారులు పొత్తిళ్లలోనే కళ్లు మూస్తున్నా.. జగన్‌కు చీమ కుట్టినట్లయినా ఉండటం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తిరుపతి రుయాలో 24.5శాతం, కర్నూలు జీజీహెచ్‌లో 23.2 శాతం శిశువులు ప్రాణాలు కోల్పోవడం వైకాపా ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. హైదరాబాద్‌లోని నిలోఫర్‌ మాదిరిగా రాష్ట్రంలోనూ ప్రత్యేక ఆసుపత్రి నిర్మిస్తామని గొప్పగా ప్రకటించినా.. కార్యరూపం దాల్చలేదు.


ఏలూరు నుంచి విజయవాడ, గుంటూరుకు..

ఏలూరు జిల్లాలో నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్లో సేవలు అగమ్యగోచరంగా మారాయి. సౌకర్యాలున్నా.. సిబ్బంది, వైద్యులు కరవయ్యారు. దీంతో పరిస్థితి విషమంగా ఉన్న చిన్నారులను విజయవాడ, గుంటూరుకు రిఫర్‌ చేస్తున్నారు. ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో 20 ఇంక్యుబేటర్లు ఉన్నాయి. నిపుణులు అందుబాటులో లేకపోవటంతో వాటిని వినియోగించడం లేదు. ఇక్కడ వైద్యులు ఆరుగురు ఉండాల్సి ఉండగా నలుగురే ఉన్నారు. 14 మంది స్టాఫ్‌నర్సులకు ఆరుగురు మాత్రమే ఉన్నారు. నెలకు దాదాపు 15 నుంచి 20 కేసులను ఏలూరు నుంచి రిఫర్‌ చేస్తున్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న బుట్టాయిగూడెం, పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మినీ నవజాత శిశు కేంద్రాల్లోనూ వైద్యుల కొరత వెక్కిరిస్తోంది. దాంతో ఇక్కడి కేసులను జిల్లా కేంద్రానికి రిఫర్‌ చేస్తున్నారు.


రంపచోడవరంలో ఏరియా ఆసుపత్రి వైద్యుడే దిక్కు

మినీ ఎస్‌ఎన్‌సీయూల్లో సరిపడా వైద్యులు, సిబ్బంది, తగిన మౌలిక వసతులు లేకపోవడంతో పసివాళ్ల ప్రాణాలకు ముప్పుగా మారింది. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో పూర్తిస్థాయిలో డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు లేరు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో పుట్టిన వారితోపాటు బయట పీహెచ్‌సీల నుంచీ శిశువులను మెరుగైన వైద్యం కోసం నిత్యం ఇక్కడకు తరలిస్తుంటారు. అయితే ఈ విభాగంలో ఇద్దరు వైద్యులు పనిచేయాల్సి ఉండగా ఒక్కరూ లేరు. ఆరుగురు స్టాఫ్‌ నర్సులకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. దీంతో ఏరియా ఆసుపత్రిలోని వైద్యుడే ఇక్కడా సేవలు అందించాల్సి వస్తోంది. వైద్యులు లేని విషయాన్ని ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకువెళ్లామని ఏరియా ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.


ఊపిరి ఆడక చిన్నారుల గిజగిజ

కర్నూలు బోధనాసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూకు 40 వెంటిలేటర్ల అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న ఐదింటిలో రెండు మరమ్మతులకు గురయ్యాయి.    ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఐసీయూ విభాగాల్లో సరిపడినన్ని ఏసీలు లేకపోవడంతో శిశువులు సతమతమవుతున్నారు. కొవిడ్‌ సమయంలో కర్నూలు జీజీహెచ్‌కు వచ్చిన వెంటిలేటర్లలో 20 వినియోగించడం లేదు. ఒకే వార్మర్‌, ఒకే ఫొటో థెరపీ యూనిట్‌లో ఇద్దరు, ముగ్గురు పిల్లలను ఉంచాల్సిన దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అదనపు వెంటిలేటర్ల అవసరం ఉండటంతో ఎస్‌ఎన్‌సీయూ-2ను ఏర్పాటు చేసినా, సౌకర్యాలు  కల్పించకపోవడంతో ఇంకా వినియోగంలోకి రాలేదు. ఎస్‌ఎన్‌సీయూకి    అనుబంధంగా పది పడకలతో ఎన్‌ఐసీయూ (నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)ను రెండు దశాబ్దాల కిందటే ప్రారంభించారు. ఆ తర్వాత మరో పది పడకలు అందుబాటులోకి తీసుకొచ్చినా, మరింత విస్తరించాల్సి ఉంది.


బాపట్లలోని ‘ఎస్‌ఎన్‌సీయూ’కు తాళాలు

బాపట్ల ప్రాంతీయ వైద్యశాలలో పసిబిడ్డలకు అత్యవసర వైద్యం మృగ్యంగా మారింది. నాలుగు పిల్లల వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ యూనిట్కు తాళం వేసేశారు. వార్మర్లు, ఫొటో థెరపీ యూనిట్లు నిరుపయోగంగా మారాయి. ఆర్థికంగా భారమైనా తల్లిదండ్రులు శిశువులను ప్రైవేటు ఆసుపత్రులకే తీసుకువెళ్తున్నారు.


నలుగురికి నలుగురూ..

తెనాలి ఆసుపత్రి మాతాశిశు సంరక్షణ కేంద్రంలోని ఎస్‌ఎన్‌సీయూలో నాలుగు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓపీలో పిల్లలను చూసే వైద్యులే దిక్కుగా మారారు. చీకటి పడిన తర్వాత అత్యవసర వైద్యం కోసం వచ్చే వారిని  గుంటూరుకు రిఫర్‌ చేస్తున్నారు. పోస్టుల భర్తీ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేంద్రం అవసరాలకు ఒప్పంద విధానంలో ఏడాది కిందట నియమించిన నలుగురు వైద్యులు,    ఉన్నతావకాశాలు రావడంతో ఒక్కొక్కరుగా విధుల నుంచి తప్పుకొన్నారు.


నిర్ధారణ పరీక్షలకే దిక్కు లేదు

రాష్ట్ర వ్యాప్తంగా బోధన, ఇతర ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 27 ఎస్‌ఎన్‌సీయూలు పనిచేస్తున్నాయి. ఇందులో ఆరు మినహా మిగిలిన కేంద్రాలన్నింట్లో 20 చొప్పున పడకలు ఉన్నాయి. అనారోగ్యంతో వీటిల్లో చేరిన శిశువులను కంటికి రెప్పలా చూస్తేనే వారి విలువైన ప్రాణాలు నిలబడతాయి. అనంతపురం ఎస్‌ఎన్‌సీయూ-1, 2లో మూడు, చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో నాలుగు, రంపచోడవరంలో రెండు, తెనాలి జిల్లా ఆసుపత్రిలో మూడు, విజయవాడ ఎస్‌ఎన్‌సీయూ 1, 2లో కలిపి మూడు చిన్నపిల్లల వైద్య నిపుణుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి అదనంగా జిల్లా ఆసుపత్రులు, ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కలిపి 61 మినీ ఎస్‌ఎన్‌సీయూలు ఉన్నాయి. చాలా ఎస్‌ఎన్‌సీయూ కేంద్రాల్లో బ్లడ్‌ కల్చర్‌, యూరిన్‌ కల్చర్‌, మైక్రో ఈఎస్‌ఆర్‌ తదితర నిర్ధారణ పరీక్షలూ సక్రమంగా జరగడం లేదు.


రిఫరల్‌ కేసుల్లోనే మృతులు అధికం

ఇతర ఆసుపత్రుల నుంచి ఎస్‌ఎన్‌సీయూల్లో చేరిన (రిఫరల్‌) వారే ఎక్కువగా మృతి చెందుతున్నారు. మినీ ఎస్‌ఎన్‌సీయూల పనితీరు ఘోరంగా ఉండటమే కారణం.

2023-24లో వివిధ ఆసుపత్రుల్లోని ఎస్‌ఎన్‌సీయూల్లో మృతి చెందిన శిశువుల శాతం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని